సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’ సాధ్యమని కలెక్టర్ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మార్పు పథకం శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. పథకాల అమలు ఉద్యోగుల జీతాల కోసం కాదని, ప్రజల అభివృద్ధి కోసమన్నారు. అధికారులు బాధ్యతయుతంగా పనిచేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఇష్టారాజ్యంగా పనిచేయడంతో పథకాల అమలు నీరుగారిపోతోందన్నారు. అలసత్వం వీడి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ అమృతహస్తం పథకం డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ అధికారుల సమన్వయం లోపంతోనే సక్రమంగా అమలు కావడంలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు 20 ప్రసవాలు జరగాల్సి ఉండగా ఒక్కటీ జరగకపోవడం మన డాక్టర్ల పనితీరును తెలియజేస్తుందన్నారు. ప్రజలకు ముందుగా ప్రైవేటు కంటే దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయనే భరోసా కల్పించాలన్నారు. ‘మార్పు’ లక్ష్యం మాతాశిశు మరణాలు తగ్గించడం, ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడటం, పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ, రక్తహీనతను గుర్తించడం, ఆరోగ్యం, పోషక విలువలు, కుటుంబ నియంత్రణ చేయడమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా డీఆర్‌డీఏ, పంచాయత్‌రాజ్, ఐసీడీఎస్, వైద్యశాఖ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా మార్పు తేవాలన్నారు.
పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పనితీరుబాగున్న ఉద్యోగులకు ఇన్సెంటీవ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో బసవేశ్వరీ, అదనపు డీఎం అండ్‌హెచ్‌వో జలపతినాయక్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, మాస్ మీడియా అధికారులు విజయలక్ష్మి, శంకరయ్య పాల్గొన్నారు.