Rajahmundry City
-
'వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే'
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతుంది ఆర్మీ అయితే వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నాం. అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సైతం ప్రతిపక్షాలు బురద చల్లడం దారుణం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోబెట్టేందుకు కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు వైఎస్సార్సీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆమోదంతోనే 2019లో 151 స్థానాలు గెలవగలిగారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు ఈర్ష్యతో మాట్లాడటం సరికాదు. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 210 హామీలు ఇచ్చారు.. పదో, పదిహేనో నెరవేర్చి మిగిలినవన్నీ గాలికొదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. కోవిడ్‌లో సైతం ప్రజలకు అన్ని రంగాల్లో సహకారం అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అనడంలో సందేహం లేదు అని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బీసీ కులాలకు శ్రీరామరక్ష: ఆర్ కృష్ణయ్య) -
నివారణే ఉత్తమ బీమా
అగ్నిమాపక శాఖ డీజీ సాంబశివరావు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాల నివారణే ఉత్తమ బీమా అని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ సాంబశివరావు అన్నారు. ఇదే నినాదంతో ఈ ఏడాది ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ముందుకు వెళుతున్నామని చెప్పారు. రూ.40 లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మోడల్‌గా నిర్మిస్తున్న ఇన్నీస్‌పేట అగ్నిమాపక కే ంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా బ్రోచ ర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్రిబ్సీ విధానంతో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే నెల 15న ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామన్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అగ్నిప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నూతన పరికరాలను పరిశీలించారు. సివిల్ డిఫెన్స్ డెరైక్టర్ కె.జయానందరావు, డీఎఫ్ఓ ఉదయ్‌కుమార్, ఏడీఎఫ్‌ఓ ప్రశాంత్‌కుమార్, రాజమండ్రి ఫైర్ ఆఫీసర్ ఎ.శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తతే నివారణోపాయం : డీఎఫ్ఓ కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించడమే.. వాటి నివారణకు మార్గమని జిల్లా అగ్నిమాపకాధికారి (డీఎఫ్ఓ) టి.ఉదయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ఆయన ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో ఆయుధాలు, గన్‌పౌడర్ కలిగిన నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి.. 336 మంది పౌరులతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించిన వారి సంస్మరణార్థం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ అప్రమత్తతే ప్రమాదాల నివారణకు ఆయుధమన్నారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయనే అంశాలపై ప్రాథమిక అవగాహన ఉండాలన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలో పరేడ్ నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అత్యాధునిక అగ్నిమాపక యంత్రాలు, ఇతర పరికరాలను ప్రదర్శించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలకు వాటి వినియోగంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణపై రూపొందించిన కరపత్రాలను డీఎఫ్ఓ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ డీఎఫ్ఓ బీజేడీఎస్ ప్రశాంత్ కుమార్, ఎస్ఎఫ్ఓ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు. -
కాషాయానికి పచ్చకామెర్లు
సాక్షి ప్రతినిధి,కాకినాడ : పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజోలు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి వదులుకుంటోంది. టీడీపీ పలు చోట్ల వలస నేతలకు పెద్ద పీట వేస్తున్నట్టుగానే రాజోలులో బీజేపీ వ్యవహరిస్తుండడంపై కమలదళం కస్సుమంటోంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బుధవారం బీజేపీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా దక్కిన రాజోలు సీటును రాపాకకు అట్టిపెట్టారని, అది కూడా చంద్రబాబు ప్రమేయంతోనే జరుగుతోందని కమలదళం ఆగ్రహోదగ్రమవుతోంది. రాజోలు నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన వేమాను పక్కనబెట్టి.. బీజేపీలో చేరీచేరగానే రాపాక అభ్యర్థిత్వానికి నాయకత్వం తలూపిందని సమాచారం ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. వాస్తవానికి రాపాక తొలుత టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులు టీడీపీలోకి వెళ్లిన సందర్భంలోనే రాపాక కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారరని ప్రచారం జరిగింది. అప్పటికే బీజేపీతో పొత్తు చర్చలు ప్రారంభమై చాప కింద నీరులా సాగుతున్నాయి. టీడీపీలోకి వస్తే రాజోలు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు ఉండవని ముందుగా ఊహించబట్టే రాపాకను బాబు వ్యూహాత్మకంగానే బీజేపీలోకి పంపి, ఇప్పుడు టిక్కెట్టు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాబు ఎత్తుగడలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని వారికి వచ్చీరాగానే సీటు ఎలా ఇచ్చేస్తారని ఆక్రోశిస్తున్నారు. రాపాక ఆర్థికంగా స్థితిమంతుడైనంత మాత్రాన పార్టీ కోసం కష్టపడ్డ వారిని పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ తరఫున వేమా కాక.. రాపాక బరిలోకి ఎలా దిగుతారో చూస్తామని హుంకరిస్తున్నారు. 12న బత్తుల భవిష్యత్ నిర్ణయం గత ఎన్నికల అనంతరం టీడీపీ జెండా భుజాన మోస్తున్న ఆ పార్టీ రాజోలు ఇన్చార్జి బత్తుల రాముకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ రాపాక సీటు కట్టబెట్టాలనే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై రాము ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నిర్ణయం తీవ్రంగా బాధించినా, తనను నమ్ముకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు బరిలో దిగినందున ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగి, 12న పార్టీ కేడర్‌తో సమావేశమై భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ‘గోరంట్ల’ కోసం ‘చందన’కు పొగ కాగా రాజమండ్రి సిటీ బీజేపీకి కేటాయిస్తున్నందున అవకాశం కోల్పోతున్న గోరంట్ల రాజమండ్రి రూరల్‌లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు పొగబెట్టే పనిలో హైదరాబాద్‌లోనే మకాం చేశారు. బుధవారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లా నుంచి ఉన్న ఏడుగురిలో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించిన బాబు చందనకు మాత్రమే మొండిచేయి చూపించారు. దీనిపై చందన సామాజికవర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ‘గోరంట్లకు స్థానం కల్పించేందుకు బలహీనవర్గాలకు చెందిన చందనకు అన్యాయం చేస్తారా?’ అని తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీలకు ఉన్న ఒక్కగానొక్క స్థానాన్ని కాకుండాచేసేందుకు టీడీపీలో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే జిల్లావ్యాప్తంగా బీసీల సత్తా ఏమిటో చంద్రబాబుకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరిస్తున్నారు.