సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది. ఏటేటా పూడిక పేరుకుపోతుండటంతో.. శ్రీశైలం లైవ్ స్టోరేజీ (వాడుకోదగిన నీళ్లు) సామర్థ్యం 253.058 టీఎంసీల నుంచి 188.71 టీఎంసీలకు.. నాగార్జునసాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీల నుంచి 189.295 టీఎంసీలకు పడిపోయింది.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్‌ఆర్‌ఎస్)’ సర్వేలలో ఈ అంశం వెల్లడైంది. జలాశయాల్లో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల డేటా ఆధారంగా పరిశీలించి, విశ్లేషించడం పూడిక పరిస్థితిపై నివేదికను సిద్ధం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలు తాగు, సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
13.182 టీఎంసీలు తగ్గిన సాగర్ సామర్థ్యం
నాగార్జునసాగర్ డ్యామ్‌ను 1956–1968 మధ్య నిర్మించారు. అప్పట్లో జలాశయం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 202.47 టీఎంసీలుకాగా, 1999లో నిర్వహించిన శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వేలో సామర్థ్యం 195.806 టీఎంసీలకు తగ్గిపోయిందని తేలింది.
2001, 2009లలో నిర్వహించిన రిజర్వాయర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలలో మాత్రం సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం వరుసగా 217.47 టీఎంసీలు, 213.388 టీఎంసీలని తేలింది. తాజాగా శాటిలైట్ డేటాను విశ్లేషించగా.. 2020 నాటికి సాగర్ లైవ్ స్టోరేజీ సామర్థ్యం 189.295 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1968–2020 మధ్య 52 ఏళ్లలో 13.182 టీఎంసీల ( 6.511శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. సగటున ఏటా 0.125 శాతం నిల్వ సామర్థ్యాన్ని నష్టపోతోంది.
శ్రీశైలానికి 64.339 టీఎంసీల నష్టం
కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయాన్ని 1981లో నిర్మించగా.. 1984 నుంచి నీళ్లను నిల్వ చేస్తున్నారు. 253.058 టీఎంసీల లైవ్ స్టోరేజీ, 55 టీఎంసీల డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) కలిపి మొత్తం 308.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. తాజా అధ్యయనంలో శ్రీశైలం లైవ్ స్టోరేజీ 188.71 టీఎంసీలకు తగ్గినట్టు తేలింది. అంటే 1984–2021 మధ్య 37 ఏళ్లలో శ్రీశైలం ఏకంగా 64.339 టీఎంసీల (25.425శాతం)సామర్థ్యాన్ని నష్టపోయిందని, ప్రాజెక్టు ఏటా 0.687 శాతం లైవ్ స్టోరేజీని కోల్పోతోందని వెల్లడైంది.
ఇంతకుముందు 1990, 1999లలో నిర్వహించిన రిమోట్ సెన్సింగ్ సర్వేల్లో శ్రీశైలం లైవ్ స్టోరేజీ సామర్థ్యం 194.437 టీఎంసీలు, 181.95 టీఎంసీలకు తగ్గిపోయినట్టు గుర్తించారు. తాజా సర్వేతో పోల్చితే 1990, 1999 నాటి సర్వేలు ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొన్నా.. అప్పట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియాను సరిగ్గా అంచనా వేయక కచ్చితమైన ఫలితం రాలేదని తాజా సర్వేలో సీడబ్ల్యూసీ పేర్కొంది.
పూడికను నివారించేదిలా?
జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని అని.. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. ఈ మేరకు తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది.
♦ అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకునేందుకు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా చెట్లను పెంచాలి.
♦ నదీ తీరాల్లో రివిట్‌మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
♦ నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు.
♦ వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది.
♦ రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి.
Comments
Please login to add a commentAdd a comment