సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
శ్రీశైలం ప్రాజెక్టు వరకే...
గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది.
కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది.
చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు!
సాగర్ 570 అడుగులకు చేరితేనే....
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
నారు ఎండిపోతోంది
పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.
– పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్‌పల్లి, మిర్యాలగూడ
సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా...
►2019- ఆగస్టు 12
►2020- ఆగస్టు 8
►2021- ఆగస్టు 2
►2022 - జూలై 28
ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో)
గరిష్టం | ప్రస్తుతం | |
శ్రీశైలం | 885 | 864.57 |
నాగార్జున సాగర్ | 590 | 515.4 |
Comments
Please login to add a commentAdd a comment