నివారణే ఉత్తమ బీమా
- అగ్నిమాపక శాఖ డీజీ సాంబశివరావు
- అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాల నివారణే ఉత్తమ బీమా అని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ సాంబశివరావు అన్నారు. ఇదే నినాదంతో ఈ ఏడాది ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ముందుకు వెళుతున్నామని చెప్పారు. రూ.40 లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మోడల్‌గా నిర్మిస్తున్న ఇన్నీస్‌పేట అగ్నిమాపక కే ంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు.
అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా బ్రోచ ర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్రిబ్సీ విధానంతో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే నెల 15న ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామన్నారు. స్టేషన్ ఆవరణలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అగ్నిప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నూతన పరికరాలను పరిశీలించారు. సివిల్ డిఫెన్స్ డెరైక్టర్ కె.జయానందరావు, డీఎఫ్‌ఓ ఉదయ్‌కుమార్, ఏడీఎఫ్‌ఓ ప్రశాంత్‌కుమార్, రాజమండ్రి ఫైర్ ఆఫీసర్ ఎ.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తతే నివారణోపాయం : డీఎఫ్‌ఓ
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా వ్యవహరించడమే.. వాటి నివారణకు మార్గమని జిల్లా అగ్నిమాపకాధికారి (డీఎఫ్‌ఓ) టి.ఉదయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కేంద్రంలో ఆయన ప్రారంభించారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో ఆయుధాలు, గన్‌పౌడర్ కలిగిన నౌకలో అగ్ని ప్రమాదం సంభవించి.. 336 మంది పౌరులతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించిన వారి సంస్మరణార్థం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
డీఎఫ్‌ఓ మాట్లాడుతూ అప్రమత్తతే ప్రమాదాల నివారణకు ఆయుధమన్నారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయనే అంశాలపై ప్రాథమిక అవగాహన ఉండాలన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలో పరేడ్ నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అత్యాధునిక అగ్నిమాపక యంత్రాలు, ఇతర పరికరాలను ప్రదర్శించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలకు వాటి వినియోగంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణపై రూపొందించిన కరపత్రాలను డీఎఫ్‌ఓ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ డీఎఫ్‌ఓ బీజేడీఎస్ ప్రశాంత్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఓ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు.