
పదేళ్ల పాలనలో ఎస్‌ఎల్‌బీసీకి కరెంట్ కూడా ఇవ్వలేదు
బీఆర్‌ఎస్ పాలకులు జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అచ్చంపేట రూరల్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయడం కంటే.. వారి జేబులు నింపుకోవడంపైనే శ్రద్ధ చూపారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులదేనని చెప్పారు. గురువారం దోమలపెంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.
నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నీటి నుంచి కాపాడటంతోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి పరుగులు పెట్టించారన్నారు. సొరంగ పనులు ముందుకుసాగడానికి గత ప్రభుత్వం కరెంట్ కూడా అందించలేదని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఎంతో నిష్ణాతులైన రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణులతో సమన్వయం చేసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు.
11 ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసి పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు. రెండుమూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని, రెండు,మూడు నెలల్లో టన్నెల్ పనులు పునఃప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు అనుమతులు అడగటం సిగ్గు చేటని, వారుచెప్పే మాటల్లో అర్థం లేదన్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతున్నవి అబద్ధపు మాటలని చెప్పారు.
గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిగ్గుండాలన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ ప్రతిపక్ష నాయకుడికి చూసేందుకు అనుమతి ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు సైతం అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము భిన్నంగా వ్యవహరిస్తున్నామని, సొరంగ సంఘటనను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ నాయకులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు.
హెలికాప్టర్‌లో తిరగాలన్న మోజు లేదు
తాను పాలన మరిచి హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నానని బీఆర్‌ఎస్ నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటని, తాను సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడటానికే హెలికాప్టర్ ఉపయోగిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకే ఇక్కడకు వస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తాను పైలట్‌నని, హెలికాప్టర్‌లో తిరిగే మోజు తనకు లేదన్నారు.
గత ప్రభుత్వంలో శ్రీశైలం పవర్‌హౌస్‌లో 9 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదని, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్తుంటే దారిలో అరెస్టు చేశారన్నారు. సొరంగ ఘటనను రాజకీయ లబ్ధికోసం బీఆర్‌ఎస్ మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉండి ఎస్‌ఎల్‌బీసీకి కరెంటు కట్ చేయడంతోనే డీవాటర్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత పాలకులు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రాజెక్టు ఎన్నడో పూర్తయ్యేదన్నారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వి.హన్మంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment