ఆకస్మిక తనిఖీలు చేస్తా
- అవినీతి ఆరోపణలపై మంత్రి ఉమా ఆగ్రహం
- ఆలయ అధికారులపై ప్రశ్నల వర్షం
- వారంలో సమాధానాలు చెప్పాలని ఆదేశం
విజయవాడ : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం(దుర్గగుడి)లో కొంత కాలంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆలయ అధికారులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఉమా బుధవారం ఆలయానికి వచ్చారు.
తొలుత అమ్మవారి సన్నిధికి చేరుకున్న మంత్రి ఉమా, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ఆలయ ఈవో త్రినాథరావు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలి కారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాలను అందజేసి, సత్కరించారు.
అన్నసంతర్పణ ప్రారంభం
అన్నదాన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండో విభాగంలో అమ్మవారి చిత్రపటానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పూజలుచేశారు. అనంతరం భక్తులకు వారు అన్నప్రసాదాన్ని అందచేశారు. అనంతరం భక్తులను పలుకరిం చారు. అన్నప్రసాదాన్ని శుచిగా, శుభ్రంగా వండేలా చూడాలని ఆలయ ఈవో త్రినాథరావు, అన్నదాన విభాగం అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాంపిళ్ల శ్రీను, దేవస్థాన ఏఈవోలు సాయిబాబు, లక్ష్మీకాంతం, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, డీఈ రమా, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులపై ప్రశ్నల వర్షం
ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఉమా సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీఐపీ లాంజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు. పలు అంశాలపై మీడియా ద్వారా అధికారులను ప్రశ్నలు అడుగుతున్నానని పేర్కొన్నారు.
దాతల నుంచి సేకరించిన విరాళాలతో ఆలయ అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. దుకాణాల్లో పూజాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని, ఫుట్‌బ్రిడ్జి, ఆలయ ప్రాగణంలో సుమారు 117 మంది హాకర్లు ఉండగా, వారిలో 90 మంది ఆలయ ఉద్యోగుల బంధవులేనని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు.
చైనా వాల్ నిర్మాణ సమయంలో ధ్వంసమైన కార్పొరేషన్ వాటర్ పైపులైన్ పునరుద్ధరణకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఎంబుక్‌లో నమోదు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మహామండపం, రాజగోపురం పనుల్లో అలసత్వం. శానిటేషన్, టికెట్ల రీసైక్లింగ్, దసరా, భవానీ దీక్షల సమయంలో దుబారాపై వారం రోజుల్లో తనతో పాటు దేవాదాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.