మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా? | Decreased The number of students studying in Telugu | Sakshi
Sakshi News home page

మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?

Published Wed, Jun 18 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?

మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?

సాక్షి ముంబై: రాష్ట్రంలో ఏడాదికేడాది తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కోసం, వ్యాపారం కోసం ముంబైకి వచ్చి స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య ఏటా పెరుగుతున్న తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం తెలుగు భాషా ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది.

తెలుగు చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో తెలుగు మీడియం పాఠశాలల సంఖ్య కూడా పడిపోతోంది. తెలుగు మీడియంలో చదివించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి  చూపకపోవడం మొదటి కారణమైతే మరోవైపు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్చాలనుకున్నా అందుబాటులో తెలుగు మీడియం పాఠశాలలు లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.
 
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రస్తుతం తెలుగు మీడియం పాఠశాలలు ముంబైతోపాటు భివండీ, షోలాపూర్, చంద్రపూర్, నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా సరిపడా అధ్యాపకులు లేరు. ఏటికేటా ఈ విభాగానికి సంబంధించిన టీచర్లు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఈ కొరత నానాటికీ అధికమవుతోంది. వీరిని నియమించే విషయంలో సర్కారు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఈ సమస్య పరిష్కారమవడం లేదు. రాష్ట్రంలో తెలుగు బోధనకు సంబంధించి ప్రాథమిక విద్యస్థాయిలో ఈ కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు పిల్లలు తమ భాషను పూర్తిగా మరచిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
 
పదో తరగతిలో తెలుగును మొదటి భాషగా తీసుకున్నవారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఫస్ట్ లాంగ్వేజ్  వారీగా పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 2012-13 విద్యా సంవత్సరంలో మొత్తం 924 మంది విద్యార్థులుండగా 2013-14లో వీరి సంఖ్య 788కి దిగజారింది. వీరిలో 780 మంది తెలుగు సబ్జెక్టులో పరీక్షలు రాయగా 699  మంది (89.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే  2012-13లో ముగ్గురు తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినప్పటికీ 2013-14 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం.

 ఇదిలా ఉండగా  హిందీ-తెలుగు సబ్జెక్టులు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్‌లుగా 356 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 347 (97.47 శాతం) మంది పాసయ్యారు. ఇక ముంబై డివిజన్‌ను పరిశీలిస్తే ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినవారి సంఖ్య గతంలో కంటే తగ్గింది. 2011-12లో 810 మంది పరీక్షలు రాయగా 2012-13లో 762 మంది పరీక్షలు రాశారు. అయితే 2013-14లో వారి సంఖ్య మరింత తగ్గి 649కి చేరింది. వీరిలో 576 (88.75 శాతం) మంది ఉత్తీర్థులయ్యారు.
 
తల్లిదండ్రులూ ఆసక్తి చూపాలి..
తెలుగుభాష అభివృద్ధి విషయంలో వాస్తవానికి అధికారుల నుంచి ఉన్నంతలో ప్రోత్సాహం లభిస్తున్నా తల్లిదండ్రులే ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ ఇతర రాష్ట్రంలో నివసిస్తున్నందున తెలుగు భాష వల్ల కలిగే ప్రయోజనాలు పెద్దగా ఏమీ లేవన్న భావనతో తల్లిదండ్రులే మరో భాషపట్ల మక్కువచూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ములుండ్ బీఎంసీ పాఠశాల ఇన్‌చార్జి నాయిని ఆదినారాయణ మాట్లాడుతూ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

ముంబైలో కేవలం తమ పాఠశాలలో మాత్రమే తెలుగుమీడియంలో పదో తరగతి వరకూ బోధన అందిస్తోందన్నారు. పాఠ్యపుస్తకాలన్నీ సకాలంలో అందజేస్తున్నామని, పిల్లలకు ఉపయుక్తమయ్యే బ్యాగు, పుస్తకాలు, రెయిన్ కోటు, షూ తదితర 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు.
 
బీఎంసీ స్కూల్లో ఉత్తమ ఫలితాలు..
ములుండ్‌లోని బీఎంసీ స్కూల్లో ఈ ఏడాది ఎస్సెస్సీలో మంచి ఫలితాలు సాధించినట్లు ఆదినారాయణ తెలిపారు. 29 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో ఎస్.రామకృష్ణ (87.20 శాతం) సీహెచ్ చంద్రావతి (70.40), జె.జ్యోతి (69.20), టి.సోనీ (67.20), డి.పూజా (64.20) శాతం మార్కులు సాధించారన్నారు.
 
మార్పు అవసరం..
తెలుగుభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక స్థాయినుంచే మార్పు అవసరమని భాషాభిమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది వరకూ తెలుగువారు ఉంటున్నప్పటికీ వీరిలో అనేకమందికి తెలుగు భాషే రాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు తరాలు తెలుగును పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న ఆవేదన భాషాభిమానుల్లో వ్యక్తమవుతోంది.
 
ఈ నేపథ్యంలో కనీసం తెలుగు భాషను ఒక అంశంగా తీసుకొని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో భాష పట్ల మక్కువను ప్రేరేపించేందుకు పెద్దలే ముందుకు రావాల్సిన అవసరముంది. ఇందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన తెలుగు సంఘాలు, తెలుగు కవులు, ప్రవాస తెలుగువారు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు పాఠశాలల ఏర్పాటు కోసం స్థానిక నాయకులపై ఒత్తిడి తేవాలని, ఏర్పాటైన పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. అప్పుడే పరాయి రాష్ట్రంలో కూడా తెలుగు శాశ్వతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement