సాక్షి ప్రతినిధి,కాకినాడ : పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజోలు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి వదులుకుంటోంది. టీడీపీ పలు చోట్ల వలస నేతలకు పెద్ద పీట వేస్తున్నట్టుగానే రాజోలులో బీజేపీ వ్యవహరిస్తుండడంపై కమలదళం కస్సుమంటోంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా దక్కిన రాజోలు సీటును రాపాకకు అట్టిపెట్టారని, అది కూడా చంద్రబాబు ప్రమేయంతోనే జరుగుతోందని కమలదళం ఆగ్రహోదగ్రమవుతోంది.
రాజోలు నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన వేమాను పక్కనబెట్టి.. బీజేపీలో చేరీచేరగానే రాపాక అభ్యర్థిత్వానికి నాయకత్వం తలూపిందని సమాచారం ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. వాస్తవానికి రాపాక తొలుత టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు టీడీపీలోకి వెళ్లిన సందర్భంలోనే రాపాక కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారరని ప్రచారం జరిగింది.
అప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమై చాప కింద నీరులా సాగుతున్నాయి. టీడీపీలోకి వస్తే రాజోలు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు ఉండవని ముందుగా ఊహించబట్టే రాపాకను బాబు వ్యూహాత్మకంగానే బీజేపీలోకి పంపి, ఇప్పుడు టిక్కెట్టు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాబు ఎత్తుగడలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని వారికి వచ్చీరాగానే సీటు ఎలా ఇచ్చేస్తారని ఆక్రోశిస్తున్నారు. రాపాక ఆర్థికంగా స్థితిమంతుడైనంత మాత్రాన పార్టీ కోసం కష్టపడ్డ వారిని పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ తరఫున వేమా కాక.. రాపాక బరిలోకి ఎలా దిగుతారో చూస్తామని హుంకరిస్తున్నారు.
12న బత్తుల భవిష్యత్ నిర్ణయం
గత ఎన్నికల అనంతరం టీడీపీ జెండా భుజాన మోస్తున్న ఆ పార్టీ రాజోలు ఇన్‌చార్జి బత్తుల రాముకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ రాపాక సీటు కట్టబెట్టాలనే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై రాము ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నిర్ణయం తీవ్రంగా బాధించినా, తనను నమ్ముకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బరిలో దిగినందున ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగి, 12న పార్టీ కేడర్‌తో సమావేశమై భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
‘గోరంట్ల’ కోసం ‘చందన’కు పొగ
కాగా రాజమండ్రి సిటీ బీజేపీకి కేటాయిస్తున్నందున అవకాశం కోల్పోతున్న గోరంట్ల రాజమండ్రి రూరల్‌లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు పొగబెట్టే పనిలో హైదరాబాద్‌లోనే మకాం చేశారు. బుధవారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లా నుంచి ఉన్న ఏడుగురిలో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించిన బాబు చందనకు మాత్రమే మొండిచేయి చూపించారు.
దీనిపై చందన సామాజికవర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ‘గోరంట్లకు స్థానం కల్పించేందుకు బలహీనవర్గాలకు చెందిన చందనకు అన్యాయం చేస్తారా?’ అని తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీలకు ఉన్న ఒక్కగానొక్క స్థానాన్ని కాకుండాచేసేందుకు టీడీపీలో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా బీసీల సత్తా ఏమిటో చంద్రబాబుకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కాషాయానికి పచ్చకామెర్లు
Published Thu, Apr 10 2014 12:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement