విజయవాడ సిటీ : తన శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం నగరంలోని ఇరిగేషన్ సర్కిల్ క్యాంపు కార్యాలయంలో విడుదలచేశారు. రాబోయే వందరోజుల్లో సాగునీటి విడుదలపై కార్యాచరణ, నీటి సక్రమ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం, వరద నివారణ చర్యలు, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్, ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ ద్వారా నీటి సక్రమ విని యోగానికి సంబంధించిన పనులు, చిన్నతరహా నీటి వనరులను పునరుద్ధరించడం, పులిచింతల ప్రాజెక్టు గేట్ల ఏర్పాట్లు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టడం, నిర్మాణం పూర్తికావచ్చిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, నిర్మాణంలోని ప్రాజెక్టులపై సమీక్ష, రిజర్వాయర్ల నిర్వహణ, డ్యాముల భద్రత చర్యలు, నదీ నిర్వహణ బోర్డుల ఏర్పాటు, పరిధి నిర్ధారించడం, ట్రిబ్యునల్స్ ముందు ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించడం, అంతర్ రాష్ట్రాల ప్రాజెక్టుల పనుల షెడ్యూలు తయారీ, మూతపడిన, పాక్షికంగా పనిచేసే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ఆధునికీకరణ తదితర కార్యక్రమాలను ఈ ప్రణాళికలో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
నాగార్జునసాగర్ నుంచి విడుదలైన నీటి వివరాలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు 9 రోజుల్లో 4.02 టీఎంసీల నీటిని విడుదల చేశారని మంత్రి ఉమా తెలిపారు. వజనేపల్లి వద్ద ఉన్న సీడబ్ల్యూసీ గేజ్ వద్ద 1.86 టీఎంసీల నీరు విడుదలైనట్లుగా నమోదైందని, ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.42 టీఎంసీల నీరు చేరగా, కాలువలకు విడుదల చేశామని వివరించారు.
కృష్ణా ఈస్ట్రన్ డెల్టాలో ఏలూరు కాలువకు తాగునీటి అవసరాల కోసం 0.13 టీఎంసీలు, రైవస్ కాలువకు 0.28 టీఎంసీలు, బందరు కాలువకు 0.30 టీఎంసీలు, కేఈవీ కాలువకు 0.14 టీఎంసీల చొప్పున విడుదల చేశామని ప్రకటించారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో కేడబ్ల్యూ మెయిన్ కెనాల్‌కు 0.51 టీఎంసీలు, గుంటూరు కాలువకు 0.02 టీఎంసీలు నీరు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఇరిగేషన్ వంద రోజుల ప్రణాళిక విడుదల
Published Fri, Jul 4 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement