మైనార్టీలు ఓట్లేయకపోవడంతోనే ఓటమి
► కొంపముంచిన బీజేపీతో పొత్తు
► నగరపాలక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొందాం
► మాజీ మంత్రి టీజీ వెంకటేష్
కర్నూలు(అర్బన్): గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నా కొంప ముంచింది. ఈ కారణంగా మైనారిటీలు తనకు ఓట్లు వేయకపోవడంతో ఓటమి పాలయ్యానని’ మాజీ మంత్రి, కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జీ టీజీ వెంకటేష్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక మౌర్యాఇన్ హోటల్ సమావేశ భవనంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జె.తిరుపాల్‌బాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ క్రమ శిక్షణా సంఘం సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు మార్కెట్‌యార్డు చైర్మన్ శమంతకమణి, మాజీ మేయర్ బంగి అనంతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలను సమైఖ్యంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
నగరంలోని వార్డుల్లో కార్యకర్తల్లోని బేధాభిప్రాయాలను వారంతకు వారే సర్దుబాటు చేసుకోవాలన్నారు. అందరినీ కలుపుకుపోయే స్వభావంతో ముందుకు సాగాలని.. లేని పక్షంలో ఎవరి జెండా ... అజెండా వారికుంటుందన్నారు. ఈ నెల 27వ తేది నుంచి తిరుపతిలో మహానాడు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 23వ తేదిన కర్నూలు శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్‌లో మినీ మహానాడును నిర్వహిస్తున్నామన్నారు.