The number of students
-
స్కూళ్లకు కత్తెర
- జిల్లాలో 743పాఠశాలల రద్దు - రేషనలైజేషన్ పేరుతో వేటు - దూరాభారమైనా మరో స్కూలుకు వెళ్లాల్సిందే - లేకుంటే ప్రయివేటు బాట తప్పదు - చాపకిందనీరుగా సర్కారు చర్యలు ప్రాథమిక విద్య పిల్లలకు భవిష్యత్‌కు తొలి అడుగు. దానిని మెల్లగా వారికి దూరం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. చదువు అవసరమైతే దూరమైనా వెళ్లాల్సిందేనంటోంది. లేదంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకోండంటూ పరోక్షంగా రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలల సంఖ్యను కుదించేందుకు సిద్ధమైంది. విశాఖ ఎడ్యుకేషన్: చాలా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధులు సంఖ్య తక్కువగాఉన్న పాఠశాలలను రద్దు చేసి వారిని సమీపంలో పాఠశాలకు తరలించం రేషనలైజేషన్ ప్రకియ. ఈ ప్రక్రియ ద్వారా పాఠశాలలను తగ్గించి అన్నింటిని సక్సెస్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాట. ఇప్పటికే ప్రభుత్వం రేషనలైజేషనుకు శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను రద్దుచేసేందుకు పావులు కదుపుతోంది. సుమారు 743 పాఠశాలలను ఇలా పక్క సూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను రహస్యంగా చేసుకుపోతోంది. రేషనలైజేషన్ ప్రకియపై తొలుత ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ద్వారా నిబంధనలను సిద్ధం చేయించింది. కమిటీ నిబంధనల ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 20లోపు, 6,7 తరగతుల వరకు ఉన్న యూపీ స్కూల్స్‌లో 35 లోపు, 6,7,8 తరగతుల్లో 50 లోపు విద్యార్ధులు ఉంటే వాటిని వేరే స్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు తయారు చేసింది. దీని ఆధారంగా విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించారు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. భాష పండితులపై నిర్లక్ష్యం.. ఓ వైపు రేషనలైజేషన్ ప్రకియలో తగ్గించుకుంటూ సక్సెస్ పాఠశాలల సంఖ్య పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరిట ప్రక్రియల భాషా పండితుల సంఖ్యను కుదిస్తోంది. ఇతర సంబ్జెక్టులకు 3 నుంచి 5 మంది ఉపాధ్యాయులను ఉంచుతూ ఎంత మంది విద్యార్ధులైనా భాషా పండితులను మాత్రం ఒక్కరినే ఉంచుతుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలు పెట్టి విద్యార్ధుల సంఖ్య పెరగడంతో భాషా పండితులు సంఖ్య అదనంగా అవసరమైన ఒక్కో సబ్జెక్టుకు ఒక్కరినే పరిమితం చేస్తుంది. ఫలితంగా ఉపాధ్యాయులు సామర్ధ్యానికి మించి తరగతులు బోధించాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. -
మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఏడాదికేడాది తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కోసం, వ్యాపారం కోసం ముంబైకి వచ్చి స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య ఏటా పెరుగుతున్న తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం తెలుగు భాషా ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో తెలుగు మీడియం పాఠశాలల సంఖ్య కూడా పడిపోతోంది. తెలుగు మీడియంలో చదివించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం మొదటి కారణమైతే మరోవైపు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్చాలనుకున్నా అందుబాటులో తెలుగు మీడియం పాఠశాలలు లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రస్తుతం తెలుగు మీడియం పాఠశాలలు ముంబైతోపాటు భివండీ, షోలాపూర్, చంద్రపూర్, నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా సరిపడా అధ్యాపకులు లేరు. ఏటికేటా ఈ విభాగానికి సంబంధించిన టీచర్లు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఈ కొరత నానాటికీ అధికమవుతోంది. వీరిని నియమించే విషయంలో సర్కారు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఈ సమస్య పరిష్కారమవడం లేదు. రాష్ట్రంలో తెలుగు బోధనకు సంబంధించి ప్రాథమిక విద్యస్థాయిలో ఈ కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు పిల్లలు తమ భాషను పూర్తిగా మరచిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. పదో తరగతిలో తెలుగును మొదటి భాషగా తీసుకున్నవారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఫస్ట్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 2012-13 విద్యా సంవత్సరంలో మొత్తం 924 మంది విద్యార్థులుండగా 2013-14లో వీరి సంఖ్య 788కి దిగజారింది. వీరిలో 780 మంది తెలుగు సబ్జెక్టులో పరీక్షలు రాయగా 699 మంది (89.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే 2012-13లో ముగ్గురు తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినప్పటికీ 2013-14 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా హిందీ-తెలుగు సబ్జెక్టులు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లుగా 356 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 347 (97.47 శాతం) మంది పాసయ్యారు. ఇక ముంబై డివిజన్‌ను పరిశీలిస్తే ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినవారి సంఖ్య గతంలో కంటే తగ్గింది. 2011-12లో 810 మంది పరీక్షలు రాయగా 2012-13లో 762 మంది పరీక్షలు రాశారు. అయితే 2013-14లో వారి సంఖ్య మరింత తగ్గి 649కి చేరింది. వీరిలో 576 (88.75 శాతం) మంది ఉత్తీర్థులయ్యారు. తల్లిదండ్రులూ ఆసక్తి చూపాలి.. తెలుగుభాష అభివృద్ధి విషయంలో వాస్తవానికి అధికారుల నుంచి ఉన్నంతలో ప్రోత్సాహం లభిస్తున్నా తల్లిదండ్రులే ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ ఇతర రాష్ట్రంలో నివసిస్తున్నందున తెలుగు భాష వల్ల కలిగే ప్రయోజనాలు పెద్దగా ఏమీ లేవన్న భావనతో తల్లిదండ్రులే మరో భాషపట్ల మక్కువచూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ములుండ్ బీఎంసీ పాఠశాల ఇన్చార్జి నాయిని ఆదినారాయణ మాట్లాడుతూ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ముంబైలో కేవలం తమ పాఠశాలలో మాత్రమే తెలుగుమీడియంలో పదో తరగతి వరకూ బోధన అందిస్తోందన్నారు. పాఠ్యపుస్తకాలన్నీ సకాలంలో అందజేస్తున్నామని, పిల్లలకు ఉపయుక్తమయ్యే బ్యాగు, పుస్తకాలు, రెయిన్ కోటు, షూ తదితర 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. బీఎంసీ స్కూల్లో ఉత్తమ ఫలితాలు.. ములుండ్‌లోని బీఎంసీ స్కూల్లో ఈ ఏడాది ఎస్సెస్సీలో మంచి ఫలితాలు సాధించినట్లు ఆదినారాయణ తెలిపారు. 29 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో ఎస్.రామకృష్ణ (87.20 శాతం) సీహెచ్ చంద్రావతి (70.40), జె.జ్యోతి (69.20), టి.సోనీ (67.20), డి.పూజా (64.20) శాతం మార్కులు సాధించారన్నారు. మార్పు అవసరం.. తెలుగుభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక స్థాయినుంచే మార్పు అవసరమని భాషాభిమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది వరకూ తెలుగువారు ఉంటున్నప్పటికీ వీరిలో అనేకమందికి తెలుగు భాషే రాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు తరాలు తెలుగును పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న ఆవేదన భాషాభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తెలుగు భాషను ఒక అంశంగా తీసుకొని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో భాష పట్ల మక్కువను ప్రేరేపించేందుకు పెద్దలే ముందుకు రావాల్సిన అవసరముంది. ఇందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన తెలుగు సంఘాలు, తెలుగు కవులు, ప్రవాస తెలుగువారు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు పాఠశాలల ఏర్పాటు కోసం స్థానిక నాయకులపై ఒత్తిడి తేవాలని, ఏర్పాటైన పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. అప్పుడే పరాయి రాష్ట్రంలో కూడా తెలుగు శాశ్వతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
విద్యార్థులు కావలెను
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు, వసతుల లేమికి అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్ల లో ఏకంగా ఏడు వేల సీట్లు ఖాళీగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు సైతం అన్ని వసతులు ఉన్న కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడంతో సంక్షేమ హాస్టళ్లలో సంఖ్య తగ్గిపోతోంది. కనీసం 50 మంది విద్యార్థులైనా లేకపోతే పక్కనున్న హాస్టల్లో కలిపేస్తామన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో.. విద్యార్థులకోసం సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందూరు : ఒకప్పుడు సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థులకోసం హాస్టళ్ల అధికారులు తిరగాల్సి వస్తోంది. జిల్లాలో 67 ఎస్సీ, 13 ఎస్టీ, 60 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 12,500 సీట్లుండగా ఏడు వేల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 3,500, ఎస్టీ హాస్టళ్లలో 500, బీసీ వసతి గృహాల్లో 3 వేల సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల బాగోగులను, కనీస సౌకర్యాలను పట్టించుకోలేని సంక్షేమాధికారులు వైఖరే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేని సంక్షేమ హాస్టళ్ల కన్నా.. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకే తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. వార్డెన్లకు తిప్పలే! జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో భారీగా ఖాళీలు ఉండటంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రతి వసతి గృహంలో కనీసం 50 మంది విద్యార్థులైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. లేదంటే వేరే హాస్టల్లో కలిపేస్తామని హెచ్చరించారు. దీంతో వార్డెన్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి హాస్టల్లో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. అయితే తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, వారు మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలవైపే చూస్తున్నారని పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. ఇలాగైతే హాస్టళ్లను నింపడం సాధ్యం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్న చొరవ తీసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా వసతి గృహాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పేద మహిళ తమ పిల్లలను వసతిగృహంలో చేర్పించాలని గ్రామ సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేయించారు. తమ పిల్లలను చేర్పించడమే కాకుండా గ్రామంలోని ఇతర పిల్లలను చేర్పించేలా చూడాలని ఐకేపీ పీడీ ద్వారా మహిళా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు వారు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించాలని సూచిస్తున్నారు. ఇటు వార్డెన్లు.. అటు మహిళా సంఘాలు ప్రయత్నిస్తున్నా సంక్షేమవసతి గృహాల్లో పిల్లలను చేర్పించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వసతులు మెరుగు పరిచి, నాణ్యమైన భోజనం పెడితే తప్ప పరిస్థితి మెరుగు పడదని పలువురు మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మారని అధికారులు విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన సామగ్రి హాస్టళ్లను చేరలేదు. విద్యార్థులకు బెడ్షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు బాక్సులు, చెప్పులు, బ్యాగులు, పరుచుకునే చాపలు, యూనిఫాంలు, నోట్ బుక్కులు తదితర వస్తువులు అందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గతనెలలోనే టెండర్లు నిర్వహించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెలలో టెండర్లు వేశారు. దీంతో సామగ్రి హాస్టళ్లను చేరలేదు. దీంతో ప్రస్తుత విద్యార్థులు ఇంకో పదిహేను రోజుల వరకు పాత సామాన్లతో సర్దుకోవాల్సిందే. సీట్ల భర్తీకి చర్యలు జిల్లాలోని వసతి గృహాలలో ఖాళీగా ఉన్న సీట్లను అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాం. గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను చేర్చుకోవాలని వార్డెన్లను ఆదేశించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి