సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్‌ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు.
రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు.
అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు
మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్‌లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు.
వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్‌ఎస్‌ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడ్రోజుల్లో మమ...
డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది.
అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment