ఎన్నికల నామ సంవత్సరం | 2014 year in Election Noise | Sakshi
Sakshi News home page

ఎన్నికల నామ సంవత్సరం

Published Tue, Dec 30 2014 2:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎన్నికల నామ సంవత్సరం - Sakshi

ఎన్నికల నామ సంవత్సరం

సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చిన స్థానిక ఎన్నికలూ 2014లో జరిగాయి. ఒక దాని వెనుక ఒకటిగా జరిగిన ఆ ప్రజాస్వామిక పోరులతో 2014ను ‘ఎన్నికల నామ సంవత్సరం’ అభివర్ణించవచ్చు. కాగా ‘తూర్పు’న గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని 2014 సంవత్సరంలో మరోసారి రుజువైంది. సమైక్య రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో, విభజన తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఇదే రివాజు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టింది.  సార్వత్రిక ఎన్నికల్లోనే కాక మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ పైచేయి సాధించింది. తొలిసారి సార్వత్రిక ఎన్నికల గోదాలోకి దిగిన  వైఎస్సార్ కాంగ్రెస్ గణనీయమైన విజయాలు సొంతం చేసుకుని సత్తా చాటింది. 125  ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పొందలేక చతికిలపడింది. ఎన్నికల ముందు పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్రతో పాటు కమ్యూనిస్టు పార్టీలూ కనీస ఉనికిని చాటుకోలేకపోయాయి.
 - అమలాపురం
 
 జిల్లాలో 2014 ఆరంభం నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోనారంభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల , టీడీపీ, బీజేపీ కూటమి తరఫున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ తరఫున  కేంద్రమాజీ మంత్రి చిరంజీవి జిల్లాలో ప్రచారం సాగించారు. రాష్ట్ర విభజన ఖరారు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠం కోసం ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ- బీజేపీ కూటమి తలపడ్డాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు తీర్పుతో అనుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిపడ్డాయి. ప్రధాన పార్టీలకు, ఆ పార్టీ ఆశావహులకు ఇది ఇబ్బందికరంగా మారింది. మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ముందే పూర్తయినా ఫలితాల వెల్లడిని కోర్టు నిలిపివేసింది. ఆ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందనే ఆ విధంగా నిర్దేశించింది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు మార్చి 24న జరగ్గా ఫలితాలు మే 13న, రెండు విడతలుగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెండవ విడత ఏప్రిల్ 31న జరగ్గా ఫలితాలు మే 14న వెల్లడయ్యాయి. సార్వత్రిక ఎన్నికలు మే 7న జరిగితే మే 16న ఫలితాలు వెలువడ్డాయి. మే 13, 14, 16 తేదీల్లో జిల్లాలో నెలకొన్న రాజకీయ సందడి అంతాఇంతా కాదు.
 
 పదేళ్ల తర్వాత ‘సైకిల్’ స్పీడు
 పదేళ్ల తరువాత జిల్లా రాజకీయాల్లో టీడీపీ పట్టును చాటింది. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా వీచిన నరేంద్రమోదీ అనుకూల పవనాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ఆ పార్టీకి కలిసి వచ్చాయి. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఎడాపెడా ఇవ్వడమూ ఆ పార్టీకి అనుకూలాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా అమలాపురం, రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ స్థానాలను, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, మండపేట అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 57 జెడ్పీటీసీలకు 43 జెడ్పీటీసీలు, 44 మండలాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ రాజమండ్రి కార్పొరేషన్, తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యతతో గెలుచుకోగా, సమాన స్థానాలు పొందిన ఏలేశ్వరం, ముమ్మిడివరం నగర పంచాయతీలను రాష్ర్టంలో అధికారాన్ని చేపట్టాక దక్కించుకోగలిగింది. పదేళ్ల తరువాత పూర్వవైభవం రావడంతో టీడీపీలో ఉత్సాహాన్ని నింపింది. అయితే చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించడంతో నమ్మి ఓటు వేసిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
 
 రాజమండ్రి సిటీలో బీజేపీ పాగా
 పదేళ్ల తరువాత టీడీపీతో మరోసారి జట్టు కట్టి బీజేపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ స్థానం నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులేకపోవడం, అప్పటికీ మోదీ ప్రభంజనం ఆరంభం కాకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట ధరావత్తు కోల్పోయారు. టీడీపీతో పొత్తు ఉన్నా స్వతంత్రంగా ఎదగాలని భావిస్తున్న ఆ పార్టీ జిల్లాలో పలువురిని పార్టీలో చేర్చుకోవడం ఈ ఏడాది కొత్త రాజకీయ పరిణామం. ఇది ముందుముందు టీడీపీ, బీజేపీల మితృత్వానికి సవాలు కానుంది.
 
 పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్
 125 ఏళ్ల చరిత్ర, పదేళ్ల అధికారం.. ఇవేమీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో అక్కరకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ధరావతులు కూడా పొంద లేకపోయారు. జిల్లా చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక్కరు కూడా డిపాజిట్లు పొందలేదంటే ఆ పార్టీపై ప్రజలకు ఏ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఆ పార్టీ తరఫున గెలిచినవారు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పటి వరకు పార్టీ తరఫున ఎంపీలుగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్, జి.వి.హర్షకుమార్, మంత్రులుగా పనిచేసిన పినిపే విశ్వరూప్, తోట నరసింహం వంటి వారు ఎన్నికల ముందు పార్టీని వీడిపోయారు. పార్టీ తరఫున పోటీ చేస్తే ఓట్లు రావని సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్వతంత్రంగా బరిలో దిగాల్సిన దుస్థితి నెలకొందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రమంత్రి హోదాలో పోటీ చేసిన ఎం.ఎం.పళ్లంరాజు, ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఘోరపరాజయాన్ని చవిచూశారు.
 
 ఎన్నికలకు ముందు పుట్టి.. కనుమరుగు
 ఎన్నికల ముందు ఆరంభమైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల తరువాత కనుమరుగైంది. ఈ పరిణామం ముందే ఊహించినది. ఆ పార్టీ కేవలం సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయగా పోటీచేసిన అభ్యర్థులు అన్నిచోట్ల ధరావతు కోల్పోవడంతో ఉనికే లేకుండా పోయింది. పదేళ్లు ఎంపీగా ఉండి, జై సమైక్యాంధ్ర తరఫున అమలాపురం నుంచి పార్లమెంట్ బరిలో దిగిన జి.వి.హర్షకుమార్ సైతం ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక ఏనాటి నుంచో జిల్లాలో నామమాత్రంగా మిగిలిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే.. సీపీఐ తరఫున భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సున్నం రాజయ్య.. ముంపు మండలాల విలీనం తర్వాత.. ఈ జిల్లా సమావేశాల్లో పాల్గొనడం ఆ పార్టీకి కొంత ఊరట.
 
 
 సార్వత్రిక ఎన్నికలతో పాటు.. ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చిన స్థానిక ఎన్నికలూ 2014లో జరిగాయి. ఒక దాని వెనుక ఒకటిగా జరిగిన ఆ ప్రజాస్వామిక పోరులతో 2014ను ‘ఎన్నికల నామ సంవత్సరం’ అభివర్ణించవచ్చు. కాగా ‘తూర్పు’న గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని 2014 సంవత్సరంలో మరోసారి రుజువైంది. సమైక్య రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో, విభజన తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఇదే రివాజు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టింది.  సార్వత్రిక ఎన్నికల్లోనే కాక మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ పైచేయి సాధించింది. తొలిసారి సార్వత్రిక ఎన్నికల గోదాలోకి దిగిన  వైఎస్సార్ కాంగ్రెస్ గణనీయమైన విజయాలు సొంతం చేసుకుని సత్తా చాటింది. 125  ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పొందలేక చతికిలపడింది. ఎన్నికల ముందు పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్రతో పాటు కమ్యూనిస్టు పార్టీలూ కనీస ఉనికిని చాటుకోలేకపోయాయి.
 - అమలాపురం
 
 వైఎస్సార్ సీపీకి పల్లెల్లో 43, పట్టణాల్లో 36 శాతం ఓటింగ్
 పార్టీ ఏర్పడిన మూడేళ్లకే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా చాటుకుంది. ఎన్నికల్లో ఆ పార్టీ విజయం తథ్యమని, తూర్పున గణనీయమైన విజయాలు సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ క్యాడరే కాదు.. ప్రత్యర్థులు కూడా అంగీకరించే వారు. చంద్రబాబు హామీలు, బీజేపీతో పొత్తు, పవన్ ప్రచారం టీడీపీకి కలిసి రావడం వైఎస్సార్ సీపీకి ప్రతికూలమైంది. అయినప్పటికీ మెట్ట, ఏజెన్సీల్లో విజయాలను సొంతం చేసుకుంది. ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, కోనసీమలోని కొత్తపేట అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని స్వల్ప తేడాతో చేజార్చుకుంది. 14 జెడ్పీటీసీల్లో, 13 మండలాల్లో గెలుపొందింది. పల్లె ప్రాంతాల్లో 43 శాతం, పట్టణాల్లో 36 శాతం ఓటింగ్ సాధించి తూర్పున టీడీపీకి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement