తొలిదశలో భాగంగా 28 స్కూళ్లకు శంకుస్థాపన
కొందుర్గులో సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం భూమిపూజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సౌకర్యాలతో, అత్యాధునిక డిజైన్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలకు అంకురార్పణ జరిగింది. తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో 28 రెసిడెన్షియల్ పాఠశాలలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం గోవిందాపురంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధంవారి గూడెంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళపల్లి, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలోని యాదవులపల్లిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా పొన్నేకల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సమీకృత పాఠశాల భవనాలకు భూమిపూజ చేశారు.
కొడంగల్, హుజూర్‌నగర్, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, నర్సంపేటల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ పాఠశాలల్లో విద్యాబోధన అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌లో 2,560 మంది చదువుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గురుకులాల్లో లైబ్రరీ, డిజిటల్ క్లాస్‌రూంలు, డైనింగ్ హాల్, డారి్మటరీ, బాత్‌రూమ్‌లు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు నివాస సముదాయాలు, ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా మైదానాలు, ఆడిటోరియం, హాస్పిటల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటరీ్మడియట్ వరకు ఇక్కడ చదువుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment