ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి.. | ahmad babu sudden checks to rims have hospital | Sakshi
Sakshi News home page

ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..

Published Sun, Jun 22 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..

ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..

ఆదిలాబాద్ రిమ్స్ : ‘ఆదపలో ఉన్నవారి నుంచి డబ్బులు తీసుకుంటారా..? అవసరం వారిదికదా అని ఎంతైనా అడుగతారా..? ఒకవేళ నేను రిమ్స్‌కు వచ్చినా డబ్బులు అడుగుతారేమో..?’ ఇవి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబు రిమ్స్ సిబ్బందిని ఉద్దేశించి అన్న మాటలు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో శనివారం కలెక్టర్ అహ్మద్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 11.45 గంటలకు రిమ్స్‌కు వచ్చిన కలెక్టర్ 2.45 గంటల వరకు అంటే 3 గంటలపాటు అన్ని వార్డులనూ అణువణువు పరిశీలించారు. సంవత్సరం క్రితం కలెక్టర్ రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు మెటర్నిటీ (ప్రసూతి) వార్డులోని సిబ్బంది పాప, బాబు పుట్టిన వెంటనే డబ్బులు వసూలు చేస్తున్నారని కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులోకి వెళ్లగానే బాధితుల నుంచి మళ్లీ అదే ఫిర్యాదు వచ్చింది.
 
నేరడిగొండ మండలం తర్నం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన కోడలును ప్రసూతి కోసం రిమ్స్‌కు తీసుకొస్తే అక్కడి సిబ్బంది తనను డబ్బులు అడిగారని, అన్ని రూ.2 వేల వరకు ఇచ్చానని కలెక్టర్‌కు విన్నవించింది. దీంతో ఆ విభాగం అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధలో ఉండి ఆస్పత్రికి వస్తే ఇలా డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్న వారిని గుర్తించి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఆదేశించారు. ముందుగా చిల్డ్రన్స్‌వార్డును పరిశీలించారు. ఇటీవల ఆ వార్డులో వైద్యం అందక ఓ బాబు చనిపోయిన సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. పిల్లలకు సమయానికి వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు విధులు నిర్వర్తించాలని సూచించారు.
 
 అపరిశుభ్రత, అసౌకర్యాలపై ఆగ్రహం..
 ఆస్పత్రిలోని మెడికల్‌వార్డు, సర్జరీ వార్డు, ల్యాబ్‌ల్లోని అపరిశుభ్రతపై కలెక్టర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లోని మరుగుదొడ్లను ప్రత్యేకంగా పరిశీలించారు. మరుగుదొడ్లలో విపరీతమైన కంపు రావడంతో డెరైక్టర్, పారిశుధ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ రిమ్స్‌కు వచ్చినప్పుడు ఇదేసమస్య ఎందుకు ఎదురవుతోందని, ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితి మార్చుకోకపోవడం సరైంది కాదని అధికారులను హెచ్చరించారు. మరుగుదొడ్లలో వెంటనే నీటి సరఫరా కల్పించి, మరమ్మతు చేయించాలని ఆదేశించారు. రక్త పరీక్ష కేంద్రంలోని సిబ్బంది రక్త పరీక్షల అనంతరం సిరంజీలను బయపడేయడంపై కలెక్టర్ తీవ్రంగా మండిపడ్డారు. ల్యాబ్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.
 
 రిమ్స్ డెరైక్టర్ నిత్యం ఇలాంటి వాటిని పరిశీలించి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆస్పత్రిలో పనిచేయని లిఫ్ట్‌లను వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గదులకు తాళం వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిపోయిన పడకలు, మూలన పడేసిన పడకలను గమనించిన కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు. అసలే పడకల కొరత ఉందని చెబుతూనే ఇలా మూలనపడేయడమేంటని ప్రశ్నించారు.
 
 సెక్యూరిటీ సొసైటీని తప్పిస్తాం..
 ఆస్పత్రిలోని మరుగుదొడ్లలో పగిలిపోయి సింకులు, పైప్‌లైన్‌లు లేకపోవడంపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు. రిమ్స్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు, ఇతర వార్డుల్లోని రూ.25 లక్షల పరికరాలు అపహరించారని కలెక్టర్ దృష్టికి సంబంధిత అధికారులు తీసుకెళ్లారు. దీంతో భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సెక్యురిటీ గార్డులే బాద్యత వహించాలని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరుగుతుంటే సెక్యూరిటీ గార్డులు ఉండే లాభమని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే సెక్యురిటీ సోసైటీని ఎత్తివేస్తామని హెచ్చరించారు. పరికాలు అపహరణకు గురైనట్లు తెలిస్తే సిబ్బంది వేతనాల్లో కోత విధించాల్సి ఉంటుందని సూచించారు.
 
ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..
రిమ్స్‌లో విధులు నిర్వర్తించే వైద్యులు ఆంధ్ర-మహారాష్ట్ర- తెలంగాణ అంటూ విభేదాలు లే కుండా పనిచేయాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అ న్నారు. రిమ్స్ పరిశీలన అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది వైద్యులు ప్రాంతీయ భేదాలతో పనిచేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు ప్రాంత విభేదాలు పక్కనపెట్టి పనితీరు మార్చుకోవాలని సూచించారు. వైద్యం అందడం లేదని పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నడుపరాదని సూచించారు. రిమ్స్‌లో 65 శాతం వైద్యుల కొరత ఉందని, వాటిని వెంటనే భర్తీ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement