సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది.
ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం)
Comments
Please login to add a commentAdd a comment