Sudden Checks
-
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: హోం మంత్రి
సాక్షి, గుంటూరు: పరిధి చూడకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె గుంటురు మహిళ పోలీసు స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీసు స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయ, దిశ ఘటనలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు. మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని.. ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో దురుసుగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా పోలీసు స్టేషన్లో మహిళా అధికారులను నియమించనున్నామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. -
నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: జీహెంఎంసీ కమిషనర్ దాన కిషోర్ నగరంలో గురువారం ఉదయం సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో సెంటెన్స్ పాఠశాల ఎదురుగా రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వాణిజ్య భవనానికి పదివేల రూపాయల జరిమానా విధించారు. బహిరంగ మూత్ర విసర్జన చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజీ, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే వాటికి సంబంధిత జలమండలి అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఆలుగడ్డ బావి సమీపంలో పబ్లిక్ టాయిలెట్లు పరిశీలించి, టాయిలెట్లలో మరింత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నగరంలోని ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లు తొలగించకపోవడతో జీహెచ్ఎంసీ అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా మెట్టుగూడలో ఇరుకైన గల్లీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణనపై తనిఖీ చేసిన కమిషనర్. ఇంటింటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోలకు అందించాలని నివాసితులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలు వీదుల్లోకి రోజు వస్తున్నాయా, పారిశుధ్య సిబ్బంది స్వీపెంగ్ చేస్తున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్న కమీషన్. అనంతరం మెట్టుగూడాలోని స్మశాన వాటికను పరిశీలించి శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచడంతో పాటు లోపలికి అక్రమంగా ఎవరు వెళ్లకుండా గేట్‌ను ఏర్పాటు చేసి ప్రహరీ గోడకు కలరింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సౌత్ జోన్ చార్మినార్‌లో పారిశుధ్య కార్యక్రమాలు, చార్మినార్ పెడిస్టీరియన్ పనులపై మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా తనిఖీలు నిర్వహించారు. -
పోయెస్ గార్డెన్లో ఐటీ దాడులు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో శుక్రవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. న్యాయస్థానం అనుమతితో వారు ఈ దాడులు చేశారు. శుక్రవారం రాత్రి ఐటీ అధికారుల బృందం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అంతకముందే శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జయ టీవీ సీఈవో వివేక్‌కు ఫోన్ చేసి వేద నిలయం తాళాలు తీసుకుని రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన అధికారులు జయ, శశికళ వ్యక్తిగత గదుల్లో తనిఖీలు చేపట్టారు. శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి ఒక లాప్టాప్, నాలుగు పెన్ డ్రైవ్‌ల కోసం ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. పూంగున్రన్ గది, రికార్డుల గది, శశికళ వాడిన గదుల్లో మాత్రమే సోదాలు చేశామని ఐటీ అధికారి చెప్పారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేద నిలయం చుట్టుపక్కల భారీ భద్రత ఏర్పాట్లు చేసినా.. తనిఖీల విషయం తెలియగానే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకుని పోలీసులతో ఘర్షణ పడ్డారు. దాడుల్ని శశికళ వర్గం తప్పుపట్టింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మాట్లాడుతూ.. అమ్మ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. శశికళ భర్తకు రెండేళ్ల జైలు సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొత్త కారు సెకండ్‌హ్యాండ్ అని చెప్పి కస్టమ్ శాఖను మోసగించిన కేసులో శశికళ భర్త నటరాజన్‌కు సీబీఐ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో శశికళ అక్క కుమారుడు భాస్కరన్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. 1994 సెప్టెంబర్ 6వ తేదీన నటరాజన్ లండన్ నుంచి లెక్సెస్ అనే లగ్జరీకారును తమిళరసి పబ్లికేషన్ పేరిట దిగుమతి చేసుకున్నారు. -
కారాగారంలో కీచకపర్వం
మహిళలకు బాహ్య ప్రపంచంలోనే కాదు కారాగారంలోనూ రక్షణ లేదనే దారుణ ఉదంతం పుదుచ్చేరి జైలులో చోటుచేసుకుంది. జైల్లో నుంచే నేరాలకు పాల్పడేందుకు అధికారులే సహకరిస్తున్నారు. విలాసాల కోసం పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకుపంపుతున్నారు. వారి వల్ల ఇతర మహిళా ఖైదీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసింది. ఇలాంటి దురాగతాలపై పుదుచ్చేరి జైళ్ల ఐజీ నేతృత్వంలో విచారణ సాగుతుండగా కొందరిని ఇప్పటికే సస్పెండ్‌చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: మగ, మహిళా ఖైదీలు కలుసుకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన సిబ్బందే వారి రాసలీలలకు సహకరిస్తున్న సంఘటనలు పుదుచ్చేరి కేంద్ర కర్మాగారంలో చోటుచేసుకున్నాయి. గురువారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక (మాలైమలర్) ద్వారా అనేక వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రంలో జరిగే నేరాలకు సంబంధించిన వారిని పుదుచ్చేరి కాలాపట్టిలోని కేంద్ర కారాగారంలో పెడతారు. ఈ జైలులో సుమారు 600 మంది ఖైదీలున్నారు. వీరిలో వందమంది మహిళా ఖైదీలు. జైలులో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంచేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. మహిళా జైలు పరిధిలో మహిళా సిబ్బందే విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ జైలులో పేరొందిన కొందరు రౌడీలను అరెస్ట్‌చేసి పెట్టి ఉన్నారు. వీరు జైలులో ఉంటూనే బయట ఉన్న తమ ముఠా సభ్యులతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఖైదీలకు సెల్ఫోన్లను అందుబాటులో ఉంచుతూ వారి రౌడీరాజ్యాన్ని పాలించేందుకు సహకరిస్తున్న వారు గతంలో సస్పెండయ్యారు. మహిళా ఖైదీలతో పురుష ఖైదీల రాసలీలలు ఇదిలా ఉండగా, ఖైదీలకు మరిన్ని సేవలు అందించేందుకు జైలు వార్డన్లు తెగించారు. ఒక పేరొందిన రౌడీ, మహిళా దాదా పరస్పరం కలుసుకునేందుకు జైలు అధికారులే ఏర్పాట్లుచేసినట్లు తేలింది. ఈ జైల్లో మర్డర్ మణికంఠన్ అనే పేరొందిన రౌడీ ఉన్నాడు. అతనిపై హత్య, కిడ్నాప్, డబ్బు దోచుకోవడం వంటి అనేక కేసులున్నాయి. ఈ ఏడాది జనవరిలో పుదుచ్చేరి మాజీ స్పీకర్ వీఎమ్‌సీ శివకుమార్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో కారైక్కాల్‌కు చెందిన మహిళా దాదా ఎళిలరసిని అరెస్ట్‌చేసి పుదుచ్చేరి జైల్లో పెట్టారు. మణికంఠన్, ఎళిలరసి కలుసుకునేందుకు జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఈ విషయం జైళ్లశాఖ ఐజీ పంకజ్‌కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో అర్ధరాత్రి వేళ జైల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనందరాజ్, చీఫ్‌వార్డన్ వీరవాసు, వార్డన్లు కలావతి, మదివానన్‌లను ఐజీ సస్పెండ్ చేశారు. మణికంఠన్, ఎళిలరసి తమ శత్రువులను హతమార్చేందుకు జైలులోనే కుట్ర పన్నినట్లు ఐజీ జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. మహిళా ఖైదీలకు లైంగిక వేధింపులు జైల్లో పురుష, మహిళా ఖైదీలు ఎంతమాత్రం కలుసుకునేందుకు వీలులేకుండా చేసిన ఏర్పాట్లకు జైలు సిబ్బందే గండికొట్టారు. పురుష, మహిళా ఖైదీలు రహస్యంగా కలుసుకునే జైలు సిబ్బందే ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా పేరొందిన పురుష ఖైదీలు మహిళా ఖైదీలను కలుసుకునేందుకు ప్రధానంగా ముగ్గురు వార్డెన్లు సహకరిస్తున్నట్లు సమాచారం. సదరు రౌడీల వల్ల మహిళా ఖైదీలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. జైలులోని నాలుగు గోడల మధ్యనే మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు. ఏయే పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకు పంపారో తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ బాగోతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వార్డెన్లను ఉన్నతాధికారులు ఇప్పటికే విచారించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేయవచ్చని తెలుస్తోంది. -
‘రేషన్’లో అక్రమాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రజా పంపిణీ వ్యవస్థలో క్షేత్రస్థాయి అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. సరుకుల పంపిణీలో కీలకమైన రేషన్ డీలర్ల మాయాజాలానికి తెరవేసేందుకు ఆకస్మిక తనిఖీలకు నడుంబిగించింది. జాయింట్ కలెక్టర్ మొదలు.. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ పౌరససరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లంతా కలిసి ఇరవై బృందాలుగా ఏర్పడి సోమవారం మూకుమ్మడిగా తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని 75 దుకాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్రమంగా కొనసాగుతున్న డీలర్లు.. ప్రజలకు పంపిణీ చేసే సరుకులు బొక్కేసిన నిర్వాహకుల బాగోతాలు వెలుగుచూశాయి. రేషన్ దుకాణాల్లో బినామీలు పాతుకుపోయినట్లు యంత్రాంగం గుర్తించింది. సోమవారం మల్కాజిగిరి డివిజన్లో 75 దుకాణాలను తనిఖీ చేయగా అందులో పది శాతం బినామీలే ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరిపై పౌరసరఫరాల చట్టం ప్రకారం సెక్షన్7, 407 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా మరికొన్ని దుకాణాల్లో సరుకుల పంపిణీ తర్వాత మిగులు సరుకుల కోటాలోనూ భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇకనుంచి తనిఖీలే తనిఖీలు.. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల గుట్టు తేల్చేందుకు జిల్లా వ్యాప్తంగా వరుసగా వారం రోజుల పాటు తనిఖీల ప్రక్రియ కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది. అదేవిధంగా వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి దుకాణాల్లో సరుకుల పంపిణీపై పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8వరకు తనిఖీలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తనిఖీ చేస్తారు. -
తనిఖీలతో హడలెత్తించిన డిప్యూటీ సీఎం
కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులపై మండిపాటు దళారులను దూరంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు సాక్షి, కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యంత్రి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు కేఈ కృష్ణమూర్తి చేపట్టిన ఆకస్మిక తనిఖీ ఆ శాఖ ఉద్యోగుల్లో దడ పుట్టించింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా తన సొంత శాఖకు చెందిన కార్యాలయాల్లో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్టి, సొంత శాఖ ప్రక్షాళనకు ఆయన నడుబింగించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి ఆయన ఉదయం 10.30 గంటలకే చేరుకుని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తొలుత కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్న వారిపై మండిపడ్డారు. ఎవరెవరు రాలేదని ఆరా తీశారు. వారందరికీ హాజరు పట్టికలో గైర్హాజరు వేయించారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కారాదని వారిని తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సెంట్రల్ సర్వర్ పనిచేస్తుందా లేదా అని అదే కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు స్కానింగ్ చేశారనే వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 14వ తేదీ గురువారం ఒక్కరోజు 32 డాక్యుమెంట్లు, రూ 6.50 లక్షల ఆదాయం వచ్చిందని సబ్‌రిజిస్ట్రార్ వెంకటరమణారావు వివరించారు. అక్కడి నుంచి నేరుగా రికార్డు గదిలోకి వెళ్లి రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు విధులకు హాజరుకావడంతో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తనిఖీలు.. కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ డిప్యూటీ సీఎం తనీఖీ చేశారు. జూనియర్ అసిస్టెంట్, కర్నూలు జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్ కూడా సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా రిజిస్ట్రార్ శివగోపాల్ ప్రసాద్ కూడా సమయానికి విధుల్లో లేకపోవడంతో ఆయన ఎక్కడా అని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. అతను హైదరాబాద్‌కు డ్యూటీ నిమిత్తం వెళ్లారని సిబ్బంది తెలుపుగా.. పేర్కొనగా.. అసలు ఆయన ఆన్‌డ్యూటీపై వెళ్లారా... సెలవు పెట్టారా... అన్న సమాచారం రిజిస్టర్లో పేర్కొనకపోతే ఎలా అని కేఈ కోపోద్రిక్తుడయ్యారు. కర్నూలు కార్యాలయంలో వస్తున్న ఆదాయం గురించి జాయింట్-1 మహబూబ్‌బాషను అడిగారు. గత నెల ఏప్రిల్‌లో టార్గెట్ 2.44 కోట్లు ఉండగా ఆదాయం రూ 5.84 కోట్లు వచ్చిందని వివరించారు. ఈ ఆదాయం కూడా కేవలం బిర్లా కాంపౌండ్ స్థలాల్లో నిర్మితమవుతున్న బిల్డింగులు, అపార్ట్మెంట్ల అమమ్మకాలు కొనుగోలు జరుగుతుండటంతో వస్తుందని డిప్యూటీ సీఎంకు జాయింట్-1 వివరించారు. ఇదే సమయంలో దళారులపై ప్రమేయంపై కేఈ ఆరా తీశారు. వారి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లను చేపట్టాలని, వారిని దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఓ కంటింజెంట్ ఉద్యోగి తనకు రెండు నెలలుగా వేతనం రాలేదని చెప్పగా వెంటనే సంబంధిత ఫైలును పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో భద్రతా సిబ్బంది ఎవ్వరిని కార్యాలయాల్లోకి అనుమతించలేదు. అయితే పోలీసులు అడ్డుకున్న వారంతా కార్యాలయ సిబ్బంది కావడం కొసమెరుపు. -
ఏందీ మూకుమ్మడి సెలవులు?
⇒ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై సీఎం కేసీఆర్ ఫైర్ ⇒ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి ⇒ ఆర్ఎంవో, సూపరింటెండెంట్ లేకపోవడంతో ఆగ్రహం ⇒ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘సీనియర్ వైద్యులంతా ఒకేసారి సెలవులో వెళితే ఎలా..? అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం ఎవరు చేస్తారు..?’.. అంటూ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి వైద్యులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడాన్ని గమనించిన ఆయన.. ఇలాగైతే రోగులు ఎలా కోలుకుంటారని మండిపడ్డారు. శనివారం ఉదయం 11.30 సమయంలో సీఎం కేసీఆర్ ఫీవర్ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలతో పాటు ఉండాల్సిన 20 మంది వైద్యుల్లో పది మంది కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ఒక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారని, ఆర్ఎంవో సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో.. సీఎం నిర్ఘాంతపోయారు. సీనియర్ వైద్యులంతా శనివారం, ఆదివారం రాగానే సాకులు చెబుతూ ఒకేసారి సెలవు పెడితే... అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స ఎవరు చేస్తారని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందక రోగులెవరైనా మృత్యువాత పడితే బాధ్యత ఎవరిదంటూ నిలదీశారు. ఈ తనిఖీల సందర్భంగా సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల తదితరులు ఉన్నారు. చర్యలు చేపడతాం..: డీఎంఈ శ్రీనివాస్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వైద్యులు, ఇతర సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య విద్యా డెరైక్టర్ (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఉదయం ఫీవర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వెళ్లిన అనంతరం మధ్యాహ్నం సమయంలో ఫీవర్ ఆస్పత్రికి డీఎంఈ చేరుకున్నారు. విధులకు హాజరై కూడా బయటకు వెళ్లిన సిబ్బంది ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. పరిశుభ్రత ఏది..? ఆస్పత్రి ఆవరణలో భారీగా చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన సీఎం.. ఇలాగైతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఎలా కోలుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఉన్న ఇళ్లలోంచి జనం చెత్త వేస్తున్నారని సిబ్బంది చెప్పగా.. అలా వేసేవారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో ఈస్ట్‌జోన్ పోలీసులతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చెత్తాచెదారాన్ని తొలగించాల్సిందిగా అక్కడే ఉన్న డీసీపీ రవీందర్‌కు సూచించారు. అవసరమైనే తాను కూడా తట్టపట్టి చెత్త ఎత్తుతానని సీఎం పేర్కొన్నారు. అనంతరం ఫైలేరియా, స్వైన్‌ఫ్లూ వార్డులను సీఎం పరిశీలించారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాత భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం... రోగుల కోసం ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మిస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సు పోస్టులన భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కోరగా... పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
‘సంక్షేమం’పై ఏసీబీ నజర్
►హాస్టళలో ఆకస్మిక తనిఖీలు ►వార్డెన్ల చేతివాటం వెలుగులోకి.. ►విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు ►తాజాగా జడ్చర్లలో ఏసీబీ దాడులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు వార్డెన్ల చేతివాటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతుండడంతో వార్డెన్లు బోగస్ లెక్కలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు వార్డెన్ల పనితీరుపై ఫిర్యాదులు అందడంతో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) హాస్టళ్లలో అవినీతిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలో 200కు పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 30వేలకు పైగా విద్యార్థులకు వసతి కల్పించాల్సి ఉండగా, 33వేలకు పైగా విద్యార్థులు ఉన్నట్లు ఆయాశాఖల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంజూరైన విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మంది హాస్టళ్లలో వసతి పొందుతున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. విద్యార్థుల వాస్తవ సంఖ్య 22వేలకు మించి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 102 ఎస్సీ హాస్టళ్లు ఉండగా 10,200 మంజూరైన సీట్లకు గాను 13,900 విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. 62 బీసీ హాస్టళ్లలో 9993 సీట్లకు 9600, 37 ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో 9984 సీట్లకు 9922 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో విద్యార్థికి ప్రతినెలా 15 కిలోల బియ్యాన్ని కిలోకు రూపాయి చొప్పున పౌర సరఫరాలశాఖ సరఫరా చేస్తోంది. వీటితో పాటు నూనెలు, పప్పులు, కూరగాయలు కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడం ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను వార్డెన్లు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థుల పేర బోగస్ రికార్డులు సృష్టించి హాజరు నమోదు చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోమారు లెక్కలు సరిచూసుకుని మరీ అందుకు అనుగుణంగా హాజరు, స్టాక్ రిజిస్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. వార్డెన్లుగా చేతివాటం చూపొచ్చనే ఉద్ధేశంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం పట్టుబట్టి మరీ హాస్టల్ విధుల్లో చేరుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యహారం నడుస్తోన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ సంక్షేమాధికారి ప్రతి హాస్టల్‌కు ప్రతినెలా టార్గెట్ విధించి మరీ వార్డెన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మామూళ్లు అందుతుండడం వల్లే హాస్టళ్ల పనితీరు, నిర్వహణ, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై అధికారుల మొక్కుబడిగా తయారైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టి సారించడంతో ఆయా సంక్షేమ శాఖల్లో కలవరం కనిపిస్తోంది. జడ్చర్ల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో వార్డెన్లు రికార్డులను దులిపి ఆఘమేఘాల మీద వివరాలు నమోదు చేసే పనిలో పడ్డారు. విషయాలు వెలుగులోకి.. తాజాగా జడ్చర్ల ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్‌ను అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజతో పాటు సీఐలు తిరుపతిరాజు, గోవిందరెడ్డి తనిఖీల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసిన తనిఖీల్లో వార్డెన్ చేతివాటం వ్యవహారం వెలుగుచూసింది. హాస్టల్లో మంజూరైన విద్యార్థుల సంఖ్య 370 కాగా, వాస్తవంగా 203 మంది మాత్రమే ఉన్నారు. కానీ వార్డెన్ మాత్రం ప్రతిరోజూ 330 నుంచి 340 వరకు విద్యార్థులు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నాడు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకుల వినియోగంలో కాకిలెక్కలు చూపుతున్నాడు. హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా రేషన్ వినియోగానికి సంబంధించిన లెక్కలు నమోదు చేయడం లేదు. ప్రాథమిక నివేదిక సమర్పించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో తుది నివేదిక సంబంధిత అధికారులకు అందిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ ‘సాక్షి’కి వెల్లడించారు. -
సుపరిపాలనకే ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలలో ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోను. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించను. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యక్రమాలను సజావుగా అందేలా చూస్తూ, జిల్లా ప్రజలకు సుపరిపాలనను అందించడమే నా తొలి ప్రాధాన్యత.’ అని జిల్లా కొత్త కలెక్టర్ డాక్టర్. కె.ఇలంబరితి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తర్వాత గురువారం తొలిసారి ఖమ్మం వచ్చిన ఇలంబరితి స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, టైమ్‌కు కార్యాలయానికి రాకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని, ఎప్పటికప్పుడు ఫైళ్ల కదలికలను పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిల్లా పాలనను గాడిలో పెడతానని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులు ఎం తటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించా రు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని, వైద్య, విద్య సౌకర్యాల కల్పనతో పాటు వచ్చే ఏడాది పుష్కరాల నిర్వహణను కూడా ప్రాధాన్యతలుగా తీసుకుంటానని వివ రిం చారు. జిల్లాపై అవగాహన ఏర్పరుచుకుని ముందుకెళతానని, అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఉదయం 5:30కు ముహూర్తం.. జిల్లా కలెక్టర్‌గా ఇలంబర్తి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. వాస్తవానికి గురువారమే బాధ్యతలు తీసుకునేందుకు ఆయన జిల్లాకు వచ్చినా ఆలస్యం కారణంగా బాధ్యతలు తీసుకోలేకపోయారని అధికారవర్గాలు చెప్పారు. మధ్యాహ్నమే జిల్లాకు వస్తారని భావించినా, కలెక్టర్ వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. నేరుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ స్వాగతం అందుకున్నారు. అనంతరం ఆయనతో కొంతసేపు ముచ్చటించి ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా జాయింట్‌కలెక్టర్ సురేంద్రమోహన్, ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లా ప్రముఖులు, ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన హైదరాబాద్ వెళతారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ‘మన ఊరు - మన ప్రణాళిక’ సమావేశంలో జేసీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా
అవినీతి ఆరోపణలపై మంత్రి ఉమా ఆగ్రహం ఆలయ అధికారులపై ప్రశ్నల వర్షం వారంలో సమాధానాలు చెప్పాలని ఆదేశం విజయవాడ : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం(దుర్గగుడి)లో కొంత కాలంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆలయ అధికారులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఉమా బుధవారం ఆలయానికి వచ్చారు. తొలుత అమ్మవారి సన్నిధికి చేరుకున్న మంత్రి ఉమా, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ఆలయ ఈవో త్రినాథరావు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలి కారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాలను అందజేసి, సత్కరించారు. అన్నసంతర్పణ ప్రారంభం అన్నదాన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండో విభాగంలో అమ్మవారి చిత్రపటానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పూజలుచేశారు. అనంతరం భక్తులకు వారు అన్నప్రసాదాన్ని అందచేశారు. అనంతరం భక్తులను పలుకరిం చారు. అన్నప్రసాదాన్ని శుచిగా, శుభ్రంగా వండేలా చూడాలని ఆలయ ఈవో త్రినాథరావు, అన్నదాన విభాగం అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాంపిళ్ల శ్రీను, దేవస్థాన ఏఈవోలు సాయిబాబు, లక్ష్మీకాంతం, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, డీఈ రమా, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఉమా సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీఐపీ లాంజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు. పలు అంశాలపై మీడియా ద్వారా అధికారులను ప్రశ్నలు అడుగుతున్నానని పేర్కొన్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో ఆలయ అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. దుకాణాల్లో పూజాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని, ఫుట్‌బ్రిడ్జి, ఆలయ ప్రాగణంలో సుమారు 117 మంది హాకర్లు ఉండగా, వారిలో 90 మంది ఆలయ ఉద్యోగుల బంధవులేనని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు. చైనా వాల్ నిర్మాణ సమయంలో ధ్వంసమైన కార్పొరేషన్ వాటర్ పైపులైన్ పునరుద్ధరణకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఎంబుక్‌లో నమోదు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మహామండపం, రాజగోపురం పనుల్లో అలసత్వం. శానిటేషన్, టికెట్ల రీసైక్లింగ్, దసరా, భవానీ దీక్షల సమయంలో దుబారాపై వారం రోజుల్లో తనతో పాటు దేవాదాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
దీనికి మందు లేదా..
- అక్రమాలకు నిలువెత్తు అడ్డాగా కేజీహెచ్ - రోగుల పేరుతో నిధుల దోపిడి - వైద్య పరికరాలు, మందులు దారిమళ్లింపు - రోగులకు ఆహారంలోనూ అవినీతి - రూ.3కోట్లకుపైగా దుర్వినియోగమని ఏసీబీ అంచనా! సాక్షి,విశాఖపట్నం : కేజీహెచ్‌లో ఇప్పటికే అనేకసార్లు ఏసీబీ దాడులు నిర్వహించింది. మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరిగెత్తుతున్నాయి. . ముఖ్యంగా ఖరీదైన వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రికార్డుల్లో మాత్రం సవ్యంగానే ఉన్నా పరికరాలు కనిపించడం లేదు. కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు తమ క్లినిక్కులకుతరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి విధులపై వచ్చి కొందరు పరికరాలు కూడా తీసుకుపోతున్నట్లు ఏసీబీ పసిగట్టింది. 1045 పడకల ఆస్పత్రిలో సుమారుగా వెయ్యి మంది రోగులు ఇన్పెషెంట్లుగా ఉంటున్నారు. వీరికిచ్చే ఆహారం పేరుతోనూ భారీగా నిధులు బొక్కేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోనే రూ.12 లక్షల వరకు దారిమళ్లినట్లు సమాచారం. గైనిక్ వార్డులో మరీనూ. ఎవరికైనా మగబిడ్డ పుడితే రూ.1500, ఆడపిల్లకైతే రూ. 1000 ఇవ్వాల్సిందే. రోగులను క్యాజు వాల్టీ నుంచి వార్డుకు తరలించడానికి రూ. 500 సమ ర్పిం చుకోవాల్సిందే. లేదం టే బెడ్ దక్కదు. కీలకమైన మెడికల్ సర్టిఫికేట్ల జారీకి కొందరు మినిస్టీరిచల్ సిబ్బంది రూ. 5000కు పైగా పుచ్చుకుంటున్నారు. ఎక్స్‌రే, రేడియాలజీ విభాగాల్లో వైద్య పరీక్షలకు నేరుగా కాసులు ఇచ్చుకోవాల్సిందే. పెద్దాసుపత్రిమందుల కొరత లేకుండా వైద్యశాఖ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే ఇక్కడ కొందరు సిబ్బందికి వరంగా మారుతోంది. స్టోర్‌రూంలో ఉండాల్సిన ఈ మందులు కొందరు పెద్దల ప్రమేయంతో నేరుగా వారిసొంత క్లినిక్కులకు దారిమళ్లిపోతోంది. రికార్డుల్లో మాత్రం రోగులకు వినియోగించినట్లుగా నమోదుచేస్తున్నారు. కాటన్ కొనుగోలుకు లక్షల్లో వినియోగిస్తుంటే చాలామంది రోగులకు అసలు దీన్ని చేతికి ఇవ్వడం గగనమవుతోంది. ఆపరేషన్ థియేటర్లు, ముఖ్యు ల ఛాంబర్లకు ఏసీలు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాని వీటి జాడే ఉండడంలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ గుర్తించి రికార్డులు తనిఖీ చేస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క ఆస్పత్రిలో 60మంది ప్రైవేటు భద్రత సిబ్బంది పనిచేస్తున్నారు. కాని 100నుంచి 150మంది పనిచేస్తున్నట్లు రికార్డు ల్లో చూపి కొందరు ఈ నిధులను భారీగా బొక్కేస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో అవినీతికి అడ్డేలేకుండా పోయిందని ఏసీబీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి కనీసం లెక్కలు లేకపోవడం అవినీతికి మచ్చుతునకగా కనిపిస్తోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారుగా 40 మంది ఏసీబీ సిబ్బంది బుధవారం కూడా తనిఖీలు కొనసాగించనున్నారు. రూ. 3కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు అనధికారికంగా తెలిసింది. -
ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..
ఆదిలాబాద్ రిమ్స్ : ‘ఆదపలో ఉన్నవారి నుంచి డబ్బులు తీసుకుంటారా..? అవసరం వారిదికదా అని ఎంతైనా అడుగతారా..? ఒకవేళ నేను రిమ్స్‌కు వచ్చినా డబ్బులు అడుగుతారేమో..?’ ఇవి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబు రిమ్స్ సిబ్బందిని ఉద్దేశించి అన్న మాటలు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో శనివారం కలెక్టర్ అహ్మద్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 11.45 గంటలకు రిమ్స్‌కు వచ్చిన కలెక్టర్ 2.45 గంటల వరకు అంటే 3 గంటలపాటు అన్ని వార్డులనూ అణువణువు పరిశీలించారు. సంవత్సరం క్రితం కలెక్టర్ రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు మెటర్నిటీ (ప్రసూతి) వార్డులోని సిబ్బంది పాప, బాబు పుట్టిన వెంటనే డబ్బులు వసూలు చేస్తున్నారని కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులోకి వెళ్లగానే బాధితుల నుంచి మళ్లీ అదే ఫిర్యాదు వచ్చింది. నేరడిగొండ మండలం తర్నం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన కోడలును ప్రసూతి కోసం రిమ్స్‌కు తీసుకొస్తే అక్కడి సిబ్బంది తనను డబ్బులు అడిగారని, అన్ని రూ.2 వేల వరకు ఇచ్చానని కలెక్టర్‌కు విన్నవించింది. దీంతో ఆ విభాగం అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధలో ఉండి ఆస్పత్రికి వస్తే ఇలా డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్న వారిని గుర్తించి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఆదేశించారు. ముందుగా చిల్డ్రన్స్వార్డును పరిశీలించారు. ఇటీవల ఆ వార్డులో వైద్యం అందక ఓ బాబు చనిపోయిన సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. పిల్లలకు సమయానికి వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు విధులు నిర్వర్తించాలని సూచించారు. అపరిశుభ్రత, అసౌకర్యాలపై ఆగ్రహం.. ఆస్పత్రిలోని మెడికల్‌వార్డు, సర్జరీ వార్డు, ల్యాబ్‌ల్లోని అపరిశుభ్రతపై కలెక్టర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లోని మరుగుదొడ్లను ప్రత్యేకంగా పరిశీలించారు. మరుగుదొడ్లలో విపరీతమైన కంపు రావడంతో డెరైక్టర్, పారిశుధ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ రిమ్స్‌కు వచ్చినప్పుడు ఇదేసమస్య ఎందుకు ఎదురవుతోందని, ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితి మార్చుకోకపోవడం సరైంది కాదని అధికారులను హెచ్చరించారు. మరుగుదొడ్లలో వెంటనే నీటి సరఫరా కల్పించి, మరమ్మతు చేయించాలని ఆదేశించారు. రక్త పరీక్ష కేంద్రంలోని సిబ్బంది రక్త పరీక్షల అనంతరం సిరంజీలను బయపడేయడంపై కలెక్టర్ తీవ్రంగా మండిపడ్డారు. ల్యాబ్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ నిత్యం ఇలాంటి వాటిని పరిశీలించి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆస్పత్రిలో పనిచేయని లిఫ్ట్‌లను వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గదులకు తాళం వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిపోయిన పడకలు, మూలన పడేసిన పడకలను గమనించిన కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు. అసలే పడకల కొరత ఉందని చెబుతూనే ఇలా మూలనపడేయడమేంటని ప్రశ్నించారు. సెక్యూరిటీ సొసైటీని తప్పిస్తాం.. ఆస్పత్రిలోని మరుగుదొడ్లలో పగిలిపోయి సింకులు, పైప్లైన్లు లేకపోవడంపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు. రిమ్స్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు, ఇతర వార్డుల్లోని రూ.25 లక్షల పరికరాలు అపహరించారని కలెక్టర్ దృష్టికి సంబంధిత అధికారులు తీసుకెళ్లారు. దీంతో భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సెక్యురిటీ గార్డులే బాద్యత వహించాలని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరుగుతుంటే సెక్యూరిటీ గార్డులు ఉండే లాభమని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే సెక్యురిటీ సోసైటీని ఎత్తివేస్తామని హెచ్చరించారు. పరికాలు అపహరణకు గురైనట్లు తెలిస్తే సిబ్బంది వేతనాల్లో కోత విధించాల్సి ఉంటుందని సూచించారు. ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి.. రిమ్స్‌లో విధులు నిర్వర్తించే వైద్యులు ఆంధ్ర-మహారాష్ట్ర- తెలంగాణ అంటూ విభేదాలు లే కుండా పనిచేయాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అ న్నారు. రిమ్స్ పరిశీలన అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది వైద్యులు ప్రాంతీయ భేదాలతో పనిచేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు ప్రాంత విభేదాలు పక్కనపెట్టి పనితీరు మార్చుకోవాలని సూచించారు. వైద్యం అందడం లేదని పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నడుపరాదని సూచించారు. రిమ్స్‌లో 65 శాతం వైద్యుల కొరత ఉందని, వాటిని వెంటనే భర్తీ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. -
కేజీఎస్‌ను తనిఖీ చేసిన ఇన్చార్జ్ డీఎం హెచ్ఓ
చేగుంట : మండల కేంద్రంలోని కేజీఎస్ ఆస్పత్రిని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి పద్మ బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. గతంలో కేజీఎస్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో ఆస్పత్రి స్కానింగ్ సెంటర్, ఆపరేషన్ థియేటర్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు సీజ్ చేసిన గదుల పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం, రోగులకు సేవలందించే నర్సులు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. క నీసం ఓపీలు కూడా చూసేవారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి వాటిలో లోపాలు గుర్తించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జోగిపేటలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రి, వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పద్మ తెలిపారు. ఆమె వెంట వసంత్‌రావ్ ఉన్నారు.