అత్యధిక ప్రాధాన్యంతో పెండింగ్, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం: మంత్రి ఉత్తమ్
ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందే ఎడమ కాల్వకు నీరు: కోమటిరెడ్డి
సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసిన మంత్రులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద కేటాయించామన్నారు.
మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.
గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్‌తోపాటు ఏఎంఆర్‌పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల
నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్‌రెగ్యులేటర్ ప్యానల్‌బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం స్విచ్ ఆన్‌చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్‌ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.
ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment