దీనికి మందు లేదా.. | sudden cheacks in khg | Sakshi
Sakshi News home page

దీనికి మందు లేదా..

Published Wed, Jul 2 2014 5:30 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

దీనికి మందు లేదా.. - Sakshi

దీనికి మందు లేదా..

- అక్రమాలకు నిలువెత్తు అడ్డాగా కేజీహెచ్
- రోగుల పేరుతో  నిధుల దోపిడి
- వైద్య పరికరాలు, మందులు దారిమళ్లింపు
- రోగులకు ఆహారంలోనూ అవినీతి
- రూ.3కోట్లకుపైగా దుర్వినియోగమని ఏసీబీ అంచనా!

సాక్షి,విశాఖపట్నం : కేజీహెచ్‌లో ఇప్పటికే అనేకసార్లు ఏసీబీ దాడులు నిర్వహించింది. మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరిగెత్తుతున్నాయి. . ముఖ్యంగా ఖరీదైన వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రికార్డుల్లో మాత్రం  సవ్యంగానే ఉన్నా  పరికరాలు కనిపించడం లేదు. కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు తమ క్లినిక్కులకుతరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి విధులపై వచ్చి  కొందరు పరికరాలు కూడా తీసుకుపోతున్నట్లు ఏసీబీ పసిగట్టింది.

1045 పడకల ఆస్పత్రిలో సుమారుగా వెయ్యి మంది రోగులు ఇన్‌పెషెంట్లుగా ఉంటున్నారు. వీరికిచ్చే ఆహారం పేరుతోనూ భారీగా నిధులు బొక్కేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోనే రూ.12 లక్షల వరకు దారిమళ్లినట్లు సమాచారం.  గైనిక్ వార్డులో మరీనూ. ఎవరికైనా మగబిడ్డ పుడితే రూ.1500, ఆడపిల్లకైతే రూ. 1000 ఇవ్వాల్సిందే. రోగులను క్యాజు వాల్టీ నుంచి వార్డుకు తరలించడానికి రూ. 500 సమ ర్పిం చుకోవాల్సిందే. లేదం టే బెడ్ దక్కదు. కీలకమైన మెడికల్ సర్టిఫికేట్ల జారీకి కొందరు మినిస్టీరిచల్ సిబ్బంది రూ. 5000కు పైగా పుచ్చుకుంటున్నారు.

ఎక్స్‌రే, రేడియాలజీ విభాగాల్లో వైద్య పరీక్షలకు నేరుగా కాసులు ఇచ్చుకోవాల్సిందే. పెద్దాసుపత్రిమందుల కొరత లేకుండా వైద్యశాఖ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే ఇక్కడ కొందరు సిబ్బందికి వరంగా మారుతోంది. స్టోర్‌రూంలో ఉండాల్సిన ఈ మందులు కొందరు పెద్దల ప్రమేయంతో నేరుగా వారిసొంత  క్లినిక్కులకు దారిమళ్లిపోతోంది. రికార్డుల్లో మాత్రం రోగులకు వినియోగించినట్లుగా నమోదుచేస్తున్నారు. కాటన్ కొనుగోలుకు లక్షల్లో వినియోగిస్తుంటే చాలామంది రోగులకు అసలు దీన్ని చేతికి ఇవ్వడం గగనమవుతోంది.

ఆపరేషన్ థియేటర్లు, ముఖ్యు ల ఛాంబర్లకు ఏసీలు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాని వీటి జాడే ఉండడంలేదు. ఇదే విషయాన్ని ఏసీబీ గుర్తించి రికార్డులు తనిఖీ చేస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క ఆస్పత్రిలో 60మంది ప్రైవేటు భద్రత సిబ్బంది పనిచేస్తున్నారు. కాని 100నుంచి 150మంది పనిచేస్తున్నట్లు రికార్డు ల్లో చూపి కొందరు ఈ నిధులను భారీగా బొక్కేస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో అవినీతికి అడ్డేలేకుండా పోయిందని ఏసీబీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి కనీసం లెక్కలు లేకపోవడం  అవినీతికి మచ్చుతునకగా కనిపిస్తోంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారుగా 40 మంది ఏసీబీ సిబ్బంది బుధవారం కూడా తనిఖీలు కొనసాగించనున్నారు. రూ. 3కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు అనధికారికంగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement