సొమ్ము కేంద్రానిది.. సోకు మీదా?
కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్
అమిత్‌షా సభకు వచ్చినవారిని వేధిస్తారా?
పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తారా?
మా పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటారా?
టీడీపీ తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడి మండిపాటు
మిత్రభేదం క్రమక్రమంగా రచ్చకెక్కుతోంది. స్నేహహస్తం ఇస్తూనే.. తమ పార్టీ కార్యక్రమాలకు మిత్రపక్షమైన తెలుగుదేశం శ్రేణులు మోకాలడ్డుతున్న తీరుపై కమలనాథులు కస్సుమంటున్నారు. ఈ నెల ఆరున రాజమహేంద్రవరంలో జరిగిన ‘కమల’ దళపతి అమిత్‌షా సభకు వచ్చినవారికి.. ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ టీడీపీ శ్రేణులు వేధించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య తీవ్రంగా మండిపడ్డారు.
బోట్‌క్లబ్ (కాకినాడ)/గొల్లపాలెం (కాజులూరు) : తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని టీడీపీ నాయకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాల కొండయ్య హెచ్చరించారు. మంగళవారం కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకర్లతోను, కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోను ఆయన టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమిత్‌షా సభకు గ్రామాల నుంచి ప్రజలు రాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, సభకు వచ్చినవారికి పింఛన్లు, రేషన్ నిలిపివేస్తామని, ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు తక్షణం స్వస్తి చెప్పాలని హితవు పలికారు. టీడీపీ వేధింపులపై బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే తమకు ఫిర్యాదు చేశారని, ఆయా ఎమ్మెల్యేలతో దీనిపై చర్చిస్తానని చెప్పారు. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ నేతలకు బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.
టీడీపీ నేతల తీరు దారుణం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ర్ట ప్రభుత్వ పథకాలుగా టీడీపీ నేతలు చెప్పుకోవడం దారుణమని మాలకొం డయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీలు చేతివాటం చూపుతూ, లబ్ధిదారుల నుంచి సొమ్ములు గుంజుతున్నాయని, ఈ పద్ధతి మార్చుకొనకపోతే గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు.
పోలవరంపై తప్పుడు ప్రచారం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన నిధులను పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని మాలకొండయ్య ఆరోపించారు. దీనిపై లెక్కలు చూపకుండా, కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి కేటాయింపులు చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, రేషన్, వంటగ్యాస్ తదితర అనేక పథకాల్లో ఎక్కడా మోదీ ఫొటో కనపడనివ్వకుండా.. టీడీపీ నాయకులు వాటిని తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, తమ పథకాలపై విస్తృత ప్రచారం చేపడతామని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా రుణాలను నిజమైన లబ్ధిదారులకు కాకుండా దళారీలకు అందిస్తున్నారని మాలకొండయ్య అన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని బ్యాంకు అధికారులకు సూచిం చారు. కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో జిల్లాకు చెందినవారికి కాకుండా, ఇతర ప్రాంతాలవారికి ఉద్యోగాలివ్వడం దారుణమన్నారు. దీనిని సహించేది లేదన్నారు. అధికారంలో ఉండగా కోనసీమ రైల్వేలైన్, కాకినాడ - పిఠాపురం మెయిన్ రైల్వే లైన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు బీజేపీని విమర్శించే హక్కు లేదని మాలకొండయ్య అన్నారు. ఆయా సమావేశాల్లో పార్టీ కాజులూరు మండల అధ్యక్షుడు దూడల శంకరనారాయణమూర్తి కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కాకర్లపూడి రామరాజు, యువమోర్చా మండల అధ్యక్షుడు పోతుల వీరబాబు, కార్మిక మోర్చా కాకినాడ టౌన్ అధ్యక్షుడు కె.గంగరాజు, బీజేపీ నాయకులు ఎన్‌వీ సాయిబాబా, పెద్దిరెడ్డి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.