విద్యార్థులు కావలెను | There are empty seats in | Sakshi
Sakshi News home page

విద్యార్థులు కావలెను

Published Sat, Jun 14 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

విద్యార్థులు కావలెను

విద్యార్థులు కావలెను

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు, వసతుల లేమికి అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్ల లో ఏకంగా ఏడు వేల సీట్లు ఖాళీగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు సైతం అన్ని వసతులు ఉన్న కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడంతో సంక్షేమ హాస్టళ్లలో సంఖ్య తగ్గిపోతోంది. కనీసం 50 మంది విద్యార్థులైనా లేకపోతే పక్కనున్న హాస్టల్‌లో కలిపేస్తామన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో.. విద్యార్థులకోసం సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు.
 
 ఇందూరు : ఒకప్పుడు సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థులకోసం హాస్టళ్ల అధికారులు తిరగాల్సి వస్తోంది. జిల్లాలో 67 ఎస్సీ, 13 ఎస్టీ, 60 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 12,500 సీట్లుండగా ఏడు వేల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 3,500, ఎస్టీ హాస్టళ్లలో 500, బీసీ వసతి గృహాల్లో 3 వేల సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యార్థుల బాగోగులను, కనీస సౌకర్యాలను పట్టించుకోలేని సంక్షేమాధికారులు వైఖరే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేని సంక్షేమ హాస్టళ్ల కన్నా.. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకే తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి.
 
వార్డెన్లకు తిప్పలే!
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో భారీగా ఖాళీలు ఉండటంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రతి వసతి గృహంలో కనీసం 50 మంది విద్యార్థులైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్‌లకు సూచించారు. లేదంటే వేరే హాస్టల్‌లో కలిపేస్తామని హెచ్చరించారు. దీంతో వార్డెన్‌లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి హాస్టల్‌లో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. అయితే తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, వారు మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలవైపే చూస్తున్నారని పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. ఇలాగైతే హాస్టళ్లను నింపడం సాధ్యం కాదంటున్నారు.
 
ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్న చొరవ తీసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా వసతి గృహాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పేద మహిళ తమ పిల్లలను వసతిగృహంలో చేర్పించాలని గ్రామ సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేయించారు. తమ పిల్లలను చేర్పించడమే కాకుండా గ్రామంలోని ఇతర పిల్లలను చేర్పించేలా చూడాలని ఐకేపీ పీడీ ద్వారా మహిళా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు వారు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించాలని సూచిస్తున్నారు. ఇటు వార్డెన్‌లు.. అటు మహిళా సంఘాలు ప్రయత్నిస్తున్నా సంక్షేమవసతి గృహాల్లో పిల్లలను చేర్పించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వసతులు మెరుగు పరిచి, నాణ్యమైన భోజనం పెడితే తప్ప పరిస్థితి మెరుగు పడదని పలువురు మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు.
 
మారని అధికారులు
విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన సామగ్రి హాస్టళ్లను చేరలేదు. విద్యార్థులకు బెడ్‌షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు బాక్సులు, చెప్పులు, బ్యాగులు, పరుచుకునే చాపలు, యూనిఫాంలు, నోట్ బుక్కులు తదితర వస్తువులు అందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గతనెలలోనే టెండర్లు నిర్వహించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెలలో టెండర్లు వేశారు. దీంతో సామగ్రి హాస్టళ్లను చేరలేదు. దీంతో ప్రస్తుత విద్యార్థులు ఇంకో పదిహేను రోజుల వరకు పాత సామాన్లతో సర్దుకోవాల్సిందే.
 
సీట్ల భర్తీకి చర్యలు
జిల్లాలోని వసతి గృహాలలో ఖాళీగా ఉన్న సీట్లను అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాం. గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను చేర్చుకోవాలని వార్డెన్‌లను ఆదేశించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. 
-విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement