సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వెంకట్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్
నల్లగొండ: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు, దుబారా ఖర్చు, దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయని, వాటన్నింటిపై దోపిడీ పత్రాలను విడుదల చేస్తామని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ప్రతి శాఖలోనూ అప్పులు పేరుకుపోయాయన్నారు.
వాటన్నింటిపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే.. వారు ఏదో చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శ్వేద పత్రం విడుదల చేశారని విమర్శించారు. అందుకే వారు పదేళ్లలో తెలంగాణలో చేసిన దోపిడీపై పత్రాలను విడుదల చేస్తామన్నారు. దేశమే సిగ్గుపడేలా రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసి తామేదో సాధించినట్లు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 1వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిదన్నారు.
రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: మంత్రి ఉత్తమ్
రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కుర్చీలు వేసుకుని కట్టిస్తామని చెప్పిందని, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టించలేదన్నారు. 28వ తేదీ నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
పది జాతీయ స్థాయి రోడ్లు వస్తే చాలు: మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో రోడ్లు తక్కువగా నిర్మించారని, తాను గతంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొంత ముందుకు తీసుకుపోయానని, ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్డు భవనాల మంత్రి కావడంతో పది జాతీయ స్థాయి రోడ్లను మంజూరు చేయిస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతిరెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment