గతి తప్పిన వసతి! | Negligence in the Government Welfare Hostels Maintenance | Sakshi
Sakshi News home page

గతి తప్పిన వసతి!

Published Tue, Jan 29 2019 2:30 AM | Last Updated on Tue, Jan 29 2019 2:30 AM

Negligence in the Government Welfare Hostels Maintenance - Sakshi

- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతిగృహ సంక్షేమాధికారి.. మరో మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జిగా బాధ్యతల్లో ఉన్నారు. వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఆయన విధులకు వస్తుంటారు. దీంతో అక్కడి వార్డెన్‌ వచ్చిన రోజు మినహా మిగతా రోజుల్లో విద్యార్థులదే రాజ్యం. తరగతులకు హాజరు కాకుండా జులాయిగా తిరగడం అక్కడి విద్యార్థులకు అలవాటైపోయింది. 
 
- మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ బీసీ బాలుర వసతిగృహంలోనూ ఇదే పరిస్థితి. వార్డెన్‌ చాలా అరుదుగా విధులకు హాజరవుతారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న విద్యార్థులు కేవలం భోజన సమయాల్లోనే హాస్టల్‌కు వస్తుంటారు. మరి మిగతా సమయమంతా ఎక్కడికెళ్తారనే మీ సందేహానికి సమాధానం దొరకదు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతిగృహాల్లో పర్యవేక్షణ గతి తప్పింది. హాస్టళ్ల నిర్వహణలో కీలకమైన వ్యక్తి వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూవో). కానీ చాలాచోట్ల పూర్తిస్థాయి వార్డెన్లు లేకపోవడంతో.. ఆయా శాఖలు ఇన్‌చార్జీలతోనే వెళ్లదీస్తున్నాయి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,245 వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.84లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ వసతిగృహాలకు తగినంత సంఖ్యలో హెచ్‌డబ్ల్యూఓలు ఉండాలి. కానీ 1,218 వసతిగృహ సంక్షేమాధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 1,027 సంక్షేమ వసతిగృహాలు ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే శాఖల వారీగా హెచ్‌డబ్ల్యూవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వాటి భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇన్‌చార్జీల నియామకంతో సంక్షేమ శాఖలు చేతులు దులుపుకున్నప్పటికీ.. విద్యార్థులను పర్యవేక్షించడం గాడితప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది.  

పైరవీల జోరు 
మూడేళ్లుగా వసతిగృహ సంక్షేమాధికారుల భర్తీ నిలిచిపోయింది. ఉన్న సీనియర్లు పదవీ విరమణ పొందుతుండటం, ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో.. ఖాళీలు ఏటేటా పెరిగిపోతున్నాయి. మరోవైపు.. ఈ ఖాళీల్లో ఇన్‌చార్జీగా బాధ్యతలు కావాలంటూ సంక్షేమ శాఖల్లో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్‌లో పోస్టింగ్‌ కోసం జిల్లా సంక్షేమాధికారులను సైతంప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, మెదక్‌ జిల్లాల సంక్షేమాధికారులపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు సైతం రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. 

పెండింగ్‌లో ఏసీబీ కేసులు 
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతిగృహాల్లో రెండేళ్ల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులన్నీ పరిశీలించగా భారీ స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. హాస్టల్‌ రికార్డుల్లో విద్యార్థులకు, వసతి పొందుతున్న వారి సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో దాదాపు 42 మంది హెచ్‌డబ్ల్యూవోలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అవన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఇందులో ఇరవై మందికి తిరిగి పోస్టింగ్‌ ఇచ్చినప్పటికీ వారి పదోన్నతులను మాత్రం నిలిపివేశారు. 

షాడోల పాలనలో
సగానికిపైగా వసతిగృహాల్లో ఇన్‌చార్జీలను నియమించడంతో అక్కడ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పూర్తిస్థాయి హెచ్‌డబ్ల్యూలు లేనందున సమీపంలోని హెచ్‌డబ్ల్యూఓలకు ఇన్‌చార్జిగా బాధ్యత ఇచ్చారు. దీంతో రెగ్యులర్‌ హాస్టల్‌ను చూసుకుంటూనే ఆ ఉద్యోగి పక్క హాస్టల్‌కు ఇన్‌చార్జీ బాధ్యతలను నిర్వహిం చాలి. కానీ మెజారిటీ హాస్టళ్లలో ఇన్‌చార్జీలు కనీసం వారినికోసారైనా హాజరు కావడం లేదనే ఆరోపణలున్నాయి. చుట్టపుచూపుగా వచ్చి సంతకాలు చేయడం పరిపాటిగా మారింది. ఇన్‌చార్జీ రాకపోవడంతో హాస్టల్‌లో కిందిస్థాయి సిబ్బందిదే హవా. హాస్టల్‌ ఖర్చుల లెక్కలన్నీ వారి ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. హాస్టళ్లలోని విద్యార్థులు స్కూల్‌/కాలేజీకి హాజరవుతున్నారా? లేదా? అనేది పట్టించుకోవడం లేదు. కేవలం భోజన సమయానికి వస్తుండటం, తిరిగి బయటకు వెళ్లిపోవడం సర్వసాధారణమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement