Government welfare hostels
-
Andhra Pradesh: రోజూ ప్రత్యేక మెనూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రతి రోజు ప్రత్యేక మెనూ అమలు చేయడంతో పాటు టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో రెండు దశల్లో, గురుకుల పాఠశాలల్లో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో పూర్తి చేయాలని చెప్పారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గురుకులాల విద్య (అకడమిక్) వ్యవహారాల పర్యవేక్షణను పాఠశాల విద్య (స్కూల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి తేవాలని చెప్పారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న మండల విద్యా శాఖ అధికారు(ఎంఈఓ)లకే గురుకులాల అకడమిక్ బాధ్యతలు అప్పగించాలా.. లేక మరో విధంగా చేయాలా.. అనే విషయంపై పూర్తి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ‘మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఏ విధంగా పర్యవేక్షణను పటిష్టం చేస్తున్నామో.. గురుకులాల్లో కూడా అదే తరహాలోనే పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ), ప్రత్యేక యాప్ రూపొందించాలి. గురుకుల పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం ఒక్కో అధికారి ప్రత్యేక పరిధిని నిర్ణయించి సమగ్రంగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలి’ అని ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన భోజనం పెట్టాలి ► రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి పెట్టే భోజనం అత్యంత నాణ్యతగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలి. ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వండి. ► హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలి. విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో పారిశుధ్యం, పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీని లింక్ చేయడంపై కూడా శ్రద్ధ వహించాలి. హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ► వైద్యులు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలి. (ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు) విలేజ్ క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. హాస్టళ్ల నిర్వహణలో సిబ్బంది ఖాళీలను గుర్తించి, భర్తీ చేయాలి. వీటన్నింటిపై తగిన కార్యాచరణ సిద్ధం చేసి నాకు నివేదించాలి. నాడు–నేడు ప్రతిపాదనలు ఇలా ► రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు–నేడు కింద టాయిలెట్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు, సిబ్బందికి.. విద్యార్థులకు ఫరి్నచర్.. డెస్క్‌లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్ తదితరాలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ► కిచెన్ ఆధునికీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 55 ఇంచ్‌ల స్మార్ట్ టీవీతో పాటు క్రీడా సామగ్రి, లైబ్రరీ బుక్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పీడిక రాజన్న దొర, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గతి తప్పిన వసతి!
- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతిగృహ సంక్షేమాధికారి.. మరో మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉన్నారు. వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఆయన విధులకు వస్తుంటారు. దీంతో అక్కడి వార్డెన్ వచ్చిన రోజు మినహా మిగతా రోజుల్లో విద్యార్థులదే రాజ్యం. తరగతులకు హాజరు కాకుండా జులాయిగా తిరగడం అక్కడి విద్యార్థులకు అలవాటైపోయింది. - మేడ్చల్ జిల్లా ఉప్పల్ బీసీ బాలుర వసతిగృహంలోనూ ఇదే పరిస్థితి. వార్డెన్ చాలా అరుదుగా విధులకు హాజరవుతారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న విద్యార్థులు కేవలం భోజన సమయాల్లోనే హాస్టల్‌కు వస్తుంటారు. మరి మిగతా సమయమంతా ఎక్కడికెళ్తారనే మీ సందేహానికి సమాధానం దొరకదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతిగృహాల్లో పర్యవేక్షణ గతి తప్పింది. హాస్టళ్ల నిర్వహణలో కీలకమైన వ్యక్తి వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూవో). కానీ చాలాచోట్ల పూర్తిస్థాయి వార్డెన్లు లేకపోవడంతో.. ఆయా శాఖలు ఇన్‌చార్జీలతోనే వెళ్లదీస్తున్నాయి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,245 వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.84లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ వసతిగృహాలకు తగినంత సంఖ్యలో హెచ్‌డబ్ల్యూఓలు ఉండాలి. కానీ 1,218 వసతిగృహ సంక్షేమాధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 1,027 సంక్షేమ వసతిగృహాలు ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే శాఖల వారీగా హెచ్‌డబ్ల్యూవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వాటి భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇన్చార్జీల నియామకంతో సంక్షేమ శాఖలు చేతులు దులుపుకున్నప్పటికీ.. విద్యార్థులను పర్యవేక్షించడం గాడితప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. పైరవీల జోరు మూడేళ్లుగా వసతిగృహ సంక్షేమాధికారుల భర్తీ నిలిచిపోయింది. ఉన్న సీనియర్లు పదవీ విరమణ పొందుతుండటం, ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో.. ఖాళీలు ఏటేటా పెరిగిపోతున్నాయి. మరోవైపు.. ఈ ఖాళీల్లో ఇన్‌చార్జీగా బాధ్యతలు కావాలంటూ సంక్షేమ శాఖల్లో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్లో పోస్టింగ్ కోసం జిల్లా సంక్షేమాధికారులను సైతంప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల సంక్షేమాధికారులపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు సైతం రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. పెండింగ్‌లో ఏసీబీ కేసులు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతిగృహాల్లో రెండేళ్ల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులన్నీ పరిశీలించగా భారీ స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. హాస్టల్ రికార్డుల్లో విద్యార్థులకు, వసతి పొందుతున్న వారి సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో దాదాపు 42 మంది హెచ్డబ్ల్యూవోలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అవన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఇందులో ఇరవై మందికి తిరిగి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ వారి పదోన్నతులను మాత్రం నిలిపివేశారు. షాడోల పాలనలో సగానికిపైగా వసతిగృహాల్లో ఇన్చార్జీలను నియమించడంతో అక్కడ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పూర్తిస్థాయి హెచ్‌డబ్ల్యూలు లేనందున సమీపంలోని హెచ్‌డబ్ల్యూఓలకు ఇన్చార్జిగా బాధ్యత ఇచ్చారు. దీంతో రెగ్యులర్ హాస్టల్‌ను చూసుకుంటూనే ఆ ఉద్యోగి పక్క హాస్టల్‌కు ఇన్చార్జీ బాధ్యతలను నిర్వహిం చాలి. కానీ మెజారిటీ హాస్టళ్లలో ఇన్చార్జీలు కనీసం వారినికోసారైనా హాజరు కావడం లేదనే ఆరోపణలున్నాయి. చుట్టపుచూపుగా వచ్చి సంతకాలు చేయడం పరిపాటిగా మారింది. ఇన్చార్జీ రాకపోవడంతో హాస్టల్లో కిందిస్థాయి సిబ్బందిదే హవా. హాస్టల్ ఖర్చుల లెక్కలన్నీ వారి ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. హాస్టళ్లలోని విద్యార్థులు స్కూల్/కాలేజీకి హాజరవుతున్నారా? లేదా? అనేది పట్టించుకోవడం లేదు. కేవలం భోజన సమయానికి వస్తుండటం, తిరిగి బయటకు వెళ్లిపోవడం సర్వసాధారణమైంది. -
సంక్షేమంపై నిఘా నేత్రం
సాక్షి, అమరచింత: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు వార్డెన్లు, సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భా గంగానే జిల్లాలోని 18 ఎస్సీ హాస్టళ్ల పాటు నా లుగు కళాశాల విద్యార్థుల హాస్టళ్లలో సైతం సీసీ కె మెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో రోజువారి విద్యార్థుల దైనందిన పరిస్థితులను తె లుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న ప ద్ధతులను మానిటరింగ్ చేసే అవకాశం ఉండటంతో హాస్టల్ వార్డెన్లకు మరింత బాధ్యత పెరిగినట్లయింది. మానిటరింగ్‌కు పెద్దపీట జిల్లాలో 18 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో 2,100 మంది విద్యార్థులు సాగిస్తున్నారు. కళా శాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన నాలుగు హాస్టళ్లలో 500మంది విద్యార్థులు చదువుతున్నా రు. రోజువారీగా విద్యార్థుల హాజరుతో పాటు అ ల్పాహారం, రాత్రి భోజనం, ట్యూషన్ల పనితీరును తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించారు. అంతేకాకుండా నిత్యకృత్యాలు, ఆటాపాటలతో పాటు విద్యార్థు లు గొడవపడుతున్న తీరును నేరుగా తెలుసుకుని మానిటరింగ్ చేసేందుకు వార్డెన్లకు అవకాశం ఉంటుంది. హాస్టల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా అక్రమాలకు చెక్‌పడేనా? హాస్టళ్లలో రోజువారీగా విద్యార్థులు హాజరయ్యే సంఖ్యను బట్టి వారికి వండిపెట్టేందుకు బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వాటిని సరఫరా చేస్తారు. అయితే గతంలో ఈ సరుకులు సగం పక్కదారిపట్టేవి. విద్యార్థుల సంఖ్యను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడేవారు. ప్ర భుత్వం సరఫరా చేసిన ఆహారధాన్యాలు వసతి గృహాల నుంచి బయటికి వెళ్లకుండా వ్యవస్థ ద్వా రా కట్టుదిట్టమైంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసుకుని తూతూమంత్రంగా హాస్టళ్ల నిర్వహణను కొనసాగించిన పలువురు వార్డెన్లకు సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. వసతులు బాగున్నాయి.. అమరచింత ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతనెలలో హాస్టల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిబ్బంది పనితీరులో మార్పులు రావడంతో సకాలంలో ఆహారం అందిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ట్యూషన్లు, చదువులు కొనసాగుతున్నారు. – నాగరాజు, హాస్టల్ విద్యార్థి, రాంపూర్ ప్రహరీ లేక ఇబ్బందులు అమరచింత ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుకుంటున్నాను. గతేడాది బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీసీకెమెరాలను ఏర్పాటు చేయడం బాగుంది. రాత్రివేళ హాస్టల్లో విషపురుగులతో పాటు పశుసంచారం ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి ప్రహరీ ఏర్పాటుచేయాలి. – సాయికుమార్,హాస్టల్ విద్యార్థి, కిష్ణంపల్లి మానిటరింగ్ పెరిగింది.. హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా మానిటరింగ్ వ్యవస్థ తీరు మెరుగుపడింది. కార్యాలయం నుంచే టీవీలో సీసీకెమెరాల ద్వారా వస్తున్న దృశ్యాలను చూస్తూ విద్యార్థులను దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించగలుగుతున్నాం. – బెనర్జీ, హాస్టల్ వార్డెన్, అమరచింత సత్ఫలితాలు సాధించడానికి కోసమే.. సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో గతనెల సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. కలెక్టర్ ఆదేశాలతో 18 వసతిగృహాల్లో వాటిని బిగించాం. పదో తరగతి విద్యార్థుల ఫలితాలతో పాటు కళాశాల విద్యార్థుల ఫలితాలను పెంపొందించడానికి నిత్యసాధన చేయిస్తున్నాం. -జీపీ వెంకటస్వామి, ఏఎస్ఈడీఓ, వనపర్తి -
‘సంక్షేమం’పై ఏసీబీ నజర్
►హాస్టళలో ఆకస్మిక తనిఖీలు ►వార్డెన్ల చేతివాటం వెలుగులోకి.. ►విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు ►తాజాగా జడ్చర్లలో ఏసీబీ దాడులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు వార్డెన్ల చేతివాటానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతుండడంతో వార్డెన్లు బోగస్ లెక్కలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు వార్డెన్ల పనితీరుపై ఫిర్యాదులు అందడంతో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) హాస్టళ్లలో అవినీతిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలో 200కు పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 30వేలకు పైగా విద్యార్థులకు వసతి కల్పించాల్సి ఉండగా, 33వేలకు పైగా విద్యార్థులు ఉన్నట్లు ఆయాశాఖల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంజూరైన విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మంది హాస్టళ్లలో వసతి పొందుతున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. విద్యార్థుల వాస్తవ సంఖ్య 22వేలకు మించి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 102 ఎస్సీ హాస్టళ్లు ఉండగా 10,200 మంజూరైన సీట్లకు గాను 13,900 విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు వార్డెన్లు లెక్కలు చూపుతున్నారు. 62 బీసీ హాస్టళ్లలో 9993 సీట్లకు 9600, 37 ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో 9984 సీట్లకు 9922 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో విద్యార్థికి ప్రతినెలా 15 కిలోల బియ్యాన్ని కిలోకు రూపాయి చొప్పున పౌర సరఫరాలశాఖ సరఫరా చేస్తోంది. వీటితో పాటు నూనెలు, పప్పులు, కూరగాయలు కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడం ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను వార్డెన్లు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థుల పేర బోగస్ రికార్డులు సృష్టించి హాజరు నమోదు చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోమారు లెక్కలు సరిచూసుకుని మరీ అందుకు అనుగుణంగా హాజరు, స్టాక్ రిజిస్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. వార్డెన్లుగా చేతివాటం చూపొచ్చనే ఉద్ధేశంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిప్యూటేషన్ కోసం పట్టుబట్టి మరీ హాస్టల్ విధుల్లో చేరుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యహారం నడుస్తోన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ సంక్షేమాధికారి ప్రతి హాస్టల్‌కు ప్రతినెలా టార్గెట్ విధించి మరీ వార్డెన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మామూళ్లు అందుతుండడం వల్లే హాస్టళ్ల పనితీరు, నిర్వహణ, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై అధికారుల మొక్కుబడిగా తయారైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టి సారించడంతో ఆయా సంక్షేమ శాఖల్లో కలవరం కనిపిస్తోంది. జడ్చర్ల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో వార్డెన్లు రికార్డులను దులిపి ఆఘమేఘాల మీద వివరాలు నమోదు చేసే పనిలో పడ్డారు. విషయాలు వెలుగులోకి.. తాజాగా జడ్చర్ల ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్‌ను అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజతో పాటు సీఐలు తిరుపతిరాజు, గోవిందరెడ్డి తనిఖీల్లో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసిన తనిఖీల్లో వార్డెన్ చేతివాటం వ్యవహారం వెలుగుచూసింది. హాస్టల్లో మంజూరైన విద్యార్థుల సంఖ్య 370 కాగా, వాస్తవంగా 203 మంది మాత్రమే ఉన్నారు. కానీ వార్డెన్ మాత్రం ప్రతిరోజూ 330 నుంచి 340 వరకు విద్యార్థులు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నాడు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ రేషన్ సరుకుల వినియోగంలో కాకిలెక్కలు చూపుతున్నాడు. హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా రేషన్ వినియోగానికి సంబంధించిన లెక్కలు నమోదు చేయడం లేదు. ప్రాథమిక నివేదిక సమర్పించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో తుది నివేదిక సంబంధిత అధికారులకు అందిస్తామని ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ ‘సాక్షి’కి వెల్లడించారు. -
విద్యార్థులు కావలెను
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు, వసతుల లేమికి అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్ల లో ఏకంగా ఏడు వేల సీట్లు ఖాళీగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు సైతం అన్ని వసతులు ఉన్న కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడంతో సంక్షేమ హాస్టళ్లలో సంఖ్య తగ్గిపోతోంది. కనీసం 50 మంది విద్యార్థులైనా లేకపోతే పక్కనున్న హాస్టల్లో కలిపేస్తామన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో.. విద్యార్థులకోసం సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందూరు : ఒకప్పుడు సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థులకోసం హాస్టళ్ల అధికారులు తిరగాల్సి వస్తోంది. జిల్లాలో 67 ఎస్సీ, 13 ఎస్టీ, 60 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 12,500 సీట్లుండగా ఏడు వేల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 3,500, ఎస్టీ హాస్టళ్లలో 500, బీసీ వసతి గృహాల్లో 3 వేల సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల బాగోగులను, కనీస సౌకర్యాలను పట్టించుకోలేని సంక్షేమాధికారులు వైఖరే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేని సంక్షేమ హాస్టళ్ల కన్నా.. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకే తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. వార్డెన్లకు తిప్పలే! జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో భారీగా ఖాళీలు ఉండటంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రతి వసతి గృహంలో కనీసం 50 మంది విద్యార్థులైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. లేదంటే వేరే హాస్టల్లో కలిపేస్తామని హెచ్చరించారు. దీంతో వార్డెన్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి హాస్టల్లో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. అయితే తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, వారు మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలవైపే చూస్తున్నారని పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. ఇలాగైతే హాస్టళ్లను నింపడం సాధ్యం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్న చొరవ తీసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా వసతి గృహాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పేద మహిళ తమ పిల్లలను వసతిగృహంలో చేర్పించాలని గ్రామ సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేయించారు. తమ పిల్లలను చేర్పించడమే కాకుండా గ్రామంలోని ఇతర పిల్లలను చేర్పించేలా చూడాలని ఐకేపీ పీడీ ద్వారా మహిళా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు వారు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించాలని సూచిస్తున్నారు. ఇటు వార్డెన్లు.. అటు మహిళా సంఘాలు ప్రయత్నిస్తున్నా సంక్షేమవసతి గృహాల్లో పిల్లలను చేర్పించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వసతులు మెరుగు పరిచి, నాణ్యమైన భోజనం పెడితే తప్ప పరిస్థితి మెరుగు పడదని పలువురు మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మారని అధికారులు విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన సామగ్రి హాస్టళ్లను చేరలేదు. విద్యార్థులకు బెడ్షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు బాక్సులు, చెప్పులు, బ్యాగులు, పరుచుకునే చాపలు, యూనిఫాంలు, నోట్ బుక్కులు తదితర వస్తువులు అందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గతనెలలోనే టెండర్లు నిర్వహించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెలలో టెండర్లు వేశారు. దీంతో సామగ్రి హాస్టళ్లను చేరలేదు. దీంతో ప్రస్తుత విద్యార్థులు ఇంకో పదిహేను రోజుల వరకు పాత సామాన్లతో సర్దుకోవాల్సిందే. సీట్ల భర్తీకి చర్యలు జిల్లాలోని వసతి గృహాలలో ఖాళీగా ఉన్న సీట్లను అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాం. గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను చేర్చుకోవాలని వార్డెన్లను ఆదేశించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి