
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక.. నాగర్ కర్నూల్ నుంచి ఎనిమిది ఆంబులెన్స్‌లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్‌వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.
ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు.
