devineni uma maheswar rao
-
కృష్ణాలో నీళ్లు లేవని మీరే కదా చెప్పారు
హైదరాబాద్: కృష్ణా నదిలో నీళ్లు లేవని మీరే చెప్పి.. ఇప్పుడు అనుమతులు లేకుండా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ఎలా కడతారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు ప్రాజెక్టులకు కృష్ణా నది బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎఫెక్ట్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. కృష్ణా నదిలో నీళ్లు లభ్యం కావడం లేదని సుప్రీంకోర్టులో మీరే (కేసీఆర్‌ను ఉద్దేశించి) చెప్పారు కదా అన్నారు. ఇప్పుడు మళ్లీ 120 టీఎంసీల నీళ్ల కోసం ప్రాజెక్టులు ఎలా కడతారంటూ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకులం కాదని, ఈ ప్రాజెక్టుతో నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, ప్రకాశం జిల్లా రైతులకు సాగునీరు ప్రశ్నార్థకం అవుతుందని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. -
నిర్వాసితులకు రూ. 3,200 కోట్లు: దేవినేని
సాక్షి, హైదరాబాద్: పోలవరం నిర్వాసితుల పునరావాస, పునర్నిర్మాణ పనులకు రూ. 3,200 కోట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ నిధులతో ముంపు బాధితులైన గిరిజనులకు మెరుగైన పునరావాసాన్ని కల్పిస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని 3 నుంచి నాలుగేళ్లలో పూర్తిచేసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు 1.5 టీఎంసీల నీరిచ్చి ముంపు లేకుండా రక్షణ గోడలు నిర్మిస్తామన్నారు. వరద ప్రవాహం ప్రారంభమై ప్రస్తుతానికి ఆల్మట్టికి 39,359 క్యూసెక్కులు, తుంగభద్రకు 43,574 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉందని, కృష్ణాడెల్టాకు రావాల్సిన 2.8 టీఎంసీల నీటిని కచ్చితంగా విడుదల చేయిస్తామన్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలవరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పోలవరం గొప్ప ప్రాజెక్టని కాంగ్రెస్ నేత చిరంజీవి అంటుంటే, అది గొప్ప ప్రాజెక్టు కాదని.. అదే పార్టీకి చెందిన మరో నేత జానారెడ్డి అంటున్నారని దుయ్యబట్టారు. అన్ని విషయాల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
ఇరిగేషన్ వంద రోజుల ప్రణాళిక విడుదల
విజయవాడ సిటీ : తన శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం నగరంలోని ఇరిగేషన్ సర్కిల్ క్యాంపు కార్యాలయంలో విడుదలచేశారు. రాబోయే వందరోజుల్లో సాగునీటి విడుదలపై కార్యాచరణ, నీటి సక్రమ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం, వరద నివారణ చర్యలు, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్, ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా నీటి సక్రమ విని యోగానికి సంబంధించిన పనులు, చిన్నతరహా నీటి వనరులను పునరుద్ధరించడం, పులిచింతల ప్రాజెక్టు గేట్ల ఏర్పాట్లు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టడం, నిర్మాణం పూర్తికావచ్చిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, నిర్మాణంలోని ప్రాజెక్టులపై సమీక్ష, రిజర్వాయర్ల నిర్వహణ, డ్యాముల భద్రత చర్యలు, నదీ నిర్వహణ బోర్డుల ఏర్పాటు, పరిధి నిర్ధారించడం, ట్రిబ్యునల్స్ ముందు ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించడం, అంతర్ రాష్ట్రాల ప్రాజెక్టుల పనుల షెడ్యూలు తయారీ, మూతపడిన, పాక్షికంగా పనిచేసే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ఆధునికీకరణ తదితర కార్యక్రమాలను ఈ ప్రణాళికలో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలైన నీటి వివరాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు 9 రోజుల్లో 4.02 టీఎంసీల నీటిని విడుదల చేశారని మంత్రి ఉమా తెలిపారు. వజనేపల్లి వద్ద ఉన్న సీడబ్ల్యూసీ గేజ్ వద్ద 1.86 టీఎంసీల నీరు విడుదలైనట్లుగా నమోదైందని, ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.42 టీఎంసీల నీరు చేరగా, కాలువలకు విడుదల చేశామని వివరించారు. కృష్ణా ఈస్ట్రన్ డెల్టాలో ఏలూరు కాలువకు తాగునీటి అవసరాల కోసం 0.13 టీఎంసీలు, రైవస్ కాలువకు 0.28 టీఎంసీలు, బందరు కాలువకు 0.30 టీఎంసీలు, కేఈవీ కాలువకు 0.14 టీఎంసీల చొప్పున విడుదల చేశామని ప్రకటించారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో కేడబ్ల్యూ మెయిన్ కెనాల్‌కు 0.51 టీఎంసీలు, గుంటూరు కాలువకు 0.02 టీఎంసీలు నీరు విడుదల చేశామని మంత్రి తెలిపారు. -
కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం: దేవినేని
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణాడెల్టా తాగు, సాగునీటి హక్కుల్ని పూర్తిస్థాయిలో కాపాడతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...డెల్టాకు తాగునీటి విడుదలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ మంత్రుల తీరు సబబు కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన సాగర్ జలాల కోసం ఎంత వరకైనా వెళ్తామనీ, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో 100 రోజుల జల ప్రణాళికను ఖరారు చేశామనీ, నూరుపాళ్లు దీన్ని అమలు చేస్తామన్నారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా
అవినీతి ఆరోపణలపై మంత్రి ఉమా ఆగ్రహం ఆలయ అధికారులపై ప్రశ్నల వర్షం వారంలో సమాధానాలు చెప్పాలని ఆదేశం విజయవాడ : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం(దుర్గగుడి)లో కొంత కాలంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆలయ అధికారులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఉమా బుధవారం ఆలయానికి వచ్చారు. తొలుత అమ్మవారి సన్నిధికి చేరుకున్న మంత్రి ఉమా, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ఆలయ ఈవో త్రినాథరావు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలి కారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాలను అందజేసి, సత్కరించారు. అన్నసంతర్పణ ప్రారంభం అన్నదాన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండో విభాగంలో అమ్మవారి చిత్రపటానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పూజలుచేశారు. అనంతరం భక్తులకు వారు అన్నప్రసాదాన్ని అందచేశారు. అనంతరం భక్తులను పలుకరిం చారు. అన్నప్రసాదాన్ని శుచిగా, శుభ్రంగా వండేలా చూడాలని ఆలయ ఈవో త్రినాథరావు, అన్నదాన విభాగం అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాంపిళ్ల శ్రీను, దేవస్థాన ఏఈవోలు సాయిబాబు, లక్ష్మీకాంతం, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, డీఈ రమా, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఉమా సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీఐపీ లాంజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు. పలు అంశాలపై మీడియా ద్వారా అధికారులను ప్రశ్నలు అడుగుతున్నానని పేర్కొన్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో ఆలయ అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. దుకాణాల్లో పూజాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని, ఫుట్‌బ్రిడ్జి, ఆలయ ప్రాగణంలో సుమారు 117 మంది హాకర్లు ఉండగా, వారిలో 90 మంది ఆలయ ఉద్యోగుల బంధవులేనని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు. చైనా వాల్ నిర్మాణ సమయంలో ధ్వంసమైన కార్పొరేషన్ వాటర్ పైపులైన్ పునరుద్ధరణకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఎంబుక్‌లో నమోదు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మహామండపం, రాజగోపురం పనుల్లో అలసత్వం. శానిటేషన్, టికెట్ల రీసైక్లింగ్, దసరా, భవానీ దీక్షల సమయంలో దుబారాపై వారం రోజుల్లో తనతో పాటు దేవాదాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
మంత్రి ఆలస్యం.. భక్తులకు నీరసం
ఆలస్యంగా ప్రారంభమైన అన్నదానం మూడు గంటలపాటు క్యూలైన్లోనే భక్తుల పడిగాపులు విజయవాడ : దుర్గమ్మ అన్నప్రసాదాన్ని స్వీకరించేం దుకు బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాక ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా రోజూ ఉదయం 10.30 గంటల నుంచే ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నసంతర్పణను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.45 గంటలకు ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉమా ప్రారంభిస్తారని ప్రకటించారు. అయితే మంత్రి రాక ఆలస్యం కావడంతో కార్యక్రమాన్ని 12 గంటలకు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు నేరుగా క్యూలైన్లోకి చేరారు. ఎంతకీ అన్న ప్రసాదం పంపిణీ ప్రారంభం కాకపోవడంతో పలువురు భక్తులు నిరాశగా వెను తిరిగారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం క్యూలైన్లోనే వేచివున్నారు. వృద్ధులు, చిన్నారులు నీరసంతో ఇబ్బందిపడ్డారు. క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు కనీసం మంచినీరు కూడా అందజేయలేదు. మంత్రి కోసం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని పలువురు భక్తులు ప్రశ్నించారు. -
15 రోజుల్లో... ప్రాజెక్టుల తనిఖీ
అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు వేగవంతం చేయాలి సమీక్ష సమావేశంలో మంత్రి ఉమ విజయవాడ సిటీ : రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను తనిఖీ చేస్తానని రాష్ట్ర నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో 13 జిల్లాల ఇరిగేషన్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చే యాలని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు తమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వచ్చే నీరు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో తదితర క్షేత్ర స్థాయి వివరాలను ముందుగా తెలుసుకోవాలని ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి క్షేత్రస్థాయి వివరాలు అడిగిన వెంటనే చెప్పే విధంగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రతి ఇంజనీరు కృషి చేయాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయాలను అంచనా వేయడంలో, వాటిని సక్రమంగా పూర్తిచేయడంలో ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఆరు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు శ్రీశైలం, కండలేరు, సోమశిల, నాగార్జునసాగర్, ఏలేరు, వెలుగోడు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బెజవాడను సుందరీకరిద్దాం... విజయవాడ నగరంలో ఎనిమిది కాలువలు ప్రవహిస్తున్నాయని, త్వరలో మెట్రోపాలిటిన్ సిటీగా రూపాంతరం చెందే ఈ నగరాన్ని గ్రీన్ సిటీగా చేయటానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నగరం మధ్యలో ఉన్న కాలువలలో సమృద్ధిగా నీటి నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్‌కు అనుబంధంగా ఉన్న శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనితీరును మంత్రి సూచనలు, సలహాల మేరకు మెరుగుపరచుకుంటామని చెప్పారు. ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయటానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ చీఫ్ ఇంజనీర్ సాంబయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం... మైలవరం : కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తామని మంత్రి ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పారు. త్వరలో కాలువల మరమ్మతు పనులు చేపట్టి, చివరి భూములకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఎఫెక్ట్ క మిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గోదావరికి 10 ల క్షల ఎకరాలకు సరిపడే నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. -
బెజవాడ కేంద్రంగా రాష్ర్ట పాలన
శ్రీకారం చుడుతున్న మంత్రులు నేడు ఇరిగేషన్ శాఖ భవనం ప్రారంభం త్వరలో ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్య శాఖల కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరం నుంచి రాష్ట్ర పరిపాలన ప్రారంభం కానుంది. ఒకపక్క ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటులో భాగంగా రాష్ట్ర అతిథి గృహానికి మరమ్మతులు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ హైదరాబాద్‌ను వదిలేసి విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు శనివారం హైదరాబాదులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం నుంచే ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా మొదలు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ఈ కార్యాలయంలో తగిన భవనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడే మంత్రి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తుంటే అక్కడే ఈఎన్సీ కార్యాలయం ఉండాల్సిన నేపథ్యంలో దానినీ ఇక్కడికి తరలించనున్నారు. రైతుల బాగోగులన్నీ ఇక్కడినుంచే సమీక్ష... కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదుల ఆధారంగా వరి పంట ఎక్కువగా పండుతుంది. వ్యవసాయానికి ఈ జిల్లాలు కేంద్ర బిందువులుగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో కూడా వరి పంట ఎక్కువగా పండుతున్నా కృష్ణా, గోదావరి నదుల నీరు మాత్రం అక్కడికి అందదు. స్థానిక నదుల ద్వారా అక్కడికి సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తాయి. నదుల ద్వారా సాగునీరు, రైతుల బాగోగులన్నీ మంత్రి ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే చర్చించి సమీక్షిస్తారు. సాగర్ ద్వారా తాగునీటి విడుదల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది. త్వరలో మరో నాలుగు శాఖలు... విజయవాడ కేంద్రంగానే ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన శాఖల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు శాఖలకు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లు మంత్రులుగా నియమితులయ్యారు. దేవినేని ఉమామహేశ్వరావు ముందుగా తన శాఖ పాలన గురించి ప్రకటించడంతో వారు త్వరలోనే విజయవాడ కేంద్రంగా పరిపాలనా కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించేందుకు నిర్ణయించారు. వీరు ముగ్గురూ జిల్లాకు చెందినవారు కావడం, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో విజయవాడ నగరం నుంచే పాలన సాగించేందుకు సుముఖత చూపుతున్నారు. నూతన ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా విజయవాడలో ఉన్న పలు శాఖల కార్యాలయాల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ నూతన రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ఇప్పటికే పలు వివరాలు అందజేశారు. -
గంపెడాశలు
ముగ్గురు మంత్రులకు కీలక శాఖలు డెల్టా ఆధునీకరణ కోసం రైతుల ఎదురుచూపులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారా.. బెల్టుషాపులపై కొరడా ఝుళిపించేనా జిలా అభివృద్ధిపై దృష్టిపెట్టాలంటున్న ప్రజలు మంత్రివర్గం కూర్పులో జిల్లాకు పెద్దపీట వేసి ముగ్గురికి అవకాశమిచ్చిన చంద్రబాబు.. వారికి శాఖల కేటాయింపులోనూ ప్రాధాన్యత కల్పించారు. దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలతోపాటు మిత్రపక్షం బీజేపీ నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన ఆయా నేతల చేతికి ఇప్పుడు అధికార దండం లభించింది. మన మంత్రులు జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళతారని అందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. విజయవాడ : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా డెల్టా రైతుల కలలను నెరవేర్చేందుకు నడుం బిగించారు. ఎవరూ ఊహించని విధంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి తన హయాంలో మూడొంతుల పని పూర్తిచేశారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఇంకా రైతులకు నీరిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి పొందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రాజెక్టు విషయంలో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆయనే ఈ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఖరీఫ్‌లో నీరందేలా కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులకు వైఎస్ శ్రీకారం చుట్టగా.. ఆయన తర్వాత వచ్చిన పాలకులు సరిగ్గా దృష్టిపెట్టకపోవడంతో ఆ పనులు కొలిక్కిరాలేదు. ఉమ తన పదవీకాలం పూర్తయేలోగా ఆధునీకరణ పనులు పూర్తిచేసి కృష్ణాడెల్టా రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది. కార్పొ‘రేట్’కు కళ్లెం పడేనా? విద్య, వైద్యానికి గుర్తింపు పొందిన విజయవాడలో ఈ రెండూ కార్పొ‘రేట్’ కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. కార్పొరేట్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల్లోకి అడుగుపెట్టాలంటే వేలు, లక్షల రూపాయలు చేతిలో ఉండాలనేది నిష్ఠుర సత్యం. వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రులను నియంత్రించడంతోపాటు పేదల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వైఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు స్థలాన్వేషణే జరగలేదు. అధికారుల అలసత్వానికి వైద్యశాఖ మంత్రి చికిత్స చేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకోవాల్సి ఉంది. మరోవైపు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయించి చక్కటి భవనాలను నిర్మించాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘బెల్టు’ తీస్తారా? మరో మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖలు లభిం చాయి. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాల్లో బెల్టు షాపుల రద్దు ఒకటి. మంత్రి సొంత జిల్లాలో ఈ హామీ సమర్థంగా అమలు జరుగుతుందా.. అని మహిళలు ఎదురుచూస్తున్నారు. మరోపక్క జిల్లాలోని లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వాలనే శాసించే స్థాయిలో ఉన్నారు. వీరు తొలిసారి మంత్రి పదవి లభించిన రవీంద్రకు కొరుకుడుపడతారా.. లేక వీరి కనుసన్నలోకే మంత్రి వెళతారా.. అనేది వేచిచూడాల్సి ఉంది. -
మంత్రులు..శాఖలు ఊహాగానాలు
కీలక శాఖలు జిల్లాకు దక్కేనా.. పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాక్షి, విజయవాడ : చంద్రబాబు క్యాబినెట్లో జిల్లా నుంచి చోటు సంపాదించిన ముగ్గురు అమాత్యులకు ఏ శాఖలు లభిస్తాయనే అంశంపై తెలుగుదేశం పార్టీలో ఊహాగానాలు జోరందుకున్నాయి. మిగిలిన జిల్లాల కంటే కృష్ణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముగ్గురికి మంత్రి పదవులిచ్చినట్లే.. కీలక శాఖలను కూడా ఈ జిల్లాకే కట్టబెడతారా.. లేక చిన్నాచితకా శాఖలను అంటగడతారా.. అని తర్జనభర్జన పడుతున్నారు. ముగ్గురులోనూ దేవినేని ఉమానే కీలక వ్యక్తి కావడంతో ఆయనకు ఏ శాఖ ఇస్తారని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణాజిల్లా విషయంలో కొన్ని శాఖలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. అలాంటి శాఖలు దక్కకుండా ఉంటే బాగుండునని అభిప్రాయపడుతున్నారు. ఉమకు ఈ శాఖలంటే ఇష్టం.. జిల్లాలో వ్యవసాయం, గతంలో తాను చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు ఇవికాకుండా భూగర్భ జలవనరుల శాఖ లభించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలుగుతమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఉమ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో కీలక శాఖే లభిస్తుందని అంటున్నారు. మామ శాఖే దక్కుతుందా.. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు తరహాలోనే ఆయన అల్లుడు కొల్లు రవీంద్ర తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అలంకరించారు. గతంలో చంద్రబాబు.. నరసింహారావుకు మత్స్య, బీసీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇప్పుడు రవీంద్రకూ అదే దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. బీసీ నేతలు ఎవరైనా ఈ శాఖలు కోరితే రవీంద్రకు మరో శాఖ దక్కవచ్చు. డాక్టర్ కామినేనికి వైద్యం, ఆరోగ్యం బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కీలక శాఖే లభించే అవకాశం కనపడుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు డాక్టర్ కామినేని అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు వైద్య, ఆరోగ్య విభాగాలపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ లభించవచ్చని అనుకుంటున్నారు. సెంటిమెంట్ శాఖలు ఇవీ.. కొన్ని శాఖలను తీసుకోవాలంటే మంత్రులే భయపడతారు. గతంలో ఆ శాఖలు తీసుకున్న మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎం.కె.బేగ్, దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)లు సాంకేతిక విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ తరువాతి కాలంలో వారు తిరిగి మంత్రులుగా పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పటికీ ఈ శాఖను జిల్లా మంత్రులు అచ్చిరానిది భావిస్తారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడం వంటి సందర్భాలున్నాయి. ఈ శాఖను తీసుకోవడానికి మంత్రులు అంతగా ఆసక్తి చూపరు. మరి ఈ శాఖలకు మన మంత్రులు దూరంగా ఉంటారా.. లేదా..అని చర్చ జరుగుతోంది. -
‘లెక్క’ పనిచేయలేదేం?
అభ్యర్థుల్లో అంతర్మథనం ఓడినా.. గెలిచినా... తగినన్ని ఓట్లు రాలేదు లెక్కల చిక్కులు.. అప్పుల తిప్పలు సాక్షి, మచిలీపట్నం : ఓడిపోయి ఒకరు బాధపడుతుంటే.. గెలిచి మరోకరు మదనపడుతున్నారు.. ఇది సార్వత్రిక ఎన్నికల అనంతరం కన్పిస్తున్న చిత్రం. మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో అభ్యర్థులు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసిన సంగతి తెల్సిందే. ఓటు కోసం కోట్లు ఖర్చుచేసిన అభ్యర్థులు ఇప్పుడు తీరుబడిగా లెక్కల చిక్కులు, అప్పుల తిప్పలు తలుచుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఓటమి భారంతో కుంగిపోతున్న అభ్యర్థులు.... ఇప్పుడు చేసిన అప్పుల భారాన్ని తలుచుకుని కంగారు పడుతున్నారు. అప్పులు చేసినా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పరువు దక్కేది, తీరా ఓడిపోవడంతో అప్పులు తిప్పలు మిగిలాయని మూగగ రోధిస్తున్నారు. ఓడిపోయిన వారే బాధపడుతున్నారనుకుంటే పొరపాటే... ప్రధానంగా గెలిచిన అభ్యర్థులు మద్యం, ఓట్లు కొనుగోలు, ప్రచారం కోసం అంచనాలకు మించి ఖర్చుచేసిన కోట్లాది రూపాయలను తలుచుకుని గుండెలు బాదుకుంటున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థులు సైతం చేసిన ఖర్చులకు తగ్గట్టు ఓట్లు రాలేదన్న లెక్కలతో బిక్కమోహం వేస్తున్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకుగా గుర్తించి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము పంచినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్న వేదన గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పంచిన డబ్బుకు సరిపడే ఓట్లు వచ్చాయా? అనే దానిపై పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అనునయులతో ఆరా తీస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఆశలుపెట్టుకుని ఆయన పెద్ద ఎత్తున ఖర్చుపెట్టారు. తీరా ఆయన అంచనాలు తల్లకిందులు చేస్తూ తగినన్ని ఓట్లు రాకపోవడంతో చివరి రౌండ్ వరకు బోటాబోటీగానే లాక్కొచ్చారు. ఆయన ఆశలుపెట్టుకున్న మైలవరం, జి.కొండూరు అంతగా కలిసి రాలేదని ఉమా అనుయాయులు లెక్కలు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుద్ధప్రసాద్ ఘంటసాల, చల్లపల్లి మండలాలపై పెట్టుకున్న ఆశలు అంతగా వర్కవుట్ కాలేదని అంటున్నారు. చేసిన ఖర్చులకు వచ్చిన ఓట్లకు తేడా ఉందని ఆయన అనుచరులు వాపోతున్నారు. బందరు నియోజకవర్గంలో కొల్లు రవీంద్రకు అనుకూలం అనుకున్న రూరల్ గ్రామాల్లో అనుకున్న స్థాయిలో ఓట్లు రాలలేదని, పట్టణంలో కొంత కలిసి వచ్చిందని అంటున్నారు. మచిలీపట్నం రూరల్ కొన్ని గ్రామాలపై ఆశలుపెట్టుకుని ఖర్చుచేసినా అంత ప్రయోజనం కలగలేదని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, పెదపారుపూడి మండలాలపై ఆశ వదులుకున్న టీడీపీ నేతలు గుడివాడ పట్టణం, గుడ్లవల్లేరు మండలంపై ఆశలు పెట్టుకుని డబ్బులు వెదజల్లారు. అక్కడా అనుకున్న స్థాయి లో ఓట్లు రాలకపోవడంతో ఘోరంగా పరాజయం పాలుకావాల్సి వచ్చిందని మదనపడుతున్నారు. పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు అంతగా అనుకూలంగా లేవని ముందుగానే టీడీపీ నేతలు గుర్తించారు. దీంతో మొవ్వ, పామర్రు మండలాలపై ఆశలుపెట్టుకుని డబ్బులు కుమ్మరించారు. తీరా అక్కడా ఫలితం లేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇలా గెలిచినా, ఓడినా చేసిన ఖర్చుకు తగినన్ని ఓట్లు రాలేదన్న వేదన మాత్రం అభ్యర్థుల మదిని తొలిచే స్తోంది. -
మంత్రి ముచ్చట మొదలైంది..
అమాత్య పదవి అదృష్టం ఎవరికో! రేసులో ఉమా, కాగిత, మండలి కొనకళ్లకు కేంద్రంలో ఛాన్స్ దొరికేనా! సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల ఘట్టం ముగిసింది.. మంత్రి పదవుల ముచ్చట మొదలైంది. జిల్లాలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో మంత్రి పదవులకోసం ప్రతిపాదనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ రేసులో టీడీపీ సీనియర్లు ముందున్నారు. జిల్లాలో ఎవరికి అమాత్య పదవులు ఇస్తారనే అంశంపై తర్జనభర్జన సాగుతోంది. జిల్లాకు ఒక్క మంత్రి పదవే ఇస్తే అది కచ్చితంగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకే దక్కుంతుందన్న ప్రచారం సాగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమకు ఈసారి మంత్రి పదవి ఖాయంగా దక్కుతుందని భావిస్తున్నారు. సామాజికవర్గ సమీకరణల్లో ఉమకు కాకుంటే ఆయన తరువాత పెడన ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత వెంకట్రావుకు ఇస్తారని తెలుస్తోంది. ఆరుసార్లు పోటీ చేసిన కాగిత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ప్రభుత్వ చీఫ్ విప్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవులను నిర్వహించారు. నాలుగోసారి గెలిచిన కాగితకు కూడా ఈ సారి మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకు ఒకటి ఇస్తే ఉమా, కాగితలో ఒకరికి, రెండు మంత్రి పదవులు ఇస్తే వీరిద్దరికీ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వీరితోపాటు మరో సీనియర్ నేతయిన మండలి బుద్ధప్రసాద్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే విషయం పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే కొత్తగా టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కోస్తా తీరంలో మత్స్యకారవర్గానికి టీడీపీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆయన మామ నడకుదుటి నరసింహారావు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే కొల్లు రవీంద్ర తొలిసారిగా ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అమాత్య పదవి ఇచ్చే అవకాశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వీరితోపాటు జిల్లాలో మంత్రి పదవులపై ఆశలుపెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందిన గద్దే రామ్మోహన్రావు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో రెండోసారి గెలిచిన శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ పేర్లు మంత్రి పదవి రేసులో ఉన్నాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. కేంద్రంలో కొనకళ్లకు చోటు...! జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కొనకళ్ల నారాయణరావు రెండో పర్యాయం ఎంపీగా ఎన్నిక కావడంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంతి పదవి ఇవ్వాలని మోడీని చంద్రబాబు కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీకి సంబంధించి కోస్తా జిల్లాల్లో కీలక నేతగా ఎదిగిన బీసీ నేత కింజరపు ఎర్రన్నాయుడు లేని లోటును కొనకళ్లతో భర్తీ చేసేందుకు చంద్రబాబు ఇటీవల ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన సుజనాచౌదరి తరువాత బీసీ నేత కొనకళ్లకు స్థానం కల్పించేలా ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమితో పనిలేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో టీడీపీకి కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అయినా కేంద్ర మంత్రి పదవుల కోసం అప్పుడే టీడీపీలో ప్రయత్నాలు మొదలుకావడం గమనార్హం.