పార్టీ కోసం ప్రభుత్వ సేవ | Government service for the party | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం ప్రభుత్వ సేవ

Published Mon, Mar 11 2019 3:30 AM | Last Updated on Mon, Mar 11 2019 3:30 AM

Government service for the party - Sakshi

రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు.

సాక్షి, అమరావతి :
తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ఉన్న సమాచారమంతా పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారమేనని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరి సమాచారంతో పాటు ప్రభుత్వ సమాచారం, పౌరుల వ్యక్తిగత డేటాతో ఒక మొబైల్‌ యాప్‌ను ప్రైవేట్‌ సంస్థలతో తయారుచేయించి, ఆ తర్వాత దానిని తెలుగుదేశం పార్టీ సేవా మిత్రల ట్యాబ్‌లకు మళ్లించారని స్పష్టమైంది. ఇప్పుడు ఈ యాప్‌ గుట్టురట్టు చేసే ఓ వీడియో ఒకటి  ‘సాక్షి’కి చిక్కింది. ప్రభుత్వం తయారుచేయించిన ఈ యాప్‌లో ఉన్న వివరాలు, సేవామిత్ర యాప్‌లో ఉన్న వివరాలు ఒక్కటేనన్నట్లుగా ఉన్నాయి.

ప్రభుత్వ యాప్‌లో వ్యక్తుల వారీగా కేటాయించిన కోడ్‌ నెంబర్లు, సేవామిత్రల్లో పేర్కొన్న వ్యక్తుల కోడ్‌ నెంబర్లు ఒకే రీతిన ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తయారుచేసిన యాప్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రియల్‌ టైం గవర్ననెన్స్‌ (ఆర్టీజీఎస్‌) శాఖలో రూపొందించిన విషయాన్ని ఆ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ బాబు స్వయంగా వెల్లడించారు. ‘మీ భూమి’ వెబ్‌లాండ్‌లో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న రైతుల భూముల వివరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను కూడా పొందుపరిచేలా ఓ మొబైల్‌ యాప్‌ను తయారుచేయమని చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని ఆయన అందులో బయటపెట్టేశారు. రైతుల భూముల వివరాలతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కూడిన యాప్‌పై అవగాహన కలిగించేందుకు 2018 జూన్‌ 21న జరిగిన ప్రభుత్వ సమావేశంలో అహ్మద్‌ బాబు ఆ యాప్‌ గురించి సీఎంతో పాటు ఐఏఎస్‌ ఉన్నతాధికారులకు వివరిస్తున్న వీడియో ‘సాక్షి’కి దొరికింది. అందులో యాప్‌కు సంబంధించిన అంశాలపై అహ్మద్‌ బాబు ఏం చెప్పారంటే..
– రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు.
– ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. 
– కుటుంబ సభ్యుల వారీగా ఒకొక్కరూ ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారన్న వివరాలున్నాయి. 
– యాప్‌ తయారీకి ఆర్టీజీసీ ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు నెంబరు కేటాయించింది. ఆ నెంబరు క్లిక్‌ చేయగానే ఆ వ్యక్తి ఫొటో, ఆధార్, పేరు, అతని ఫోన్‌ నెంబరు, అతని ఆదాయం సహా అన్ని వివరాలు యాప్‌ ఉన్న మొబైల్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
– వ్యవసాయ భూముల వివరాలు, ఉపాధి హామీ పథకంలో ఎవరెన్ని రోజులు పనిచేశారు.. ఇళ్లు మంజూరైన వారి వివరాలు.. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులు.. రేషన్‌ సరుకులు తీసుకుంటున్న వారు, పసుపు–కుంకుమ కింద డబ్బులు పొందిన డ్వాక్రా మహిళల వివరాలు ఆ యాప్‌లో పొందుపరిచారు. 
– ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1100 నెంబరుకు ఎవరైనా ఫోన్‌చేస్తే.. వారి వివరాలు అప్పటికప్పుడు యాప్‌కు చేరేలా అనుసంధానం చేశారు. ఇలా 2018 జూన్‌ నాటికి 61 లక్షల మంది వివరాలు యాప్‌కు అనుసంధానం చేసినట్టు అహ్మద్‌ బాబు ఆ వీడియోలో వివరించారు. 
– ఆ యాప్‌ ద్వారా ఎక్కడ నుంచైనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించుకోవచ్చు.
– ఈ యాప్‌లో నమోదు చేసే ప్రతి అంశం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరుతుంది. 

సాధికార మిత్రల కోసమంటూ టీడీపీ కార్యకర్తల ట్యాబ్‌లోకి..
వాస్తవానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం 2018 జూన్‌లో 4.80లక్షల డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి, వారికి సాధికార మిత్రలుగా నామకరణం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మొత్తం 1.40కోట్ల కుటుంబాలకు వివరించేందుకు ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించారు. ఈ యాప్‌తో సాధికార మిత్రలను ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకుంటే, 4.80 లక్షల మందిలో ఎవరో ఒకరి ద్వారా విషయం బయటకు పొక్కుతుందని సర్కారు పెద్దలు అనుమానించి ఆ తర్వాత ప్లాన్‌ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వారికి స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలూ ఖర్చుతో కూడుకున్నదని భావించింది. దీంతో ఈ యాప్‌ను పూర్తిగా టీడీపీ బూత్‌ కమిటీ నేతల ట్యాబ్‌లకు మళ్లించారని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ యాప్‌ను మొదట సాధికార మిత్రల కోసమని ప్రభుత్వం తయారుచేయించినట్లు అహ్మద్‌ బాబు సైతం ఆ వీడియోలో వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్‌ తయారుచేసిన యాప్‌లో లబ్ధిదారులకు ఇచ్చిన కోడ్‌ నెంబర్లు, టీడీపీ సేవా మిత్రలో ఉన్న కోడ్‌ నెంబర్లు ఒకే తీరులో ఉండడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement