సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.4987.5 కోట్ల వ్యయంతో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి బిడ్లను స్వీకరించనుంది. వచ్చే నెల 19 వరకూ బిడ్ దాఖలుకు తుది గడువు. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది.
ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌లో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు 1,887.5 కోట్ల రూపాయలకు, హైడెల్ ప్రాజక్ట్ 3,100 కోట్ల రూపాయలకు కలిపి నోటిఫికేషన్ విడుదలైంది. 2014 లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న మైనస్ 14 శాతంకు స్టాండెడ్ సర్వీస్ రేట్లు కలిపి 4987.5 కోట్ల రూపాయలకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ సోమవారం నుంచి ఈ-టెండరింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
పీపీఏ సీఈవో అభిప్రాయాలపై స్పష్టత ఇస్తాం
కాగా సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్ మొదటి వారం నుంచి శరవేగంగా పనులు చేపట్టి రెండేళ్లలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలవరం పనులపై టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇక పీపీఏ సీఈవో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్‌తో ఖజానాకు ఆదాయం వస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment