tendering
-
పోలవరం కాంట్రాక్టర్‌ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
మెట్రో రీ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ మేరకు పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) సన్నద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బా«ధ్యతను గత ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీఎంఆర్డీఏ భవన్లో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్లు దాఖలు చేయాలనుకుంటున్న ఆయా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి, మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టును సిద్ధం చేయగా లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతాయి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచి్చన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్‌సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలి్సన చంద్రబాబు ప్రభుత్వం మెట్రోపై అశ్రద్ధ చూపించింది. ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పలు మార్పులు చేసింది. కొత్తగా టెండర్ల ప్రక్రియ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. చేసిన మార్పులకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో గతంలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రాజెక్టును మరో 4 కి.మీ మేర విస్తరించారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరుకుంది. మొత్తం 140 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రీటెండర్లను పిలవాలని ఏఎంఆర్‌సీ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో కొత్త సంస్థల్ని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అదనంగా కిలోమీటర్లు, కారిడార్లు ఏర్పాటు చెయ్యడంతో గతంలో ఉన్న రూ.8,300 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకుంది. రీటెండర్ ప్రక్రియకు సిద్ధమవుతున్నాం.. విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేస్తున్నాం. గతంలో ఉన్న డీపీఆర్‌ని కూడా మారుస్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ భోగాపురం వరకూ పెంచేందుకు కసరత్తు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్‌పై ప్రధాన దృష్టి సారించాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏఎంఆర్‌సీ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సంయుక్త కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. భోగాపురం వరకూ కారిడార్‌ని పొడిగించాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. ఆరో కారిడార్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదనని రూపొందించాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
అద్దె బస్సుల టెండర్‌పై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సంస్థ 1,035 అద్దె బస్సుల్ని ఏడాది పాటు తీసుకునేందుకు పిలిచిన టెండర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన రిట్‌పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారమైతే అంత పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సుల్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదని, కాబట్టి మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలంటూ టీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేశ్ కుమార్ దాఖలు చేసిన రిట్‌ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారించారు. సమ్మె కాలానికి అద్దె బస్సులు తీసుకోవడం సబబేనని, ఏడాది కాలానికి అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టమని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకరణ్‌రెడ్డి వాదించారు. ఆర్టీసీ సమ్మెపై వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఉన్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీంతో ఈ రిట్‌ను కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తి నిర్ణయించారు. ఈ దశలో పిటిషనర్ న్యాయవాది కల్పించుకుని, ఏడాదిపాటు అద్దెకు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకునేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా, ఈ విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేయాలని సూచించారు. -
రివర్స్ టెండరింగే శరణ్యం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగిరం చేయడంతో పాటు అందుకు అవసరమైన అనుమతులు సాధించడంలోనూ గత చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రకటించి ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చినప్పటికీ సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయించడంలో చంద్రబాబు విఫలం కాగా, నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలు కూడా మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే చందంగా పనులు సాగించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను రద్దు చేసి మళ్లి టెండర్లు (రివర్స్ టెండరింగ్) పిలవడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్చనీయాంశం అయ్యారు. రాష్ట్రంలో నిర్మాణ, మౌళిక వసతుల రంగాలు తిరోగమనంలో ఉన్నాయని అటువంటి పనులు చేపట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు లేకపోగా ప్రతీకూల పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ ఓ వైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బాబు పాలనలో సా...గిన పోలవరం ఈ నేపథ్యంలో పోలవరం పనులు సాగుతున్న తీరును పరిశీలిస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ ఆది నుంచి వివాదాలతో నత్తనడకన సాగుతుండగా అన్ని అనుమతులు లభించిన తరువాత కూడా చంద్రబాబు పాలనలో మరింతగా ప్రాజెక్ట్ పడకేసింది. 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి గ్రావిటీ పద్ధతిలో కుడి, ఎడమ కాలువ ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామనే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించినప్పటికీ 2019 డిసెంబర్ నాటికి కూడా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కనీసం మరో రెండేళ్ళ సమయం పడుతుంది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే. ఇప్పుడున్న నిర్మాణ సంస్థలు అందుకు తగిన విధంగా వేగంగా పనులు చేపట్టే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం మేలైన సంస్థలకు తక్కువ ధరకే పని అప్పగించేందుకు నిర్ణయించడం వల్లనే కాంట్రాక్ట్‌ను రద్దుచేసి రివర్స్ టెండరింగ్‌లో భాగంగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతా అనుకున్నట్లు సెప్టెంబర్ నాటికి పనిచేసే సంస్థ ఖరారైతే నవంబర్ నెలఖరి నుంచి మళ్లీ పనులు ప్రారంభించడం సాధ్యమవుతుంది. అప్పటికి గోదావరిలో ప్రవాహం పరిమితంగా ఉంటుంది. అడ్వాన్స్ నిధులిచ్చినా పనులు నత్తనడక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైనవి జలాశయ నిర్మాణంతో పాటు జల విద్యుత్ కేంద్రం. దీనిని సాంకేతిక భాషలో ఎర్త్ కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామ్ (ఈసిఆర్ఎఫ్) అని పిలుస్తారు. 2009లో ఈ పనులకు టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఆ ధరకు గిట్టుబాటు కావని ఎవరూ ముందుకు రాలేదు. 2012లో నాటి ప్రభుత్వం టెండర్లు పిలవగా ట్రాన్స్‌ట్రాయ్‌తో పాటు మరికొన్ని సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో తక్కువ ధరకు పనులు చేపట్టాయి. ఆ తరువాత ఆ సంస్థ దివాళా తీయడంతో అందులో కొంత పనిని తప్పించి వేరే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఆ తరువాత మరో రెండు సంస్థలకు కూడా మరికొన్ని పనులను అప్పగించారు. కాంట్రాక్ట్ రద్దు అయ్యే నాటికి మొత్తం మూడు సంస్థలు పనులను చేస్తుండేవి. ప్రాజెక్ట్‌లో కీలకమైన పనులు గత అయిదేళ్లలో ఏమాత్రం ముందుకు సాగలేదు. 2014లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి నిర్మాణ పనులకు అయ్యే వ్యయం మొత్తాన్ని భరిస్తోంది. మొత్తం ప్రాజెక్ట్ చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 16673 కోట్లు వ్యయం చేయగా అందులో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన తరువాత 11537 కోట్లు ఖర్చు చేశారు. అంతకు ముందు వైయస్ పాలనలో 5135 కోట్లు ఖర్చు అయ్యింది. కేంద్రం నుంచి పిపిఏ ద్వారా 6727 కోట్లు విడుదలయ్యింది. ఇంకా 4810 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం ప్రభుత్వం నిధులే కీలకమయినప్పటికీ పనులను పూర్తి చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయ్యింది. కీలకమైన పనులన్నీ పెండింగ్‌లోనే ఇంకా పనుల్లో 4 కోట్ల ఘనపు మీటర్ల మట్టి పని పూర్తికావాల్సి ఉంది. అదే విధంగా కీలకమైన కాంక్రీట్ పని 20 లక్షల ఘనపు మీటర్ల మేర నిర్మించాలి. ఇక స్ట్రక్చర్ల విషయానికి వస్తే 381 పూర్తికాగా 140 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 208 ఇంతవరకు ప్రారంభించనే లేదు. ప్రధానంగా హెడ్‌వర్క్స్‌లో 4 ప్యాకేజీ పనులతో పాటు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. మట్టిపనుల్లో డయఫ్రం వాల్, జట్గ్రౌటింగ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్పిల్‌వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్, పైలెట్ ఛానెల్, ఎడమ గట్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంక్రీట్ పనుల విషయానికి వస్తే స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్టిల్ ఛానెల్ మొదలైన కీలకమయిన పనులు పూర్తికావాల్సి ఉంది. అధిక చెల్లింపుపై నిగ్గు తేల్చిన నిపుణుల కమిటీ... వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో విచారణ చేయించారు. ఆ కమిటీ విచారణ జరిపి పనులు అంతంత మాత్రంగానే జరగ్గా అందులో 2364.8 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఏఏ పద్దు కింద ఎంతెంత మొత్తం అదనంగా చెల్లించింది, కాంట్రాక్టర్ల పట్ల నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రేమ చూపించింది సోదాహరంగా వివరించింది. నాటి ప్రభుత్వం ఆ విధంగా అదనపు మొత్తాలు చెల్లించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన హెడ్‌వర్క్ పనులను నాలుగు ప్యాకేజీలుగా రెండు సంస్థలకు అప్పగించగా ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మూడు ప్రధానమైన పనులు పూర్తి కావాలి. మరొక పని వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి కావాలి. కానీ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. యుద్ధప్రతిపాదికన పనులు చేస్తేనే ఇంకా రెండేళ్ల సమయం పడుతుంది. ప్రధానమైన జల విద్యుత్ కేంద్రం పనులు ఇంతవరకు ప్రారంభించనే లేదు. మొదలుకాని పనులకు అడ్వాన్స్‌లు జల విద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా 2017 జనవరి 9న టెండర్లు పిలవగా సంస్థలను ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. 2017 డిసెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుని 322 కోట్లు అడ్వాన్స్ చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌లోని స్పిల్‌వే ఛానెల్‌తో పాటు ర్యాక్‌ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, గేట్ల బిగింపు, జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో రద్దు చేసింది. జల విద్యుత్ కేంద్ర నిర్మాణం పనిని చేపట్టడంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థలతో పాటు పని అప్పగించిన ఏపి జెన్కో, నీటిపారుదల శాఖ ప్రధాన జలాశయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అందరూ ఒక్కరే అయినప్పటికీ పనులు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్షం వహించారు. అసలు పని చేపట్టేందుకు అవసరమైన స్థలం అప్పగించకపోయినప్పటికీ 787.20 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు జెన్కో చెల్లించడం కమిటీని విస్తుపరిచింది. అయినప్పటికీ పని ఏమాత్రం ముందుకు సాగలేదు. రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే అన్ని పనులను ఒకే ప్యాకేజీ క్రింద ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తాజాగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో టెండర్లు పిలిచింది. అనుమతులన్నీ వైఎస్సార్ పాలనలోనే పోలవరం ప్రాజెక్ట్ 1941లో ప్రతిపాదించగా వివిధ వివాదాలతో మూలన పడింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసినా పని ప్రారంభించలేదు. చంద్రబాబు (1995 నుంచి 2004వరకు) అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన రాగా నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివి అంటూ ప్రశ్నించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే జలయజ్ఞం కింద పెద్దఎత్తున నాటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను ఒక్కసారిగా చేపట్టి చరిత్ర సృష్టించారు. అందులో భాగంగా 2005లో పోలవరం పనులు ప్రారంభిస్తూ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు. మొత్తం 13 రకాల అనుమతులు అవసరం కాగా అందులో 10 అనుమతులు వైఎస్సార్ పాలనలోనే లభించాయి. కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులు, స్థల, జాతీయ వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి ఆర్ఆర్ఆర్ అనుమతులు, సుప్రీంకోర్ట్ నుంచి పాపికొండల అభయారణ్య స్థల మార్పిడి, కేంద్ర జలసంఘం నుంచి టీఏసి, ప్లానింగ్ కమీషన్ నుంచి పెట్టుబడి వ్యయం, అటవీ, పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు మొదలైనవి 2005 నుంచి 2009 మధ్య కాలంలో లభించాయి. చంద్రబాబు పాలనలో అంటే 2017, 2019ల్లో టీఏసి రేస్ టూ, సవరించిన అంచనాల అనుమతులు మాత్రమే లభించాయి. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన కీలకమైన అనుమతులు సాధించడంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. అంతా నాటి ముఖ్యమంత్రి (దివంగత) వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలోనే సాధ్యమైంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కీలకమైన యంత్రాంగాన్ని ముఖ్యంగా చీఫ్ ఇంజనీర్ కార్యాలయంతో పాటు అనుబంధ ఇంజనీరింగ్ వ్యవస్థను 2004 డిసెంబర్లోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఏర్పాటు చేశారు. ముంపు బాధితులకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్ అండ్ ఆర్) పనుల కోసం ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాతో పాటు కేంద్రం నుంచి నిధులు సాధించడం కోసం 2009 మేలో సమగ్ర నివేదికను నాటి వైఎస్సార్ ప్రభుత్వం సమర్పించింది. -
పోలవరం రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.4987.5 కోట్ల వ్యయంతో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి బిడ్లను స్వీకరించనుంది. వచ్చే నెల 19 వరకూ బిడ్ దాఖలుకు తుది గడువు. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌లో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు 1,887.5 కోట్ల రూపాయలకు, హైడెల్ ప్రాజక్ట్ 3,100 కోట్ల రూపాయలకు కలిపి నోటిఫికేషన్ విడుదలైంది. 2014 లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న మైనస్ 14 శాతంకు స్టాండెడ్ సర్వీస్ రేట్లు కలిపి 4987.5 కోట్ల రూపాయలకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ సోమవారం నుంచి ఈ-టెండరింగ్ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. పీపీఏ సీఈవో అభిప్రాయాలపై స్పష్టత ఇస్తాం కాగా సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్ మొదటి వారం నుంచి శరవేగంగా పనులు చేపట్టి రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలవరం పనులపై టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇక పీపీఏ సీఈవో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్‌తో ఖజానాకు ఆదాయం వస్తుందని అన్నారు. -
రివర్స్ టెండరింగ్‌కు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి : రివర్స్ టెండరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్తోపాటు కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానంపై మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 22వ తేదీన నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ జాబితాలో 29 అంశాలను నిర్ధేశించింది. ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్ కార్యచరణ ప్రారంభంకానుంది. నిర్మాణంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టు సంస్థను తప్పించిన అనంతరం మిగిలిన పనులను అసలు ఒప్పంద రేట్లతో జలవనరుల శాఖ ప్రాథమిక అంచనా విలువను నిర్దారించనుంది. ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులపై ప్రభుత్వం ఈ- టెండరింగ్‌కు వెళ్లనుంది. అలాగే ఈ-టెండరింగ్‌లో పాల్గొనే సంస్థ ఏపీలో రిజిస్టర్ కావాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఒకవేళ బిడ్డర్ రాకపోతే మిగిలిన పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఈ-టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. కాగా, పోలవరం పనులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం నిపుణుల కమిటీ సిఫార్సులను పోలవరం ప్రాజెక్టుకు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు అనుమతి తీసుకుంది. -
టెండరింగ్!
- మేడారం టెండర్లలో సీన్ రిపీట్ - ఐటీడీఏ కార్యాలయం సాక్షిగా - డబ్బు పంపిణీ లెస్‌గా కోట్ చేసే - కాంట్రాక్టర్లకు బెదిరింపులు ఏటూరునాగారం : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ద్వారా చేపట్టిన 12 అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యూరు. రూ.1.01 కోట్ల నిధులతో చేపట్టిన టెండ ర్లలో సీన్ రిపీట్ అయింది. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కాంట్రాక్టర్లు రింగ్ కావడానికి ఒక షెడ్యూల్‌కు రూ. 5 వేల చొప్పున కొనుగోలు చేశారు. లెస్ వేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ షెడ్యూళ్లను రద్దు చేయించారు. గతనెల 30న జరిగిన టెండర్ల రింగ్ ప్రక్రియే ఇప్పుడు కూడా యథేచ్చగా సాగింది. గిరిజన సంక్షేమ శాఖకు ఈ-ప్రొక్యూర్మెంట్ పెట్టే అవకాశం ఉన్నా.. ఓపెన్ టెండర్లకు అధికారులు మొగ్గు చూపడం తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు టెండర్ వేసే వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఐటీడీఏ కార్యాలయం సమీపంలోనే కాంట్రాక్టర్ల వద్ద ఉన్న షెడ్యూళ్ల ఫారాలను డబ్బులు ఎరచూపి తీసుకోవడం గమనార్హం. కలెక్టర్, పీఓ ఆదేశాలు బేఖాతర్.. గిరిజన సంక్షేమ శాఖ టెండర్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి లేకుండా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కరుణ, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఆదేశాలను ఇంజనీరింగ్ అధికారులు బుట్టదాఖలు చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కాకముందే ఎలాంటి అక్రమాలు జరిగినా సస్పెం డ్ చేస్తామని పీఓ ఇంజనీరింగ్ కార్యాలయం సిబ్బందిని హెచ్చరించినా.. అదే తంతు జరిగిం ది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా డబ్బు పంపిణీకి తెగించారు. ఇలా సిండికేట్ అయిన పనులకు తక్కువ లెస్‌గా నమోదు కాగా, సిండికేటు కాని పనులకు సుమారు 28 శాతం లెస్‌కు పోవడం గమనార్హం. 104 టెండర్లు దాఖలు.. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపట్టబోయే 12 అభివృద్ధి పనులకు సోమవారం టెండర్లను ఓపెన్ చేశారు. 104 టెండర్లు దాఖలు అయ్యాయని డీఈఈ మల్లయ్య తెలిపారు. ఇం దులో 96 టెండర్లను ఓపెన్ చేశామన్నారు. అలాగే వై. రవి అనే వ్యక్తి 9 టెండర్లను బాక్స్‌లో వేసినప్పుడు అతడి లెటర్ ప్యాడ్‌పై ఈ టెండర్లు ఓపెన్ చేయవద్దని రాసిన కాగితం లభించడంతో ఆ టెండర్లను ఓపెన్ చేయలేదన్నారు. ఈఈ ఆదేశాల మేరకు వాటిని మంగళవారం ఓపెన్ చేస్తామని చెప్పారు. అయితే లెటర్ ప్యాడ్ అసలైనది కాదని, కేవలం జిరాక్స్ పేపర్‌పై స్థానిక కాంట్రాక్టర్లు సంతకం చేసి టెండర్ బ్యాక్స్‌లో వేశారని బాపిరెడ్డి అనే వ్యక్తి డీఈఈకి వివరించారు. దీం తో ఆ తొమ్మిది టెండర్ల ప్రక్రియ వాయిదా పడిం ది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేం దర్, ఏటీఓలు ప్రభుదాస్, శ్రీనివాస్, జేటీఓ ముత్తయ్య పాల్గొన్నారు.