కారాగారంలో కీచకపర్వం | Male prisoners with female prisoners | Sakshi
Sakshi News home page

కారాగారంలో కీచకపర్వం

Published Fri, Oct 13 2017 5:10 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Male prisoners with female prisoners - Sakshi

మహిళలకు బాహ్య ప్రపంచంలోనే కాదు కారాగారంలోనూ రక్షణ లేదనే దారుణ ఉదంతం పుదుచ్చేరి జైలులో చోటుచేసుకుంది. జైల్లో నుంచే నేరాలకు పాల్పడేందుకు అధికారులే సహకరిస్తున్నారు. విలాసాల కోసం పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకుపంపుతున్నారు. వారి వల్ల ఇతర మహిళా ఖైదీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసింది. ఇలాంటి దురాగతాలపై పుదుచ్చేరి జైళ్ల ఐజీ నేతృత్వంలో విచారణ సాగుతుండగా కొందరిని ఇప్పటికే సస్పెండ్‌చేశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: మగ, మహిళా ఖైదీలు కలుసుకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన సిబ్బందే వారి రాసలీలలకు సహకరిస్తున్న సంఘటనలు పుదుచ్చేరి కేంద్ర కర్మాగారంలో చోటుచేసుకున్నాయి. గురువారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక (మాలైమలర్‌) ద్వారా అనేక వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రంలో జరిగే నేరాలకు సంబంధించిన వారిని పుదుచ్చేరి కాలాపట్టిలోని కేంద్ర కారాగారంలో పెడతారు. ఈ జైలులో సుమారు 600 మంది ఖైదీలున్నారు. వీరిలో వందమంది మహిళా ఖైదీలు. జైలులో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఉంచేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. మహిళా జైలు పరిధిలో మహిళా సిబ్బందే విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ జైలులో పేరొందిన కొందరు రౌడీలను అరెస్ట్‌చేసి పెట్టి ఉన్నారు. వీరు జైలులో ఉంటూనే బయట ఉన్న తమ ముఠా సభ్యులతో ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఖైదీలకు సెల్‌ఫోన్లను అందుబాటులో ఉంచుతూ వారి రౌడీరాజ్యాన్ని పాలించేందుకు సహకరిస్తున్న వారు గతంలో సస్పెండయ్యారు.

మహిళా ఖైదీలతో పురుష ఖైదీల రాసలీలలు
ఇదిలా ఉండగా,  ఖైదీలకు మరిన్ని సేవలు అందించేందుకు జైలు వార్డన్లు తెగించారు. ఒక పేరొందిన రౌడీ, మహిళా దాదా పరస్పరం కలుసుకునేందుకు జైలు అధికారులే ఏర్పాట్లుచేసినట్లు తేలింది. ఈ జైల్లో మర్డర్‌ మణికంఠన్‌ అనే పేరొందిన రౌడీ ఉన్నాడు. అతనిపై హత్య, కిడ్నాప్, డబ్బు దోచుకోవడం వంటి అనేక కేసులున్నాయి. ఈ ఏడాది జనవరిలో పుదుచ్చేరి మాజీ స్పీకర్‌ వీఎమ్‌సీ శివకుమార్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో కారైక్కాల్‌కు చెందిన మహిళా దాదా ఎళిలరసిని అరెస్ట్‌చేసి పుదుచ్చేరి జైల్లో పెట్టారు. మణికంఠన్, ఎళిలరసి  కలుసుకునేందుకు జైలు అధికారులు అవకాశం కల్పించారు. ఈ విషయం జైళ్లశాఖ ఐజీ పంకజ్‌కుమార్‌ ఝా దృష్టికి వెళ్లడంతో అర్ధరాత్రి వేళ జైల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆనందరాజ్, చీఫ్‌వార్డన్‌ వీరవాసు, వార్డన్లు కలావతి, మదివానన్‌లను ఐజీ సస్పెండ్‌ చేశారు. మణికంఠన్, ఎళిలరసి తమ శత్రువులను హతమార్చేందుకు జైలులోనే కుట్ర పన్నినట్లు ఐజీ జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది.

మహిళా ఖైదీలకు లైంగిక వేధింపులు
జైల్లో పురుష, మహిళా ఖైదీలు ఎంతమాత్రం కలుసుకునేందుకు వీలులేకుండా చేసిన ఏర్పాట్లకు జైలు సిబ్బందే గండికొట్టారు. పురుష, మహిళా ఖైదీలు రహస్యంగా కలుసుకునే జైలు సిబ్బందే ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా పేరొందిన పురుష ఖైదీలు మహిళా ఖైదీలను కలుసుకునేందుకు ప్రధానంగా ముగ్గురు వార్డెన్లు సహకరిస్తున్నట్లు సమాచారం. సదరు రౌడీల వల్ల మహిళా ఖైదీలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. జైలులోని నాలుగు గోడల మధ్యనే మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు. ఏయే పురుష ఖైదీలను మహిళా ఖైదీల వద్దకు పంపారో తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ బాగోతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వార్డెన్లను ఉన్నతాధికారులు ఇప్పటికే విచారించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ముగ్గురినీ సస్పెండ్‌ చేయవచ్చని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement