సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ మేరకు పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) సన్నద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బా«ధ్యతను గత ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీఎంఆర్‌డీఏ భవన్‌లో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్లు దాఖలు చేయాలనుకుంటున్న ఆయా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్‌ఎఫ్‌పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి, మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది.
గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టును సిద్ధం చేయగా లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతాయి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచి్చన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్‌సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలి్సన చంద్రబాబు ప్రభుత్వం మెట్రోపై అశ్రద్ధ చూపించింది. ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పలు మార్పులు చేసింది.
కొత్తగా టెండర్ల ప్రక్రియ..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. చేసిన మార్పులకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో గతంలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రాజెక్టును మరో 4 కి.మీ మేర విస్తరించారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరుకుంది. మొత్తం 140 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రీటెండర్లను పిలవాలని ఏఎంఆర్‌సీ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో కొత్త సంస్థల్ని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అదనంగా కిలోమీటర్లు, కారిడార్లు ఏర్పాటు చెయ్యడంతో గతంలో ఉన్న రూ.8,300 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకుంది.
రీటెండర్ ప్రక్రియకు సిద్ధమవుతున్నాం..
విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేస్తున్నాం. గతంలో ఉన్న డీపీఆర్‌ని కూడా మారుస్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
– రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ
భోగాపురం వరకూ పెంచేందుకు కసరత్తు
మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్‌పై ప్రధాన దృష్టి సారించాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏఎంఆర్‌సీ, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ సంయుక్త కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. భోగాపురం వరకూ కారిడార్‌ని పొడిగించాలన్నది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. ఆరో కారిడార్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదనని రూపొందించాం.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment