ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ప్రాజెక్టు
నిర్మాణం కోసం రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం
ప్రస్తుతం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమిపూజ
ఏడాదిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టు’కు ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దసరా పండుగకు ముందురోజున రాష్ట్రవ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకుల పాఠశా లల నిర్మాణ పనులకు భూమిపూజ జరుగుతుందని తెలిపారు. ఏడాదిలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాల ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదివారం సచివా లయంలో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మీడి యాతో మాట్లాడారు.
‘‘సమీకృత గురుకుల విద్యాసంస్థల నిర్మాణాల కోసం 2024–25 బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. 1,023 గురుకుల స్కూళ్లు ఉంటే అందులో 662 స్కూళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పక్కా భవనం లేనప్పుడు బోధన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడుగు, బలహీనవర్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు.
తొలుత 19 నియోజకవర్గాల్లో..
ఇప్పటివరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని భట్టి తెలిపారు. అందులో ఈ నెల 11న 19 చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని.. మిగతా నియోజ కవర్గాల్లో పూర్తిస్థాయి సమాచారం అధారంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మా ణాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించా లని నిర్ణయించామని.. విద్యార్థులకే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే క్వార్టర్స్ ఉంటాయని చెప్పారు. ఈ పాఠశా లల్లో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందిస్తామన్నారు.
ఒకరోజు ముందే దసరా పండుగ: మంత్రి వెంకట్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 19 సమీకృత గురుకుల పాఠశాలల పనుల కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురుకుల పిల్లలకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్తు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు.
అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలు: మంత్రి పొన్నం
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేశామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో కొత్త నియామకాలు పూర్తి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు చేపట్టామని చెప్పారు.
11న శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవే..
కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి.
Comments
Please login to add a commentAdd a comment