Operation and Maintenance
-
ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారమున్నా నిధులు సున్నా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్‌వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్‌చానల్‌లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది. అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్సీ (జనరల్), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సైతం... ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్ పరిధిలో రూ.35 లక్షల సివిల్ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు. ఇక జూరాల పరిధిలో మెకానికల్ పనులు, హెడ్‌రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్‌హౌస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
ఇరిగేషన్ వంద రోజుల ప్రణాళిక విడుదల
విజయవాడ సిటీ : తన శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం నగరంలోని ఇరిగేషన్ సర్కిల్ క్యాంపు కార్యాలయంలో విడుదలచేశారు. రాబోయే వందరోజుల్లో సాగునీటి విడుదలపై కార్యాచరణ, నీటి సక్రమ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం, వరద నివారణ చర్యలు, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్, ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా నీటి సక్రమ విని యోగానికి సంబంధించిన పనులు, చిన్నతరహా నీటి వనరులను పునరుద్ధరించడం, పులిచింతల ప్రాజెక్టు గేట్ల ఏర్పాట్లు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టడం, నిర్మాణం పూర్తికావచ్చిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, నిర్మాణంలోని ప్రాజెక్టులపై సమీక్ష, రిజర్వాయర్ల నిర్వహణ, డ్యాముల భద్రత చర్యలు, నదీ నిర్వహణ బోర్డుల ఏర్పాటు, పరిధి నిర్ధారించడం, ట్రిబ్యునల్స్ ముందు ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించడం, అంతర్ రాష్ట్రాల ప్రాజెక్టుల పనుల షెడ్యూలు తయారీ, మూతపడిన, పాక్షికంగా పనిచేసే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ఆధునికీకరణ తదితర కార్యక్రమాలను ఈ ప్రణాళికలో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలైన నీటి వివరాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు 9 రోజుల్లో 4.02 టీఎంసీల నీటిని విడుదల చేశారని మంత్రి ఉమా తెలిపారు. వజనేపల్లి వద్ద ఉన్న సీడబ్ల్యూసీ గేజ్ వద్ద 1.86 టీఎంసీల నీరు విడుదలైనట్లుగా నమోదైందని, ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.42 టీఎంసీల నీరు చేరగా, కాలువలకు విడుదల చేశామని వివరించారు. కృష్ణా ఈస్ట్రన్ డెల్టాలో ఏలూరు కాలువకు తాగునీటి అవసరాల కోసం 0.13 టీఎంసీలు, రైవస్ కాలువకు 0.28 టీఎంసీలు, బందరు కాలువకు 0.30 టీఎంసీలు, కేఈవీ కాలువకు 0.14 టీఎంసీల చొప్పున విడుదల చేశామని ప్రకటించారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో కేడబ్ల్యూ మెయిన్ కెనాల్‌కు 0.51 టీఎంసీలు, గుంటూరు కాలువకు 0.02 టీఎంసీలు నీరు విడుదల చేశామని మంత్రి తెలిపారు.