సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం అంగీకరించింది. ప్రాజెక్టులో కేవలం సాగు నీటి విభాగం పనులకే నిధులిస్తామని, తాగు నీటి విభాగం ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. సీఎం జగన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది.
రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు నిధులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా ప్రాజెక్టులో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులకు అదనంగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా తాగు నీరు కాంపొనెంట్ ఖర్చును కూడా ఇవ్వడానికి అభ్యంతరం లేదని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా?
వేధింపుల నిరోధక చట్టంలో ఫిర్యాదుదారులను శిక్షించే పరిస్థితి కూడా ఉండడంతో బాధితులు ముందుకు రావడంలేదని, దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ స్పందిస్తూ.. లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేసిన మీదటే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వలు
ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ – 2021 ప్రకారం ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వల సామర్ధ్యం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంట్లో 5.3 టన్నుల నిరూపిత, సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల మిగిలిన వనరులు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి, పెనకచర్ల బంగారు క్షేత్రాలు, జోనగిరి షిస్ట్ బెల్ట్, సౌత్ చిగర్‌గుంట – బిసనట్టం గోల్డ్‌బెల్ట్‌లో బంగారు నిల్వలు గుర్తించారు.
విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం ప్రతిపాదన లేదు
సెయిల్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. కాగా ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్(పీఎస్‌యూ) విధానానికి అనుగుణంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.(ఆర్‌ఐఎన్‌ఎల్) షేర్‌హోల్డింగ్‌లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం పొందిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment