రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పదేళ్లుగా కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. న్యాయమైన నీటి వాటా దక్కించుకోవడంలో బీఆర్‌ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పుపై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఆయన సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని తొలినుంచి కాంగ్రెస్ పార్టీనే పోరాటం చేస్తోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది నెలలకే 2015 జూన్‌లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటిని వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్‌ఎస్ తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఆ చీక టి ఒప్పందంతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం వాటా మేరకు ఒప్పుకుని బీఆర్‌ఎస్ అన్యాయం చేస్తే.. తెలంగాణకు 70 శాతం వాటా రావాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్ 3 అంశం తెరపైకి వచ్చిందని చెప్పారు. గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు ఓకే చెప్పింది తప్ప.. ఇందులో బీఆర్‌ఎస్ గొప్పతనమేమీ లేదని అన్నారు. నదీ జలాల వాటాలను తేల్చకుండా జాప్యం జరగడంలో బీఆర్‌ఎస్ ప్రధాన దోషి అని నిందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
ఉత్తమ్ సంధించిన ప్రశ్నలివే..
⇒ పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీళ్లు తరలిస్తుంటే అప్పుడు అధికారంలో ఉన్న హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారు?
⇒ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులు చేపడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
⇒ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అపెక్స్ మీటింగ్‌కు అప్పటి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా?
⇒ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ కేటాయింపులు జరిగేలా గడిచిన పదేళ్లలో ఎందుకు ఒత్తిడి చేయలేదు?
⇒ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులు నష్టపోతుంటే కళ్లప్పగించి ప్రేక్షక పాత్ర పోషించింది ఎవరు?
⇒ గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పింది కేసీఆర్ కాదా?
⇒పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటిలో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని 1978లో గోదావరి రివర్ బోర్డు అవార్డు చెబుతోంది. ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకు దక్కాలి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు రావాలి కదా? అప్పుడు బీఆర్‌ఎస్ పట్టుబడితే, నిజంగా పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీలకు పెరిగేది కదా? ఆ నీటి వాటాలు ఎందుకు తెచ్చుకోలేదు? ఇది ఎవరి వైఫల్యం?
Comments
Please login to add a commentAdd a comment