బీజేపీ,టిడిపిల మధ్య కోల్డ్‌వార్
సాక్షి, కాకినాడ :పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచీ గడవకముందే జిల్లాలో తెలుగుదేశం, బీజేపీల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. మరో పది నెలల్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో దేవాలయాల పాలకమండళ్లను చేజిక్కించుకునేందుకు ఇరుపార్టీల నేతలు సిగపట్లు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగినందున కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా సగం ఇవ్వాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. పదేళ్ల తర్వాత అధికారం వస్తే తమ నోటికాడి కూడును.. ప్రజల్లో ఏమాత్రం పట్టులేని కమలనాథులు లాగేసుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ తెలుగుతమ్ముళ్లు ఆక్రోశిస్తున్నారు.
దేవాదాయశాఖ మంత్రితో పాటు పుష్కరాలు జరిగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు కావడంతో జిల్లాలోని మెజార్టీ పాలకమండళ్లు తమకే దక్కుతాయని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమను కాదని వారికి ఏ విధంగా పదవులు కట్టబెడతారో చూస్తామని తెలుగుతమ్ముళ్లు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై తమ ప్రాంత ప్రజాప్రతినిధుల ద్వారా అధినేత వద్ద పంచాయతీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే పాలకమండళ్లల్లో అవకాశం క ల్పించనున్నందున ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు జిల్లాలో వెయ్యికి పైగా దేవాలయాలుండగా వార్షికాదాయం రూ.2 లక్షల లోపున్న డీ గ్రేడ్ ఆలయాలు సుమారు 350, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలున్న సీ గ్రేడ్ ఆలయాలు సుమారు 457, రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉన్న బీ గ్రేడ్ ఆలయాలు సుమారు 185, రూ. 25 లక్ష ల పైబడి ఉన్న ఏ గ్రేడ్ ఆలయాలు సుమారు 21 ఉన్నాయి.
ఏ, బీ గ్రేడ్ ఆలయాలకు ఐదుగురి నుంచి ఏడుగురు, సీ, డీ గ్రేడ్ ఆలయాలకు నలుగురు ట్రస్టీలు ఉంటారు. బడ్జెట్ సమావేశాల అనంతరం నామినేటెడ్ పదవుల పందేరం చేయనున్నట్టు ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం సంకేతాలిచ్చింది. గత కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన దేవాదాయ కమిటీలన్నీ రద్దు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం జిల్లాలో ఆ శాఖకు ఉత్తర్వులందాయి. దీంతో ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలన్నీ రద్దయ్యాయి.
రూ.40 కోట్లతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు..
‘గోదావరి’ పుష్కరాలకు లక్షల సంఖ్యలో పోటెత్తే భక్తుల కోసం జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సుమారు రూ.1,100 కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలను వివిధశాఖలు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించాయి. గోదావరి తీరంతో పాటు భక్తుల రద్దీని తట్టుకునే రీతిలో జిల్లాలోని దేవాలయాలను పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దేవాదాయ శాఖ రూ.40 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో ముందెన్నడూ లేని రీతిలో జిల్లాలోని వివిధ దేవస్థానాల పాలకమండళ్లకు గిరాకీ పెరిగింది. ఆశావహులు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు చక్కర్లు కొట్టేస్తున్నారు. రానున్న కోట్లాది రూపాయల నిధులపై కన్నేసిన కొందరు ఆ పనులు బినామీల పేరిట చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పాలకమండళ్లలో పాగా వేయాలనుకుంటున్నారు. మరికొందరైతే ప్రజాప్రతినిధులతో సమానంగా పుష్కరాల్లో పెత్తనం చలాయించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
డబ్బులు డిమాండ్ చేస్తున్న ప్రజాప్రతినిధులు..!
పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో అన్నవరం, ద్రాక్షారామ, సామర్లకోట, అంతర్వేది, అయినవిల్లి, మురమళ్ల, తలుపులమ్మ లోవ, అప్పనపల్లి, ర్యాలి, గొల్లల మామిడాడ, వాడపల్లితో పాటు కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలోని పలు దేవాలయాల పాలక మండళ్లలో పాగా వేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమన్యాయం చేస్తామంటున్న చంద్రబాబు నామినేటెడ్ పదవుల నుంచే ఇరుపార్టీలకూ సమన్యాయం చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే మంచి తరుణమంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రముఖ దేవస్థానాల పాలకమండళ్లలో పదవుల కోసం లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న కోట్ల పనులతో పోలిస్తే లక్షలు సమర్పించుకున్నా ఫర్వాలేదన్న ధోరణిలో కొందరు నేతలు సొమ్ములు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.