‘లెక్క’ పనిచేయలేదేం?
- అభ్యర్థుల్లో అంతర్మథనం
- ఓడినా.. గెలిచినా... తగినన్ని ఓట్లు రాలేదు
- లెక్కల చిక్కులు.. అప్పుల తిప్పలు
సాక్షి, మచిలీపట్నం : ఓడిపోయి ఒకరు బాధపడుతుంటే.. గెలిచి మరోకరు మదనపడుతున్నారు.. ఇది సార్వత్రిక ఎన్నికల అనంతరం కన్పిస్తున్న చిత్రం. మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో అభ్యర్థులు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసిన సంగతి తెల్సిందే. ఓటు కోసం కోట్లు ఖర్చుచేసిన అభ్యర్థులు ఇప్పుడు తీరుబడిగా లెక్కల చిక్కులు, అప్పుల తిప్పలు తలుచుకునే పనిలో పడ్డారు.
ఇదే క్రమంలో ఓటమి భారంతో కుంగిపోతున్న అభ్యర్థులు.... ఇప్పుడు చేసిన అప్పుల భారాన్ని తలుచుకుని కంగారు పడుతున్నారు. అప్పులు చేసినా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పరువు దక్కేది, తీరా ఓడిపోవడంతో అప్పులు తిప్పలు మిగిలాయని మూగగ రోధిస్తున్నారు. ఓడిపోయిన వారే బాధపడుతున్నారనుకుంటే పొరపాటే... ప్రధానంగా గెలిచిన అభ్యర్థులు మద్యం, ఓట్లు కొనుగోలు, ప్రచారం కోసం అంచనాలకు మించి ఖర్చుచేసిన కోట్లాది రూపాయలను తలుచుకుని గుండెలు బాదుకుంటున్నారు.
దీనికితోడు పలు ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులు సైతం చేసిన ఖర్చులకు తగ్గట్టు ఓట్లు రాలేదన్న లెక్కలతో బిక్కమోహం వేస్తున్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకుగా గుర్తించి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము పంచినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్న వేదన గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పంచిన డబ్బుకు సరిపడే ఓట్లు వచ్చాయా? అనే దానిపై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అనునయులతో ఆరా తీస్తున్నారు.
జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఆశలుపెట్టుకుని ఆయన పెద్ద ఎత్తున ఖర్చుపెట్టారు. తీరా ఆయన అంచనాలు తల్లకిందులు చేస్తూ తగినన్ని ఓట్లు రాకపోవడంతో చివరి రౌండ్ వరకు బోటాబోటీగానే లాక్కొచ్చారు. ఆయన ఆశలుపెట్టుకున్న మైలవరం, జి.కొండూరు అంతగా కలిసి రాలేదని ఉమా అనుయాయులు లెక్కలు చెబుతున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుద్ధప్రసాద్ ఘంటసాల, చల్లపల్లి మండలాలపై పెట్టుకున్న ఆశలు అంతగా వర్కవుట్ కాలేదని అంటున్నారు. చేసిన ఖర్చులకు వచ్చిన ఓట్లకు తేడా ఉందని ఆయన అనుచరులు వాపోతున్నారు. బందరు నియోజకవర్గంలో కొల్లు రవీంద్రకు అనుకూలం అనుకున్న రూరల్ గ్రామాల్లో అనుకున్న స్థాయిలో ఓట్లు రాలలేదని, పట్టణంలో కొంత కలిసి వచ్చిందని అంటున్నారు.
మచిలీపట్నం రూరల్ కొన్ని గ్రామాలపై ఆశలుపెట్టుకుని ఖర్చుచేసినా అంత ప్రయోజనం కలగలేదని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, పెదపారుపూడి మండలాలపై ఆశ వదులుకున్న టీడీపీ నేతలు గుడివాడ పట్టణం, గుడ్లవల్లేరు మండలంపై ఆశలు పెట్టుకుని డబ్బులు వెదజల్లారు. అక్కడా అనుకున్న స్థాయి లో ఓట్లు రాలకపోవడంతో ఘోరంగా పరాజయం పాలుకావాల్సి వచ్చిందని మదనపడుతున్నారు.
పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు అంతగా అనుకూలంగా లేవని ముందుగానే టీడీపీ నేతలు గుర్తించారు. దీంతో మొవ్వ, పామర్రు మండలాలపై ఆశలుపెట్టుకుని డబ్బులు కుమ్మరించారు. తీరా అక్కడా ఫలితం లేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇలా గెలిచినా, ఓడినా చేసిన ఖర్చుకు తగినన్ని ఓట్లు రాలేదన్న వేదన మాత్రం అభ్యర్థుల మదిని తొలిచే స్తోంది.