
టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం: ఉత్తమ్
ఆర్మీ, నేవీ, డిజాస్టర్ టీమ్స్ నిపుణులతో రెస్క్యూ ఆపరేషన్
ఈ అంశంపై బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సహాయక చర్యలకు భారీగా వస్తున్న నీటి ఊట అడ్డంకిగా మారుతోందని తెలిపారు. ఆ నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూనే.. లోపలున్న వారికోసం నిరంతరం ఆక్సిజన్‌ను పంపింగ్ చేస్తున్నామని వివరించారు. ఉత్తమ్ ఆదివారం మంత్రి జూపల్లితో కలసి టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘టన్నెల్‌లో నీటి ప్రవాహం పెరుగుతోంది.
రాతిపొరలు వదులై మట్టి కూలడంతో అక్కడి నుంచి కూడా నీరు వస్తుండటంతో అంతా బురదమయంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సవాలుగా మారుతోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాంకేతిక నిపుణులు 24 గంటలపాటు ప్రయత్నిస్తున్నారు. భారీ యంత్రాలను టన్నెల్‌లోకి పంపి రక్షించే పరిస్థితి లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. మట్టికుప్పలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కూడా సీఎంతో మాట్లాడారు..’’అని ఉత్తమ్ తెలిపారు.
ఘటనపై బీఆర్‌ఎస్ రాజకీయం..
ప్రమాదం విషయం తెలియగానే ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించిందని, ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఈ ఘటనపై చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. టన్నెల్ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment