పాలు పంచుకున్నారు
అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణులక సరఫరా కాని పాలు
అయినా రూ.8లక్షలుపైగాబిల్లుల చెల్లింపు
గర్భిణిలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం పక్కదారి పట్టింది. కొన్ని అంగన్వాడి కేంద్రాల ద్వారా పాలు సరఫరా చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. గర్భస్థ దశలో శిశువుకు సరైన పోషణ అందకపోతే శిశువులో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పుట్టిన తర్వాత శిశువు ఎదుగుదలపై దాని ప్రభావం ఉంటుంది. బిడ్డ సరైన బరువు ఉండకపోవడం, తగినంత ఎత్తు ఎదగకపోవడానికి గర్భస్థ దశలో సరైన పోషణ అందకపోవడమే కారణమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మాతృమరణాలు, శిశు మరణాలు, పోషకాహార లోపం అధికంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో టేక్‌హోం రేషన్‌కు బదులుగా అనుబంధ పోషకాహార కార్యక్రమంలో మార్పులు తెచ్చి అంగన్వాడి కేంద్రంలోనే గర్భిణీలు, బాలింతలు ఆహారం తీసుకునేటట్లు చూడటం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా జీఓ ఎంఎస్ నెంబర్ 33(1-12-2012) ద్వారా తొలి విడతగా జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ముద్దనూరు, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టుల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. రె ండో విడతగా గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల ప్రాజెక్టు పరిధిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
నిబంధనలు ఇలా...
ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. ఇందుకు అవసరమై న కూరగాయలను గ్రామ సమాఖ్యల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. అలాగే ఈ కేంద్రాల పరిధిలో ప్రతి రోజు లబ్ధిదారులకు 200 మిల్లీలీటర్ల పాలను అందించాల్సి ఉంది. అయితే ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలో గ్రామ సమాఖ్యలు ఇప్పటి వరకు ఈ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో పథకం ప్రవేశపెట్టిన డిసెం బర్, జనవరి నెలల్లో మీరే సొంతంగా పాలు సరఫరా చేయాలని అంగన్వాడి కార్యకర్తలను అధికారులు ఆదేశించారు. చాలా మంది ఆర్థిక భారంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కూరగాయలు తెచ్చి భోజ నం మాత్రం వండి పెట్టారు. ఈ ప్రకారం ప్రతి లబ్ధిదారురాలికి రూ.15ల చొప్పున ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతోంది. స్థానిక అవసరాలను బట్టి రూ.17ల వరకు బిల్లు చెల్లించవచ్చని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు తదితర వాటిని జిల్లా అధికారులు సరఫరా చేస్తుండగా కేవలం పాలు, కూరగాయలు, పోపు గింజలకు మాత్రం కార్యకర్తలకు బిల్లులు చెల్లిస్తున్నారు.
బిల్లుల చెల్లింపు ఇలా...
అయితే లబ్ధిదారులకు చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు సరఫరా చేయలేదు. బిల్లులు మాత్రం చెల్లించారు. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో 328 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 300 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు పాలు సరఫరా చేసినట్లు బిల్లులు పెట్టారు.కొందరు ఒక రోజు, మరికొందరు వారం, మిగతా వారు నెల, రెండు నెలలు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బిల్లులు పెట్టుకున్నారు. ఈ మేరకు డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి పాల సరఫరాకుగాను రూ.8లక్షలకుపైగా అధికారులు బిల్లులు చెల్లించారు. కార్యకర్తలు రూ.100 నుంచి రూ.16వేల వరకు పాల బిల్లులను తీసుకున్నారు. ప్రభుత్వం లీటరు రూ.28 చొప్పున పాల బిల్లు చెల్లించింది. అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూరగాయల సరఫరాకుగాను రూ.16లక్షలకుపైగా బిల్లులు చెల్లించారు. వీటితోపాటు ఇంటి అద్దె బకాయిలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి అధికారులు 10-15 శాతం వరకు కమీషన్లు వసూలు చేసినట్లు తెలిసింది. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే పాల సరఫరా జరిగింది. తర్వాత ఈ పథకం ఆగిపోయింది. గ్రామ సమాఖ్యలకు ఈ అంశంపై శిక్షణ ఇచ్చామని, త్వరలోనే పాల సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు.