‘సంక్షేమం’పై ఏసీబీ నజర్ | acb focus on the welfare | Sakshi
Sakshi News home page

‘సంక్షేమం’పై ఏసీబీ నజర్

Published Sat, Aug 16 2014 2:39 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

‘సంక్షేమం’పై ఏసీబీ నజర్ - Sakshi

‘సంక్షేమం’పై ఏసీబీ నజర్

హాస్టళలో ఆకస్మిక తనిఖీలు
వార్డెన్ల చేతివాటం వెలుగులోకి..
విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు
తాజాగా జడ్చర్లలో ఏసీబీ దాడులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు వార్డెన్ల చేతివాటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతుండడంతో వార్డెన్లు బోగస్ లెక్కలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు వార్డెన్ల పనితీరుపై ఫిర్యాదులు అందడంతో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) హాస్టళ్లలో అవినీతిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు సమాచారం.

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలో 200కు పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 30వేలకు పైగా విద్యార్థులకు వసతి కల్పించాల్సి ఉండగా, 33వేలకు పైగా విద్యార్థులు ఉన్నట్లు ఆయాశాఖల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంజూరైన విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మంది హాస్టళ్లలో వసతి పొందుతున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. విద్యార్థుల వాస్తవ సంఖ్య 22వేలకు మించి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
జిల్లాలో 102 ఎస్సీ హాస్టళ్లు ఉండగా 10,200 మంజూరైన సీట్లకు గాను 13,900 విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. 62 బీసీ హాస్టళ్లలో 9993 సీట్లకు 9600, 37 ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో 9984 సీట్లకు 9922 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో విద్యార్థికి ప్రతినెలా 15 కిలోల బియ్యాన్ని కిలోకు రూపాయి చొప్పున పౌర సరఫరాలశాఖ సరఫరా చేస్తోంది. వీటితో పాటు నూనెలు, పప్పులు, కూరగాయలు కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు.

అయితే విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడం ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను వార్డెన్లు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థుల పేర బోగస్ రికార్డులు సృష్టించి హాజరు నమోదు చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోమారు లెక్కలు సరిచూసుకుని మరీ అందుకు అనుగుణంగా హాజరు, స్టాక్ రిజిస్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. వార్డెన్లుగా చేతివాటం చూపొచ్చనే ఉద్ధేశంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం పట్టుబట్టి మరీ హాస్టల్ విధుల్లో చేరుతున్నారు.
 
తిలాపాపం తలా పిడికెడు
ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యహారం నడుస్తోన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ సంక్షేమాధికారి ప్రతి హాస్టల్‌కు ప్రతినెలా టార్గెట్ విధించి మరీ వార్డెన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మామూళ్లు అందుతుండడం వల్లే హాస్టళ్ల పనితీరు, నిర్వహణ, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై అధికారుల మొక్కుబడిగా తయారైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టి సారించడంతో ఆయా సంక్షేమ శాఖల్లో కలవరం కనిపిస్తోంది. జడ్చర్ల ఎస్టీ హాస్టల్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో వార్డెన్లు రికార్డులను దులిపి ఆఘమేఘాల మీద వివరాలు నమోదు చేసే పనిలో పడ్డారు.
 
విషయాలు వెలుగులోకి..
తాజాగా జడ్చర్ల ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్‌ను అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజతో పాటు సీఐలు తిరుపతిరాజు, గోవిందరెడ్డి తనిఖీల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసిన తనిఖీల్లో వార్డెన్ చేతివాటం వ్యవహారం వెలుగుచూసింది. హాస్టల్‌లో మంజూరైన విద్యార్థుల సంఖ్య 370 కాగా, వాస్తవంగా 203 మంది మాత్రమే ఉన్నారు. కానీ వార్డెన్ మాత్రం ప్రతిరోజూ 330 నుంచి 340 వరకు విద్యార్థులు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నాడు.

విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకుల వినియోగంలో కాకిలెక్కలు చూపుతున్నాడు. హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా రేషన్ వినియోగానికి సంబంధించిన లెక్కలు నమోదు చేయడం లేదు. ప్రాథమిక నివేదిక సమర్పించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో తుది నివేదిక సంబంధిత అధికారులకు అందిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ ‘సాక్షి’కి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement