బెజవాడ కేంద్రంగా రాష్ర్ట పాలన
- శ్రీకారం చుడుతున్న మంత్రులు
- నేడు ఇరిగేషన్ శాఖ భవనం ప్రారంభం
- త్వరలో ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్య శాఖల కార్యకలాపాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరం నుంచి రాష్ట్ర పరిపాలన ప్రారంభం కానుంది. ఒకపక్క ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటులో భాగంగా రాష్ట్ర అతిథి గృహానికి మరమ్మతులు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ హైదరాబాద్‌ను వదిలేసి విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు శనివారం హైదరాబాదులో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆదివారం నుంచే ఇరిగేషన్ శాఖ కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా మొదలు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్‌ఈ కార్యాలయంలో తగిన భవనాలు ఉన్నాయి. దీంతో ఇక్కడే మంత్రి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తుంటే అక్కడే ఈఎన్‌సీ కార్యాలయం ఉండాల్సిన నేపథ్యంలో దానినీ ఇక్కడికి తరలించనున్నారు.
రైతుల బాగోగులన్నీ ఇక్కడినుంచే సమీక్ష...
కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదుల ఆధారంగా వరి పంట ఎక్కువగా పండుతుంది. వ్యవసాయానికి ఈ జిల్లాలు కేంద్ర బిందువులుగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో కూడా వరి పంట ఎక్కువగా పండుతున్నా కృష్ణా, గోదావరి నదుల నీరు మాత్రం అక్కడికి అందదు. స్థానిక నదుల ద్వారా అక్కడికి సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తాయి. నదుల ద్వారా సాగునీరు, రైతుల బాగోగులన్నీ మంత్రి ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే చర్చించి సమీక్షిస్తారు. సాగర్ ద్వారా తాగునీటి విడుదల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది.
త్వరలో మరో నాలుగు శాఖలు...
విజయవాడ కేంద్రంగానే ఎక్సైజ్, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన శాఖల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు శాఖలకు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లు మంత్రులుగా నియమితులయ్యారు. దేవినేని ఉమామహేశ్వరావు ముందుగా తన శాఖ పాలన గురించి ప్రకటించడంతో వారు త్వరలోనే విజయవాడ కేంద్రంగా పరిపాలనా కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించేందుకు నిర్ణయించారు. వీరు ముగ్గురూ జిల్లాకు చెందినవారు కావడం, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో విజయవాడ నగరం నుంచే పాలన సాగించేందుకు సుముఖత చూపుతున్నారు.
నూతన ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా విజయవాడలో ఉన్న పలు శాఖల కార్యాలయాల విస్తీర్ణం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ నూతన రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ఇప్పటికే పలు వివరాలు అందజేశారు.