15 రోజుల్లో... ప్రాజెక్టుల తనిఖీ | Check out projects in 15 days ... | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో... ప్రాజెక్టుల తనిఖీ

Published Mon, Jun 23 2014 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

15 రోజుల్లో... ప్రాజెక్టుల తనిఖీ - Sakshi

15 రోజుల్లో... ప్రాజెక్టుల తనిఖీ

  • అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి
  • రైతులకు మేలు చేసే కార్యక్రమాలు వేగవంతం చేయాలి
  • సమీక్ష సమావేశంలో మంత్రి ఉమ
  • విజయవాడ సిటీ :  రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను తనిఖీ చేస్తానని రాష్ట్ర నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో 13 జిల్లాల ఇరిగేషన్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చే యాలని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు తమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు వచ్చే నీరు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో తదితర క్షేత్ర స్థాయి వివరాలను ముందుగా తెలుసుకోవాలని ఆదేశించారు. వచ్చే సమావేశం నాటికి క్షేత్రస్థాయి వివరాలు అడిగిన వెంటనే చెప్పే విధంగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

    రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రతి ఇంజనీరు కృషి చేయాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయాలను అంచనా వేయడంలో, వాటిని సక్రమంగా పూర్తిచేయడంలో ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఆరు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు శ్రీశైలం, కండలేరు, సోమశిల, నాగార్జునసాగర్, ఏలేరు, వెలుగోడు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
     
    బెజవాడను సుందరీకరిద్దాం...

    విజయవాడ నగరంలో ఎనిమిది కాలువలు ప్రవహిస్తున్నాయని, త్వరలో మెట్రోపాలిటిన్ సిటీగా రూపాంతరం చెందే ఈ నగరాన్ని గ్రీన్ సిటీగా చేయటానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నగరం మధ్యలో ఉన్న కాలువలలో సమృద్ధిగా నీటి నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్‌కు అనుబంధంగా ఉన్న శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు.

    ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనితీరును మంత్రి సూచనలు, సలహాల మేరకు మెరుగుపరచుకుంటామని చెప్పారు. ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయటానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ చీఫ్ ఇంజనీర్ సాంబయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొన్నారు.
     
    చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం...

    మైలవరం : కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తామని మంత్రి ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పారు. త్వరలో కాలువల మరమ్మతు పనులు చేపట్టి, చివరి భూములకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఎఫెక్ట్ క మిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సాగునీటి ప్రాజక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గోదావరికి 10 ల క్షల ఎకరాలకు సరిపడే నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement