సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు.
తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు.
తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్‌సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment