కమలానికి టీడీపీ ఝలక్!
► ఆలయ కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకే పెద్దపీట!
► బీజేపీ సభ్యుల స్థానాలకు ఎసరు
► ఎంపిక బాధ్యత చినరాజప్పకు!
► జాబితాల రూపకల్పనలో దేవాదాయ శాఖ
► మంత్రి తమవాడైనా బీజేపీకి దక్కని ఫలితం
► టీడీపీ అడ్డగోలు యత్నాలపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇప్పటికే మిత్రపక్షమైన బీజేపీకి మార్కెటింగ్ కమిటీల్లో మొండిచేయి చూపించిన టీడీపీ ప్రభుత్వం.. దాని నుంచి తేరుకోక ముందే మరో ఝలక్ ఇవ్వబోతోంది! మార్కెటింగ్ కమిటీల్లో చోటుదక్కకున్నా కనీసం ఆలయ కమిటీల్లోనైనా పదవీయోగం పడుతుందని కలలుకంటున్న కమలం పార్టీ కార్యకర్తలకు గట్టిదెబ్బే తగలనుంది. పలు దేవాలయాలున్న జిల్లాలో ఆలయ కమిటీలు తప్పక వేయాల్సిన పరిస్థితి. రాజకీయ నిరుద్యోగులుగా దాదాపు పదేళ్లు గడిపిన టీడీపీ నాయకులు అన్ని కమిటీల్లోనూ తామే మెజార్టీ స్థానాలు దక్కించుకొని.. మిత్రపక్షం బీజేపీ కన్నా పైచేయిగా ఉండాలని కోరుకుంటున్నారు.
అయితే గత ఎన్నికలలో టీడీపీ విజయానికి కష్టపడిన తమకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ బీజేపీ నుంచి చాలాకాలంగానే వినిపిస్తోంది. టీడీపీ వైఖరి అందుకు భిన్నంగా ఉండటంతో నిస్పృహ చెందడం బీజేపీ శ్రేణుల వంతు అవుతోంది. టీడీపీ సర్కారు ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవుతోంది. జిల్లాలో 952 దేవస్థానాలు ఉన్నాయి. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న 68 దేవస్థానాలకు కమిటీలను నియమించకుండా నిర్వహణ బాధ్యతను ఆయా దేవస్థానం అర్చకులకే అప్పగించారు.
రెండు లక్షల కన్నా అధిక ఆదాయం ఉన్న మిగిలిన 884 దేవస్థానాలకు కమిటీలు వేయాల్సి ఉంది. రాష్ట్రంలో తిరుపతి తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న అన్నవరం సహా సామర్లకోట, ద్రాక్షారామలలోని పంచారామ క్షేత్రాలు, పిఠాపురంలోని పాదగయ, తుని సమీపంలోని తలుపులమ్మలోవ, కాకినాడ కుళాయిచెరువు దగ్గరున్న బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయం, జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వంటి ప్రముఖ క్షేత్రాల్లోనూ ట్రస్టుబోర్డు నియామకాలు జరగలేదు. చివరకు ఇటీవల 340 దేవస్థానాల ట్రస్టుబోర్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయగా 146 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన 544 ఆలయాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు మూడు నెలలైపోతోంది. కేవలం 32 దేవస్థానాలకు మాత్రమే కమిటీలు వేశారు. అప్పనపల్లి, అయినవిల్లి వంటి ఒకటీ రెండు ఆలయాల్లో ఏడుగురు సభ్యులతో ట్రస్టుబోర్డులు వేశారు. కానీ పెద్ద ఆలయాల్లో రెండు స్థానాలు ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీకి హామీ ఇచ్చిన టీడీపీ.. కేవలం ఒక్క స్థానం మాత్రమే కేటాయించింది. ఆయా ట్రస్టుబోర్డుల ప్రమాణ స్వీకారానికి బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజరైనా సభ్యుల సంఖ్య మాత్రం పెరగలేదు.
మంత్రి మనవాడైనా...
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తమ పార్టీకే చెందినవారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో కమిటీల పట్ల ఆసక్తి పెరిగింది. తీరా ఆచరణలోకి వచ్చేటప్పటికి కమిటీల నియామకంపై కుమ్ములాటలు మొదలయ్యాయి. ప్రారంభంలోనే ఆలయ కమిటీలను వేయడానికి టీడీపీ ప్రభుత్వం నానా హడావుడి చేసింది. టీడీపీ నాయకులు తమ కార్యకర్తల పేర్లతో కమిటీల జాబితాలు తయారు చేసి పంపారు. తీరా ఆ జాబితాల్లో తమ పార్టీవారు లేకపోవడంతో బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
మోసపోయామని భావించిన వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆలయ కమిటీల నియామకం చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆలయ కమిటీల్లో బీజేపీకి ఒక్క స్థానం ఖాళీగా ఉంచి మిగిలిన సభ్యులను టీడీపీ నాయకులతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఆలయ కమిటీల బాధ్యతను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు.
ఈ మేరకు ఆలయాల వారీగా కమిటీల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా తమ పార్టీ వాడైన మాణిక్యాలరావు ఉండటంతో ఏవిధంగానైనా చోటు దక్కుతుందని ప్రతి చోటా పెద్ద సంఖ్యలోనే బీజేపీ కార్యకర్తలు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కమిటీల్లో కమలం పార్టీ వారికి ఎంత చోటు దక్కుతుందో లేక ఆశాభంగమే మిగులుతుందో వేచి చూడాలి.