ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికార బీజేపీ–టీడీపీ నాయకులకు ఇవేమీ పట్టటం లేదు.
పాడేరు మోదమ్మ ఆలయంలో ప్రచార సభ
200 మందికి పైగా విందు ఏర్పాటు
ఇదీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచార తీరు
పాడేరు రూరల్ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికార బీజేపీ–టీడీపీ నాయకులకు ఇవేమీ పట్టటం లేదు. ఆలయాలు, చర్చిలు, ప్రభుత్వ పాఠశాలు, కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదన్న నిబంధన ఉంది. ఎక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేయకూడదు. కానీ టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సోమవారం పాడేరు మోదకొండమ్మ ఆలయ కల్యాణ మండపంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. హామీలు గుప్పించారు. సభ అనంతరం ఆలయం ప్రాంగణంలోనే సుమారు 200 మందికి పైగానే విందు భోజనాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
వీరికి కోడ్ వర్తించదా? అని పలువురు చర్చించుకోవడం కన్పించింది. ఈ విషయాన్ని తహసీల్దార్ దుర్గారవీంద్రనాథ్ వద్ద ప్రస్తావించగా కోడ్ అమల్లో ఉన్నందున ఆలయాలు, చర్చిల్లో ప్రచార సభలు నిర్వహించకూడదని, విందు ఏర్పాటు చేయకూడదని చెప్పారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రచారం విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే విచారణ చేపడతామని చెప్పారు.