ahmad babu
-
పార్టీ కోసం ప్రభుత్వ సేవ
రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ఉన్న సమాచారమంతా పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారమేనని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరి సమాచారంతో పాటు ప్రభుత్వ సమాచారం, పౌరుల వ్యక్తిగత డేటాతో ఒక మొబైల్ యాప్‌ను ప్రైవేట్ సంస్థలతో తయారుచేయించి, ఆ తర్వాత దానిని తెలుగుదేశం పార్టీ సేవా మిత్రల ట్యాబ్‌లకు మళ్లించారని స్పష్టమైంది. ఇప్పుడు ఈ యాప్ గుట్టురట్టు చేసే ఓ వీడియో ఒకటి ‘సాక్షి’కి చిక్కింది. ప్రభుత్వం తయారుచేయించిన ఈ యాప్‌లో ఉన్న వివరాలు, సేవామిత్ర యాప్‌లో ఉన్న వివరాలు ఒక్కటేనన్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ యాప్‌లో వ్యక్తుల వారీగా కేటాయించిన కోడ్ నెంబర్లు, సేవామిత్రల్లో పేర్కొన్న వ్యక్తుల కోడ్ నెంబర్లు ఒకే రీతిన ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తయారుచేసిన యాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైం గవర్ననెన్స్ (ఆర్టీజీఎస్) శాఖలో రూపొందించిన విషయాన్ని ఆ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు స్వయంగా వెల్లడించారు. ‘మీ భూమి’ వెబ్లాండ్లో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న రైతుల భూముల వివరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను కూడా పొందుపరిచేలా ఓ మొబైల్ యాప్‌ను తయారుచేయమని చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని ఆయన అందులో బయటపెట్టేశారు. రైతుల భూముల వివరాలతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కూడిన యాప్‌పై అవగాహన కలిగించేందుకు 2018 జూన్ 21న జరిగిన ప్రభుత్వ సమావేశంలో అహ్మద్ బాబు ఆ యాప్ గురించి సీఎంతో పాటు ఐఏఎస్ ఉన్నతాధికారులకు వివరిస్తున్న వీడియో ‘సాక్షి’కి దొరికింది. అందులో యాప్‌కు సంబంధించిన అంశాలపై అహ్మద్ బాబు ఏం చెప్పారంటే.. – రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. – ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. – కుటుంబ సభ్యుల వారీగా ఒకొక్కరూ ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారన్న వివరాలున్నాయి. – యాప్ తయారీకి ఆర్టీజీసీ ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు నెంబరు కేటాయించింది. ఆ నెంబరు క్లిక్ చేయగానే ఆ వ్యక్తి ఫొటో, ఆధార్, పేరు, అతని ఫోన్ నెంబరు, అతని ఆదాయం సహా అన్ని వివరాలు యాప్ ఉన్న మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. – వ్యవసాయ భూముల వివరాలు, ఉపాధి హామీ పథకంలో ఎవరెన్ని రోజులు పనిచేశారు.. ఇళ్లు మంజూరైన వారి వివరాలు.. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులు.. రేషన్ సరుకులు తీసుకుంటున్న వారు, పసుపు–కుంకుమ కింద డబ్బులు పొందిన డ్వాక్రా మహిళల వివరాలు ఆ యాప్‌లో పొందుపరిచారు. – ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1100 నెంబరుకు ఎవరైనా ఫోన్‌చేస్తే.. వారి వివరాలు అప్పటికప్పుడు యాప్‌కు చేరేలా అనుసంధానం చేశారు. ఇలా 2018 జూన్ నాటికి 61 లక్షల మంది వివరాలు యాప్‌కు అనుసంధానం చేసినట్టు అహ్మద్ బాబు ఆ వీడియోలో వివరించారు. – ఆ యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు. – ఈ యాప్‌లో నమోదు చేసే ప్రతి అంశం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరుతుంది. సాధికార మిత్రల కోసమంటూ టీడీపీ కార్యకర్తల ట్యాబ్‌లోకి.. వాస్తవానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం 2018 జూన్‌లో 4.80లక్షల డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి, వారికి సాధికార మిత్రలుగా నామకరణం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మొత్తం 1.40కోట్ల కుటుంబాలకు వివరించేందుకు ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించారు. ఈ యాప్‌తో సాధికార మిత్రలను ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకుంటే, 4.80 లక్షల మందిలో ఎవరో ఒకరి ద్వారా విషయం బయటకు పొక్కుతుందని సర్కారు పెద్దలు అనుమానించి ఆ తర్వాత ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వారికి స్మార్ట్ ఫోన్ల కొనుగోలూ ఖర్చుతో కూడుకున్నదని భావించింది. దీంతో ఈ యాప్‌ను పూర్తిగా టీడీపీ బూత్ కమిటీ నేతల ట్యాబ్‌లకు మళ్లించారని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ యాప్‌ను మొదట సాధికార మిత్రల కోసమని ప్రభుత్వం తయారుచేయించినట్లు అహ్మద్ బాబు సైతం ఆ వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్ తయారుచేసిన యాప్‌లో లబ్ధిదారులకు ఇచ్చిన కోడ్ నెంబర్లు, టీడీపీ సేవా మిత్రలో ఉన్న కోడ్ నెంబర్లు ఒకే తీరులో ఉండడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేస్తోంది. -
ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి..
ఆదిలాబాద్ రిమ్స్ : ‘ఆదపలో ఉన్నవారి నుంచి డబ్బులు తీసుకుంటారా..? అవసరం వారిదికదా అని ఎంతైనా అడుగతారా..? ఒకవేళ నేను రిమ్స్‌కు వచ్చినా డబ్బులు అడుగుతారేమో..?’ ఇవి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబు రిమ్స్ సిబ్బందిని ఉద్దేశించి అన్న మాటలు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో శనివారం కలెక్టర్ అహ్మద్ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 11.45 గంటలకు రిమ్స్‌కు వచ్చిన కలెక్టర్ 2.45 గంటల వరకు అంటే 3 గంటలపాటు అన్ని వార్డులనూ అణువణువు పరిశీలించారు. సంవత్సరం క్రితం కలెక్టర్ రిమ్స్ పరిశీలనకు వచ్చినప్పుడు మెటర్నిటీ (ప్రసూతి) వార్డులోని సిబ్బంది పాప, బాబు పుట్టిన వెంటనే డబ్బులు వసూలు చేస్తున్నారని కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులోకి వెళ్లగానే బాధితుల నుంచి మళ్లీ అదే ఫిర్యాదు వచ్చింది. నేరడిగొండ మండలం తర్నం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన కోడలును ప్రసూతి కోసం రిమ్స్‌కు తీసుకొస్తే అక్కడి సిబ్బంది తనను డబ్బులు అడిగారని, అన్ని రూ.2 వేల వరకు ఇచ్చానని కలెక్టర్‌కు విన్నవించింది. దీంతో ఆ విభాగం అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో బాధలో ఉండి ఆస్పత్రికి వస్తే ఇలా డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. డబ్బులు తీసుకున్న వారిని గుర్తించి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను ఆదేశించారు. ముందుగా చిల్డ్రన్స్వార్డును పరిశీలించారు. ఇటీవల ఆ వార్డులో వైద్యం అందక ఓ బాబు చనిపోయిన సంఘటనపై వివరాలు అడిగితెలుసుకున్నారు. పిల్లలకు సమయానికి వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు విధులు నిర్వర్తించాలని సూచించారు. అపరిశుభ్రత, అసౌకర్యాలపై ఆగ్రహం.. ఆస్పత్రిలోని మెడికల్‌వార్డు, సర్జరీ వార్డు, ల్యాబ్‌ల్లోని అపరిశుభ్రతపై కలెక్టర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డుల్లోని మరుగుదొడ్లను ప్రత్యేకంగా పరిశీలించారు. మరుగుదొడ్లలో విపరీతమైన కంపు రావడంతో డెరైక్టర్, పారిశుధ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ రిమ్స్‌కు వచ్చినప్పుడు ఇదేసమస్య ఎందుకు ఎదురవుతోందని, ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితి మార్చుకోకపోవడం సరైంది కాదని అధికారులను హెచ్చరించారు. మరుగుదొడ్లలో వెంటనే నీటి సరఫరా కల్పించి, మరమ్మతు చేయించాలని ఆదేశించారు. రక్త పరీక్ష కేంద్రంలోని సిబ్బంది రక్త పరీక్షల అనంతరం సిరంజీలను బయపడేయడంపై కలెక్టర్ తీవ్రంగా మండిపడ్డారు. ల్యాబ్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ నిత్యం ఇలాంటి వాటిని పరిశీలించి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆస్పత్రిలో పనిచేయని లిఫ్ట్‌లను వెంటనే బాగు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గదులకు తాళం వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరిగిపోయిన పడకలు, మూలన పడేసిన పడకలను గమనించిన కలెక్టర్ అధికారులపై మండిపడ్డారు. అసలే పడకల కొరత ఉందని చెబుతూనే ఇలా మూలనపడేయడమేంటని ప్రశ్నించారు. సెక్యూరిటీ సొసైటీని తప్పిస్తాం.. ఆస్పత్రిలోని మరుగుదొడ్లలో పగిలిపోయి సింకులు, పైప్లైన్లు లేకపోవడంపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు. రిమ్స్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు, ఇతర వార్డుల్లోని రూ.25 లక్షల పరికరాలు అపహరించారని కలెక్టర్ దృష్టికి సంబంధిత అధికారులు తీసుకెళ్లారు. దీంతో భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సెక్యురిటీ గార్డులే బాద్యత వహించాలని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దొంగతనాలు జరుగుతుంటే సెక్యూరిటీ గార్డులు ఉండే లాభమని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే సెక్యురిటీ సోసైటీని ఎత్తివేస్తామని హెచ్చరించారు. పరికాలు అపహరణకు గురైనట్లు తెలిస్తే సిబ్బంది వేతనాల్లో కోత విధించాల్సి ఉంటుందని సూచించారు. ఆంధ్ర-మహారాష్ట్ర-తెలంగాణ విభేదాలు వీడండి.. రిమ్స్‌లో విధులు నిర్వర్తించే వైద్యులు ఆంధ్ర-మహారాష్ట్ర- తెలంగాణ అంటూ విభేదాలు లే కుండా పనిచేయాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అ న్నారు. రిమ్స్ పరిశీలన అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది వైద్యులు ప్రాంతీయ భేదాలతో పనిచేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు ప్రాంత విభేదాలు పక్కనపెట్టి పనితీరు మార్చుకోవాలని సూచించారు. వైద్యం అందడం లేదని పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నడుపరాదని సూచించారు. రిమ్స్‌లో 65 శాతం వైద్యుల కొరత ఉందని, వాటిని వెంటనే భర్తీ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. -
‘ప్రత్యేక’ పండుగ
ఆరు దశాబ్దాల పోరాటం ఫలించిన వేళ.. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురవుతున్న వేళ.. తెలంగాణ సంబరం అంబరాన్నంటుతోంది. ఇప్పటికే వేడుకలతో ఊరూ.. వాడా తెలం‘గానం’ మారుమోగుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీలు, తెలంగాణ జేఏసీ, ఉద్యోగులు, టీఎన్జీవోలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాయి. సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ అహ్మద్ బాబు సంబంధిత శాఖల అధికారులతో వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షించారు. జూన్ 2 అపాయింటెడ్ డేను పురస్కరించుకుని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజులపాటు ఈ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు.. ప్రధాన పార్టీలు కూడా ‘తెలంగాణ’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నాయి. అధినేత కేసీఆర్ జూన్ 2 నాడే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరింత ఉత్సాహంగా సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనుక తమ పార్టీ అధినేత్రి సోనియా కృషి ఎంతో ఉం దని, తెలంగాణ కల సాకరమైన వేళ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా సంబ రాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయిం చింది. జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. టీఎన్జీవోలు.. ప్రజాసంఘాలు.. టీఎన్జీవో, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు సంసిద్ధమయ్యారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ కళాకారులు భావిస్తున్నారు. తెలంగాణవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ధూం ధాం కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సిద్ధమయ్యారు. -
సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’ సాధ్యమని కలెక్టర్ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మార్పు పథకం శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. పథకాల అమలు ఉద్యోగుల జీతాల కోసం కాదని, ప్రజల అభివృద్ధి కోసమన్నారు. అధికారులు బాధ్యతయుతంగా పనిచేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఇష్టారాజ్యంగా పనిచేయడంతో పథకాల అమలు నీరుగారిపోతోందన్నారు. అలసత్వం వీడి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం డీఆర్డీఏ, ఐసీడీఎస్ అధికారుల సమన్వయం లోపంతోనే సక్రమంగా అమలు కావడంలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు 20 ప్రసవాలు జరగాల్సి ఉండగా ఒక్కటీ జరగకపోవడం మన డాక్టర్ల పనితీరును తెలియజేస్తుందన్నారు. ప్రజలకు ముందుగా ప్రైవేటు కంటే దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయనే భరోసా కల్పించాలన్నారు. ‘మార్పు’ లక్ష్యం మాతాశిశు మరణాలు తగ్గించడం, ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడటం, పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ, రక్తహీనతను గుర్తించడం, ఆరోగ్యం, పోషక విలువలు, కుటుంబ నియంత్రణ చేయడమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా డీఆర్డీఏ, పంచాయత్‌రాజ్, ఐసీడీఎస్, వైద్యశాఖ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా మార్పు తేవాలన్నారు. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరుబాగున్న ఉద్యోగులకు ఇన్సెంటీవ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో బసవేశ్వరీ, అదనపు డీఎం అండ్‌హెచ్‌వో జలపతినాయక్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, మాస్ మీడియా అధికారులు విజయలక్ష్మి, శంకరయ్య పాల్గొన్నారు. -
ప్రచారం సమాప్తం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమ రం తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలు గు గంటలకు ప్రచారం ముగి యడంతో వీధులు మూగబోయాయి. పక్షం రోజులుగా మైకులతో హోరెత్తించిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం ముగించారు. అన్ని పార్టీల నాయకులు తమ అగ్రనాయకులను రప్పించి ప్రచారం నిర్వహిం చారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు 107 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ప్రచారం ఉత్కంఠ రీతిలో కొనసాగింది. దీంతో ప్రచార పోరు రోజుకో తీరుగా గ్రామాల్లో సందడిని నెలకొంది. మొదట్లో పట్టణాల్లో వార్డుల వారీగా తిరుగుతూ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే, పల్లెల్లో మొబైల్ ప్రచార వాహనాలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ప్రచార పర్వం ముగింపు గడువు దగ్గరపడుతుండడంతో ప్రచారంలో కూడా నువ్వా.. నేనా.. అన్నట్లుగా కొనసాగింది. పల్లె వాకిట్లో గంట గంటకు ఒక ప్రచారం వాహనం వివిధ రకాల పాటలతో హోరేత్తించగా, పట్టణాల్లో వీధులు, వార్డుల గుండా పలువురు అభ్యర్థులు ఒకరిని మించి మరోకరు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తున్న అకౌంటింగ్ టీమ్ అధికారులకు ప్రతినిత్యం ప్రచార ఖర్చులకు సంబంధించిన వివరాలను ఆయా అభ్యర్థుల అభ్యర్థుల ఖాతాల్లో జమ చేశారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చులు కొంత మంది అభ్యర్థులవి ఎన్నికల సంఘం విధించిన దానికంటే ఎక్కువగా కూడా అయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే వీరి వివరాలను మరో మూడు రోజుల్లో వెల్లడించనున్నారు. పరిధి దాటిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ అయినా అభ్యర్థుల ఇచ్చే సమాధానాలను బట్టి అర్హులా.. అనర్హులా అనేది ఎన్నికల కమిషన్ తేల్చనుంది. ఉదయం ఏడు నుంచి పోలింగ్ సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మంగళవారం పోలింగ్ సామగ్రిని కేంద్రాలకు తరలించనున్నారు. ఎన్నికల నిర్వహణకు 24 వేల మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పురుషులు 9,80,897, స్త్రీలు 9,78,561 మంది, ఇతరులు 202 మంది మొత్తం 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటును 2,318 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు వినియోగించుకోనున్నారు. 4,244 మందికి రెండేసి ఓట్లు ఉన్నట్లుగా, 6,985 మంది చనిపోయిన వారిగా, 5078 మంది షిప్టెడ్ ఓటర్లుగా, 1227 మంది అందుబాటులో లేని ఓటర్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 18 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తే, 13 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోగా, ఇంకా మంగళవారం వరకు సమయం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1.70 కోట్లు నగదు స్వాధీనం చేసుకోవడంతోపాటు 53 వేల లీటర్ల లిక్కర్ పట్టుబడడంతో మద్యం రవాణాలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పోలింగ్ కేంద్రాలు.. అధికారులు, సిబ్బంది.. జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 1670 ప్రాంతాల్లో మొత్తం 2,318 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్లో 229, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 195, మంచిర్యాలలో 253, ఆసిఫాబాద్‌లో 258, ఖానాపూర్‌లో 224, ఆదిలాబాద్‌లో 244, బోథ్‌లో 232, నిర్మల్‌లో 225, ముథోల్‌లో 250 మొత్తం 2,318 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సాధారణ పోలింగ్ కేంద్రాలు 1,553, సమస్యాత్మక 282, అత్యంత సమస్యాత్మక 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సుమారు 3 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 27 మంది సెక్టార్, 27 మంది వరకు రూట్ అధికారులను నియమించారు. వీరితోపాటు 159 మంది ఫ్లయింగ్‌స్వ్కాడ్, 282 మంది స్టాటిక్ సర్వేలెన్స్, 156 మంది మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, 26 మంది వీడియో సర్వే లెన్స్, 44 మంది వీడియో వ్యూయింగ్, 44 మంది అకౌంటింగ్ టీం అధికారులతోపాటు 6,836 మంది అధికారులను 866 గ్రామ పంచాయతీల్లో నియమించారు. 1039 మంది మైక్రో పరిశీలను నియమించారు. 1001 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణకు 1100 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించనున్నారు. ఎన్నికల కోసం 5,500 మంది పోలీసులను, 1500 మంది పారామిలటరీ బలగాలను వినియోగించనున్నారు. ఎన్నికలకు 394 ఆర్టీసీ, 155 చిన్న బస్సులను, 138 జీపులను, 19 వ్యాన్లను, రెండు ట్రాక్టర్లు, రెండు టాటా సుమోలను వినియోగించనున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ అహ్మద్ బాబు ఈ నెల 30న జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో 19,59,660 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 18,95,877 మంది ఓటర్లకు ఫొటో ఓటరు స్లిప్పులు అందజేసి 90 శాతం పోలింగ్ నమోదుకు కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ కలర్ తెలుపులో, అసెంబ్లీ బ్యాలెట్ పేపర్ గులాబీ కలర్లో ఉంటుందన్నారు. మొట్టమొదటి సారిగా ఈవీఎంలో నోటా బటన్ పద్ధతి ఉందన్నారు. ప్రతి సెక్టార్ అధికారి వద్ద రెండు ఈవీఎంలను రిజర్వులో ఉంచామని, వెంటనే ఈవీఎంలను రీ-ప్లేస్ చేసేందుకు వినియోగించవచ్చన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓటరు సహాయక కేంద్రం ఉంటుందని, 200 మీటర్ల దూరంలో రాజకీయ అభ్యర్థుల ఓటరు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని, సాధారణ పోలింగ్ కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్, హోంగార్డు, సమస్యాత్మక కేంద్రాల్లో ఆర్మీ పోలీసులు, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారామిలటరీ పోలీసులను వినయోగిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక హెలిక్యాప్టర్‌ను వినియోగించనున్నట్లు, ఇందుకు జిల్లాలో 11 హెలిప్యాడ్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను అదేరోజు రాత్రి జిల్లాలో ఏర్పాటు చేసిన 20 స్ట్రాంగ్ రూంలకు చేరుకుంటాయని, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు, ఈ భద్రత మే 16 వరకు ఉంటుందని తెలిపారు. ఓటర్లకు కలెక్టర్ సందేశం ఈ నెల 30న జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటేయాలి. జిల్లా ఇంకా ముందుకు వెళ్లాలంటే అది ప్రజలతోనే సాధ్యమవుతుంది. ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. ప్రతి ఒక్కరు ఓటు వేస్తే అది సాధ్యమవుతుంది. అందరు ఓటు వినియోగించుకుంటే బాగుంటుంది.