పొత్తు రేపిన చిచ్చు
పొత్తు రేపిన చిచ్చు
Published Sun, Aug 13 2017 11:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
బీజేపీలో సీట్ల రగడ
–అగ్రవర్ణాలకు పెద్దపీట
– అణగారిన వర్గాలకు శూన్యహస్తం
– అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన బీసీ, ఎస్సీలు
– టీడీపీ డ్రామాకు బలి పశువులం అయ్యామని ఆవేదన
– బలం లేని డివిజన్‌లు అంటగట్టిందని ఆరోపణ
– తిరగబడ్డ బీజేపీ ఆశావహులు
– షాక్ తిన్న ఆ పార్టీ నేతలు
– రెబెల్స్‌గా బరిలో ఉంటామని అసంతృప్తివాదుల వార్నింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. టిక్కెట్ల సెగ తాకింది. టీడీపీ సీట్ల పంచాయితీ తేలకుండానే పార్టీలో చిచ్చు రేగింది. ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందని భావించిన కాషాయ పార్టీ నాయకులకు ఆదిలోనే తిరుగుబాటు ఎదురైంది. డివిజన్ల కేటాయింపులు చేయడంతో తమకు అన్యాయం జరిగిందని బీజేపీకి చెందిన ఎస్సీ, బీసీలు తిరగబడ్డారు. ఏకంగా కార్యాలయంపై దాడి చేసి రాళ్ల వర్షం కురిపించారు. సీట్లిస్తామని చెప్పి నామినేషన్ వేయించిన నాయకులు ఆ తర్వాత మొఖం చాటేస్తుండటంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. సీటిస్తే ఫర్వాలేదు...లేదంటే రెబెల్స్‌గా నిలబడటం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని బీజేపీ నేతలు కోలుకోలేని స్థితిలో ఉన్నారు.
తిరగబడ్డ ఆశావహులు
టీడీపీ తొలి జాబితా సిద్ధం చేసింది. 34 డివిజన్ల అభ్యర్థులను ఖరారు చేసింది. మిత్రపక్షమైన బీజేపీ తొమ్మిది డివిజన్లకు తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. అధికారికంగా ప్రకటించకపోయినా రెండు పార్టీల జాబితాలు బయటికొచ్చేశాయి. ఇంకా ఐదు డివిజన్లే పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు దాదాపు లీకవడంతో టీడీపీ, బీజేపీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధికారికంగా ఖరారు చేశాక సంగతేంటో చూస్తామని టీడీపీ శ్రేణులు వేచి చూసే ధోరణిలో ఉండగా....అంతవరకు వేచిచూసేంత ఓపిక లేదని తన అనుచరులతో కలిసి బీజేపీ ఆశావహులు రోడ్డెక్కారు. మెజార్టీ ఓట్లు ఉన్న ఎస్సీ, బీసీలకు కనీసం చోటు కల్పించలేదని, అగ్రవర్ణాలకే పెద్దపీట వేసి అణగారిన వర్గాలను పార్టీ అణగదొక్కిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఇదేదో నిరసన వరకు పరిమితం కాలేదు. కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. కార్యాలయం గోడలకున్న ఫ్లెక్సీలు చించేశారు. దీంతో బీజేపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. క్షణాల్లోనే పరిస్థితి చేయి దాటిపోయింది. నేతలపై దాడి చేసే స్థాయికి పరిస్థితులు వెళ్లిపోవడంతో జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. లేదంటే విధ్వంసానికి దారి తీసేది.
అన్యాయం చేసిన టీడీపీ– డిఫెన్స్‌లో పడ్డ బీజేపీ
సూత్రప్రాయంగా జరిగిన సీట్ల కేటాయింపులో టీడీపీ వ్యూహాత్మకంగా వెళ్లి బీజేపీకి కోలుకోలేని దెబ్బకొట్టింది. బలం లేని డివిజన్లను, అభ్యర్థుల దొరకని సీట్లను అంటగట్టేసి టీడీపీ సేఫ్‌గేమ్ ఆడిందని అందులో బీజేపీ నేతలు పావులుగా మిగిలిపోయారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా అభ్యర్థులను ఖరారు చేస్తే తాము ఏమైపోవాలని ఆశావహులంతా ఆగ్రహావేశంతో ఉన్నారు. ఎంతసేపూ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్న జ్యోతుల ఇందిర పోటీ చేస్తున్న 40వ డివిజన్‌పై పట్టుబట్టే వరకు పరిమితం కాకుండా బలం ఉన్న డివిజన్‌లను అడిగితే బాగుండేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. గెలవలేని డివిజన్‌లిచ్చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని... ఓటమి పాలయ్యాక బీజేపీ వైఫల్యమని తప్పించుకునే అవకాశం ఉందని... టీడీపీ నేతల సంస్కృతి కూడా అదేనని...జన్మభూమి కమిటీలు, దేవాదాయ కమిటీల్లో బీజేపీ కార్యకర్తలకు మొండి చేయి చూపిన సందర్బాలున్నాయని... బీజేపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. వాడుకుని వదిలేసే నాయకులున్న టీడీపీని ఎలా నమ్మగలమని, అధినేతలు ఏం చెప్పినా ఎన్నికల్లో రెబెల్‌గా పోటీ చేయక తప్పదని టిక్కెటు ఆశావహులు అంటున్నారు. బలవంతంగా విత్‌డ్రా ఫారాలు తీసుకున్నా వాస్తవ పరిస్థితులను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నేరుగా ఇచ్చే విత్‌డ్రా ఫారాలనే పరిగణలోకి తీసుకోవాలని చెబుతామంటూ బీజేపీకి చెందిన బీసీ, ఎస్పీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సీట్ల పంపకం తేలకుండానే...అభ్యర్థులు అధికారికంగా ఖరారు చేయకుండానే బీజేపీకి తలనొప్పి వచ్చి పడింది.
Advertisement
Advertisement