3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్‌ | Rationalization of non teaching posts: ap | Sakshi
Sakshi News home page

3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్‌

Published Tue, Oct 17 2023 5:00 AM | Last Updated on Tue, Oct 17 2023 10:45 AM

Rationalization of non teaching posts: ap - Sakshi

రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్‌ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్‌ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అడ్‌హాక్‌ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ
వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్‌హాక్‌ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రోగ్రామ్‌ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్‌ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు.

మిగిలిన వారు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ రెహమాన్‌ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్‌
డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్‌ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు వర్చువల్‌ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement