వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు
మరోసారి డీపీఆర్ తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటికే కేంద్రానికి పంపిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సమగ్ర దూరదృష్టితో నివేదిక సిద్ధం చేసిన వైనం
76 కిలోమీటర్ల లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.14,309 కోట్లు
ఇప్పుడు కొత్త డీపీఆర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తాత్సారం
ముందు అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడమే లక్ష్యం
ఇదయ్యేవరకు రాష్ట్రంలో ఎక్కడా మెట్రో లేనట్టే
విశాఖపట్నం వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోపై మళ్లీ చంద్రబాబు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అంతా ఒక్కచోటకే పరిమితం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విశాఖ నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ముందు అమరావతికి మెట్రో రైలు వచ్చేవరకు రాష్ట్రంలో ఇంకెక్కడా మెట్రో ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తోంది.
ఇందులో భాగంగానే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పనులకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. వాటిని మరింత ఆలస్యం చేసేందుకు మళ్లీ మొదటికి తీసుకొస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీన్ని రద్దు చేసి కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నం
చంద్రబాబుకి నచ్చలేదట..
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపటా్నన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ముందడగు వేసింది. లైట్ మెట్రో ప్రాజెక్టును పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపింది. అయితే.. కూటమి ప్రభుత్వం రావడంతో ఆలస్యం, అలసత్వం చోటు చేసుకుంటున్నాయి. విశాఖ అభివృద్ధి తమకు ఇష్టం లేదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల విశాఖలో పర్యటించిన ఆయన మెట్రో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయిలో మెట్రో డీపీఆర్ తయారు చేసినట్లు వివరించినా.. తనకు ఆ డీపీఆర్ నచ్చలేదని చంద్రబాబు చెప్పేశారు. మళ్లీ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఇలాగైతే మోక్షమెప్పుడో..
జాతీయ రహదారుల నిర్మాణాల్లో తలమునకలైన ఎన్‌హెచ్‌ఏఐతో కలిసి మెట్రో డీపీఆర్ రూపొందించడం అనేది అంతులేని కథగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్యం, అలసత్వంతో వైజాగ్‌కు మెట్రో రాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ తరహా ఆదేశాలు జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముందు గన్నవరం నుంచి అమరావతి వరకు మెట్రో రైలు నిర్మించడమే చంద్రబాబు లక్ష్యమని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో ఎక్కడా మెట్రో మాటే లేకుండా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. కొత్త డీపీఆర్ తయారీకి.. ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.
దానిలో మార్పులు చేర్పులు అంటూ మెలికపెడితే.. మరో ఆరు నెలలు గడిచిపోతుంది. దాన్ని కేబినెట్ ఆమోదించి.. కేంద్రానికి పంపించేందుకు మరో 6 నెలలు.. కేంద్రం ఆమోదించేందుకు మరో ఏడాది.. ఇలా.. ఈ ఐదేళ్లు విశాఖ మెట్రో ప్రాజెక్టు కాగితాల్లోనే కునారిల్లేలా చేయడమే చంద్రబాబు ఉద్దేశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదో వంక.. అటకెక్కించడం పక్కా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైజాగ్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేసింది. విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. మొత్తం 76.90 కి.మీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీన్ని కేబినెట్ కూడా ఆమోదించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) విధానంలో మెట్రో నిర్మించడానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని.. ఇందులో ప్రభుత్వాలు రూ.5,723.6 కోట్లు భరించాల్సి ఉండగా ప్రైవేట్ డెవలపర్.. వీజీఎఫ్ కింద రూ.8,585.4 కోట్లు భరిస్తూ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు టెండర్లు ఖరారైనప్పటి నుంచి మూడేళ్లకే తొలి మార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో అడుగులు వేసింది. భవిష్యత్తులో విశాఖలో నిర్మించే ఫ్లైఓవర్లను కూడా దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ డిజైన్లు సిద్ధం చేశారు.
అయితే చంద్రబాబు.. మెట్రో ఫ్లైఓవర్ల ఎత్తు, వెడల్పులు సరిగా లేవని.. అందులో మార్పులు చేయాలని సూచించడం గమనార్హం. మెట్రో పిల్లర్ల ఎత్తు ఎలా పెంచాలి? ఏ ప్రాంతంలో ఫ్లైఓవర్ పొడవుగా ఉండాలి.. ఎక్కడ వెడల్పు తక్కువగా ఉండాలో నిపుణులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా.. ఏదో ఒక వంకతో.. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నెమ్మదిగా అటకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖని వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నడంపై నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment